బీహార్ రెండో దశ: చిన్న పార్టీలే కింగ్‌మేకర్లు.. తలరాతను తేల్చే సామాజిక సమీకరణాలు

Bihar Election: బీహార్‌లో నవంబర్ 11న జరగనున్న రెండో దశ ఎన్నికలు ఎన్డీయే, మహాకూటమికి కీలకం కానున్నాయి. 20 జిల్లాల పరిధిలోని 122 స్థానాల్లో చిన్న మిత్రపక్షాల పోరు ప్రభుత్వాన్ని నిర్ణయించనుంది. అవి ఎన్ని సీట్లు గెలుస్తాయన్నదానిపైనే ఈసారి బీహార్ అసెంబ్లీ పీఠం ఎవరికి దక్కుతుందో తేలుతుంది.

Published on: Nov 10, 2025, 09:14:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు మరింత ఆసక్తిగా మారుతోంది. మొదటి దశలో రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు కాగా, నవంబర్ 11న రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 20 జిల్లాల పరిధిలోని 122 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. 3 కోట్ల 70 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

బీహార్ రెండో దశ: చిన్న పార్టీలే కింగ్‌మేకర్లు.. తలరాతను తేల్చే సామాజిక సమీకరణాలు
బీహార్ రెండో దశ: చిన్న పార్టీలే కింగ్‌మేకర్లు.. తలరాతను తేల్చే సామాజిక సమీకరణాలు

ఈ రెండో దశ ఎన్నికలే.. బీహార్‌లో అధికారం ఎవరికి దక్కుతుందో నిర్ణయించే అత్యంత కీలకంగా మారాయి. ఇక్కడ ప్రధాన పార్టీల కంటే కూడా, వారి మిత్ర పక్షాల ప్రదర్శనే ఫలితాలను తారుమారు చేయనుంది. ఈ దశలో చిన్న పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించడం, వాటిపై అధికారం ఆధారపడి ఉండడం ఈ ఎన్నికల్లో కీలక అంశం.

ఎన్డీయే లెక్కలు: దళితులు, బీసీలు కీలకం

ఎన్డీయే కూటమిలో ఈసారి చిన్న పార్టీలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా దళిత, బీసీ వర్గాల నేతలకు కేటాయించిన సీట్లలో గెలుపు కీలకంగా మారింది.

చిరాగ్ పాశ్వాన్ (LJP - రామ్ విలాస్): కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ మొత్తం 29 సీట్లు దక్కించుకోగా, ఒక అభ్యర్థి నామినేషన్ రద్దు కావడంతో, ఆయన పార్టీ 28 స్థానాల్లో పోటీ చేస్తోంది. అందులో 15 స్థానాలు ఈ రెండో దశలోనే ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయాన్ని నమోదు చేసిన చిరాగ్ పాస్వాన్ డిమాండ్‌ను ఎన్డీయే పెద్దలు తోసిపుచ్చలేక, 29 సీట్లు కేటాయించారు.

జీతన్ రామ్ మాంఝీ (HAM): బీహార్ మాజీ ముఖ్యమంత్రి, దళిత నేత జీతన్ రామ్ మాంఝీ పార్టీ హెచ్‌ఏఎం (HAM) మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉండగా, వారందరూ కూడా ఈ రెండో దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఉపేంద్ర కుష్వాహా (RLSP): ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని పార్టీకి కేటాయించిన ఆరు సీట్లలో నాలుగు స్థానాలు ఈ దశలోనే పోలింగ్‌కు వెళ్తున్నాయి. వీటిలో ఆయన సతీమణి స్నేహలత కుష్వాహా కూడా పోటీలో ఉండడం విశేషం.

ముఖ్యంగా, పాశ్వాన్, మాంఝీ ఇద్దరూ దళిత నేతలు కావడం, కుష్వాహా బీసీలలో కీలక వర్గానికి ప్రాతినిధ్యం వహించడం ఎన్డీయేకు సామాజిక సమీకరణాల పరంగా కీలకం.

మహాకూటమి లెక్కలు: మగధ్, నిషాద్ ఓట్లు కీలకం

మహాకూటమి (ఆర్జేడీ సారథ్యం) కూడా ఈ రెండో దశలో తమ మిత్రపక్షాల మీదే ఎక్కువ ఆధారపడింది.

మగధ్ ప్రాంతంపై ఆశలు: గత ఎన్నికల ఫలితాల ప్రకారం, మహాకూటమికి మగధ్ ప్రాంతం అడ్డా. గతంలో ఇక్కడ ఉన్న 26 సీట్లలో ఏకంగా 20 స్థానాలను ఆర్జేడీ కూటమి గెలుచుకుంది. ఈ బలం ఈసారి కూడా కొనసాగితే, కూటమికి విజయం దక్కుతుంది.

కాంగ్రెస్ పోటీ: ఈ దశలో మొత్తం 61 స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో బరిలో ఉంది. కాంగ్రెస్ పనితీరు మహాకూటమికి చాలా కీలకం.

ముకేశ్ సహానీ (VIP): నిషాద్ (బెస్త) వర్గానికి చెందిన ముకేశ్ సహానీ నేతృత్వంలోని వికాసశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) 12 సీట్లలో పోటీ చేస్తుండగా, అందులో ఏడు స్థానాలు ఈ దశలోనే ఉన్నాయి. బీహార్‌లో దాదాపు 2.6 శాతం నిషాద్ ఓట్లు ఉన్న నేపథ్యంలో, సహానీపై మహాకూటమి పెద్ద ఎత్తున పందెం వేసింది.

తిర్హుత్, సీమాంచల్ ప్రాంతాల్లో పోరు

బీహార్‌లో ముఖ్యంగా తిర్హుత్ రీజియన్‌లో ఎన్డీయే కూటమికి బలమైన పట్టు ఉంది. ఈ ప్రాంతంలోని 30 సీట్లలో ఎన్డీయే గతంలో 23 స్థానాలు గెలిచింది. మరోవైపు, మధుబని జిల్లాలోని 10 సీట్లలో 8 స్థానాలకు ఈ దశలో పోలింగ్ ఉంది.

సీమాంచల్ ప్రాంతంలో: ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ (AIMIM) బరిలో ఉంది. గత ఎన్నికల్లో ఒవైసీ పార్టీ 24 స్థానాల్లో పోటీ చేసి ఐదు సీట్లను గెలుచుకుంది. ఈసారి ఆయన ప్రభావం ఎంత మేరకు ఉంటుందనేది కూడా కీలకమే.

పీకే ఎంట్రీతో త్రిముఖ పోరు

ప్రశాంత్ కిషోర్ ఈసారి బీహార్ రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపారు. సాంప్రదాయకంగా ఎన్డీయే, మహాకూటమిల మధ్య ద్విముఖ పోరు జరిగే కొన్ని సీట్లలో ఆయన అభ్యర్థులు బరిలోకి దిగి పోటీని త్రిముఖంగా మార్చారు. ఇది ఏ కూటమి ఓట్లను చీలుస్తుందనేది ఆసక్తికరం.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More