...
...
Next Story

అతనితో గడిపిన ప్రతి నిమిషం నాకు పశ్చాత్తాపమే: ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై బిల్ గేట్స్

లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న సంబంధాలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "అతనితో గడిపిన ప్రతి నిమిషం నాకు పశ్చాత్తాపమే మిగిల్చింది" ఆయన పేర్కొన్నారు. అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన ఎప్‌‌స్టీన్ ఫైల్స్ నేపథ్యంలో గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Published on: Feb 5, 2026, 07:27:34 IST
Advertisement

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తన గతాన్ని తలుచుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాను కుదిపేసిన సెక్స్ రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న పరిచయంపై ఆయన తొలిసారి అంత బహిరంగంగా స్పందించారు. "అతనితో గడిపిన ప్రతి నిమిషం నాకు పశ్చాత్తాపమే మిగిల్చింది" అని గేట్స్ వాపోయారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై బిల్ గేట్స్ (Photographer: Krisztian Bocsi/Bloomberg)
ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై బిల్ గేట్స్ (Photographer: Krisztian Bocsi/Bloomberg)

బుధవారం 'నైన్ న్యూస్ ఆస్ట్రేలియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్ మాట్లాడుతూ.. ఎప్‌స్టీన్‌ను కలవడం తన జీవితంలో చేసిన ఒక "మూర్ఖపు పని" అని ఒప్పుకున్నారు. తాజాగా అమెరికా న్యాయ శాఖ (DOJ) విడుదల చేసిన పత్రాల్లో తన పేరు ప్రస్తావనకు రావడంతో ఆయన ఈ వివరణ ఇచ్చారు.

"అవన్నీ అబద్ధపు ఆరోపణలు"

తాజా ఫైళ్లలో ఎప్‌స్టీన్ తన గురించి రాసుకున్న విషయాలను బిల్ గేట్స్ పూర్తిగా కొట్టిపారేశారు. "ఎప్‌స్టీన్ తనకు తాను ఒక ఈమెయిల్ రాసుకున్నాడు. అది ఎవరికీ పంపలేదు, అందులో ఉన్నవన్నీ పచ్చి అబద్ధాలు. బహుశా నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే అతను అలా రాసి ఉంటాడు" అని గేట్స్ పేర్కొన్నారు.

2013 నాటి ఈమెయిల్స్ ప్రకారం.. బిల్ గేట్స్, మెలిండాల మధ్య జరిగిన వైవాహిక వివాదంలో తాను జోక్యం చేసుకున్నానని, గేట్స్‌కు డ్రగ్స్ సరఫరా చేయడంలో సాయం చేశానని ఎప్‌స్టీన్ ఆ పత్రాల్లో పేర్కొన్నాడు. అయితే వీటిని గేట్స్ ప్రతినిధులు "పూర్తిగా అసంబద్ధం" అని కొట్టిపారేశారు. గేట్స్‌తో సంబంధాన్ని కొనసాగించలేకపోయాననే నిరాశతోనే ఎప్‌స్టీన్ ఇలాంటి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టాడని వారు స్పష్టం చేశారు.

ఎందుకు కలవాల్సి వచ్చింది?

బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ సైతం ఈ పరిణామాలపై స్పందించారు. ఎప్‌స్టీన్ ఫైళ్లలో తన మాజీ భర్త పేరును చూడటం "నమ్మలేనంత బాధను" కలిగిస్తోందని ఆమె అన్నారు. 'వైల్డ్ కార్డ్' అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. "ఆ వివాదాలకు సంబంధించి ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పాల్సింది నా మాజీ భర్తే కానీ నేను కాదు. ఆ మురికి నుంచి నేను బయటపడినందుకు చాలా సంతోషంగా ఉన్నాను" అని ఆమె కుండబద్దలు కొట్టారు.

నేపథ్యం ఇదీ

జెఫ్రీ ఎప్‌స్టీన్ అమెరికాలో సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై 2019లో జైలు శిక్ష అనుభవిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. అతనితో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల పేర్లు ఈ పత్రాల్లో బయటకు వచ్చాయి. ప్రస్తుతానికి ఎప్‌స్టీన్ సహచరురాలు ఘిస్లేన్ మాక్స్‌వెల్ మాత్రమే ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe