...
...
Next Story

పెన్షన్ కోసం వెళితే రూ.1500 కోట్లు వచ్చాయి! బీహార్ తండ్రీకొడుకుల అకౌంట్లలో వింత ఘటన

Bihar Bank Account Glitch : బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఒక విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ విత్ డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ తండ్రీకొడుకుల బ్యాంక్ ఖాతాల్లో ఏకంగా రూ.1500 కోట్లకు పైగా బ్యాలెన్స్ చూపించడంతో అధికారులు సైతం అవాక్కయ్యారు.

Published on: Jul 13, 2026, 05:39:15 IST
Advertisement

బ్యాంకు ఖాతాలో పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదో చూసుకోవడానికి వెళ్లిన ఆ వృద్ధుడికి కంప్యూటర్ స్క్రీన్​పై కనిపించిన నంబర్లు చూసి మైండ్ బ్లాంక్ అయింది! ఒకటో రెండో కాదు.. ఏకంగా రూ. 1500 కోట్లు ఆయన ఖాతాలో జమ అయినట్లు చూపించింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఆదివారం నాడు ఈ వింత సంఘటన జరిగింది. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, డిజిటల్ స్క్రీన్ పై ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కనిపించడంతో స్థానికంగా ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.

పెన్షన్ కోసం వెళ్తే.. కోట్ల వర్షం!

పెన్షన్ కోసం వెళితే రూ.1500 కోట్లు వచ్చాయి!
పెన్షన్ కోసం వెళితే రూ.1500 కోట్లు వచ్చాయి!

ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన కామేశ్వర్ మిశ్రా (82) వృత్తిరీత్యా కవి. ఆయనకు ప్రభుత్వం నుంచి ప్రతి నెలా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. అలాగే ఆయన దివ్యాంగుడైన కుమారుడికి కూడా ప్రభుత్వం వికలాంగుల పింఛన్ అందిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం నాడు తన పెన్షన్ డబ్బులు డ్రా చేసుకునేందుకు కామేశ్వర్ మిశ్రా తన కుమారుడితో కలిసి స్థానిక కామన్ సర్వీస్ సెంటర్​కు వెళ్లారు. అక్కడ పింఛన్ డబ్బులు తీసుకున్న తర్వాత, అసలు ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో ఒక్కసారి పరిశీలించాలని అక్కడి ఆపరేటర్‌ను కోరారు.

స్క్రీన్ చూసి కస్టమర్, ఆపరేటర్ షాక్!

ఆపరేటర్ కంప్యూటర్‌లో కామేశ్వర్ మిశ్రా ఖాతా వివరాలను పరిశీలించగా, అందులో ఏకంగా రూ.759,69,51,951 (సుమారు 759 కోట్లు) బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే, పక్కనే ఉన్న ఆయన దివ్యాంగుడైన కుమారుడి ఖాతాను కూడా తనిఖీ చేశారు. అందులోనూ దాదాపు అంతే మొత్తంలో వందల కోట్లు జమ అయినట్లు స్క్రీన్ పై కనిపించింది. ఈ రెండు ఖాతాల్లో కలిపి మొత్తం రూ.1,500 కోట్లకు పైగా బ్యాలెన్స్ చూపించడంతో ఆ వృద్ధుడితో పాటు పక్కనే ఉన్న సర్వీస్ సెంటర్ నిర్వాహకుడు కూడా నోరెళ్లబెట్టారు.

"మా ఖాతాల్లోకి ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందో అస్సలు అర్థం కావడం లేదు. బ్యాంకు అధికారులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ విషయంపై దర్యాప్తు జరపాలి. ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే సరిదిద్దాలని కోరుతున్నా," అని కామేశ్వర్ మిశ్రా మీడియాకు తెలిపారు.

సాంకేతిక లోపమే కారణమా?

ఈ వ్యవహారంపై బ్యాంకు యాజమాన్యం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. కాగా సాధారణంగా బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతున్నప్పుడు లేదా సిస్టమ్ లో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు ఖాతాల్లో ఇలాంటి తప్పుడు అంకెలు చూపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. గతంలోనూ కొందరి ఖాతాల్లో ఇలాగే కోట్లాది రూపాయలు కనిపించి, ఆ తర్వాత బ్యాంకులు వాటిని సరిచేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అధికారులు ఈ ఖాతాలపై నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి విచారణ జరిపితే తప్ప అసలు ఏం జరిగిందనేది స్పష్టంగా తెలియదు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe