Bittu Tabahi : ధ్రువ్ రాఠీకి బిట్టు కౌంటర్- ఒంటరిగా నదిని శుభ్రం చేసిన యువకుడు ఏమ్మన్నాడంటే..
మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్టు తబాహి ఒంటరిగా అజ్నార్ నదిని శుభ్రం చేసి వార్తల్లో నిలిచాడు. అయితే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను అతడు కలవడంపై యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చేసిన విమర్శలు, బిట్టు ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లై ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
సమాజంలో మార్పు తీసుకురావడానికి పెద్ద సైన్యం అవసరం లేదు, దృఢ సంకల్పం ఉన్న ఒక్కరు చాలని నిరూపించాడు మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు సురేంద్ర సింగ్ చౌదరి. సోషల్ మీడియాలో “బిట్టు తబాహి”గా ప్రాచుర్యం పొందిన ఈ కుర్రాడు, గుణ జిల్లా బియోరా ప్రాంతంలో తీవ్రంగా కలుషితమైన 'అజ్నార్' నదిని పునరుద్ధరించేందుకు నడుంబిగించాడు.

గత ఏడాది రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా ఎలాంటి యంత్రాలు లేదా భారీ బడ్జెట్ లేకుండా, చేతిలో కేవలం ఒక పార పట్టుకుని ఈ సాహసోపేతమైన ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తీవ్రమైన దుర్వాసన, విషపూరితమైన పాములు, కాళ్లకు ఇన్ఫెక్షన్లు సోకినప్పటికీ వెరవకుండా నదిలోని వ్యర్థాలను తొలగించాడు. నది శుభ్రపడక ముందు, ఆ తర్వాత తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయింది.
అయితే బిట్టు ఇప్పుడు ఊహించని పొలిటికల్ డ్రామాలో చిక్కుకున్నాడు!
ముఖ్యమంత్రితో భేటీ.. పొలిటికల్ డ్రామా!
బిట్టు కృషికి ముగ్ధుడైన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, ఆ యువకుడిని భోపాల్‌లోని తన అధికారిక నివాసానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ మీటింగ్‌కి సంబంధించిన వీడియోను సీఎం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. "బిట్టు చేసిన ఈ పని సమాజానికి గొప్ప సందేశం ఇస్తోంది. నీటి వనరుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన 'జల్ గంగా సంవర్ధన్ అభియాన్' లక్ష్యాలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది," అని కొనియాడారు.
సమస్య తీవ్రతను గుర్తించిన స్థానిక బియోరా మున్సిపాలిటీ కూడా వెంటనే స్పందించి, పేరుకుపోయిన భారీ వ్యర్థాలను తొలగించడానికి జేసీబీ వంటి యంత్రాలను పంపి బిట్టుకు సహకారం అందించింది.
అయితే, ఈ పరిణామంపై ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న మొన్నటివరకు బిట్టుకు ఎలాంటి సాయం చేయని ప్రభుత్వం ఇప్పుడు ఫ్రీ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ సీఎం వీడియో కింద కామెంట్ చేశారు.
"వచ్చేసారయ్యా పబ్లిసిటీ క్రెడిట్ కొట్టేయడానికి! పనిమొత్తం ఆ కుర్రాడే చేశాడు. అది వైరల్ కాగానే ఫోటోషూట్ కోసం పిలిపించుకున్నారు. పైగా అతని చేత 'ప్రభుత్వం పనిచేస్తోంది' అని చెప్పిస్తుండటం ఎంత సిగ్గుచేటు? ప్రభుత్వం ఏంచేస్తోంది? ఏమీ లేదు, కేవలం పీఆర్ స్టంట్లు మాత్రమే!" అని ధ్రువ్ రాఠీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ విమర్శలపై బిట్టు తబాహి స్వయంగా స్పందించడం విశేషం! ఏమాత్రం భయపడకుడా ధ్రువ్ రాఠీకి కామెంట్లలోనే అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు ఈ కుర్రాడు.
"ధ్రువ్ భయ్యా, ఇది క్రెడిట్ తీసుకోవడానికి సంబంధించిన విషయం కానే కాదు. ప్రభుత్వం ఇదివరకు కూడా నా పనిని గుర్తించి అభినందించింది. ఇక్కడ ముఖ్యమైనది సివిక్ సెన్స్. నాలాగా ప్రజలు కూడా తమ బాధ్యతను గుర్తించి స్వచ్ఛత కోసం ముందుకు రావాలనేదే నా కోరిక," అని బిట్టు అత్యంత పరిణతితో బదులిచ్చాడు.

ఈ ఘటనతో ప్రస్తుతం సోషల్ మీడియాలో బిట్టు తబాహి పేరు మరింత మారుమోగిపోతోంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే, ఒక సామాన్య పౌరుడిగా స్వచ్ఛత కోసం పోరాటం చేయడమే నిజమైన దేశభక్తి అని నెటిజన్లు ఆ యువకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కెవిన్ పీటర్సన్ పోస్ట్
బిట్టు చేసిన ఈ భగీరథ ప్రయత్నం ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ దృష్టిని ఆకర్షించింది. బిట్టు చేసిన గొప్ప పని గురించి తెలుసుకున్న పీటర్సన్ వెంటనే తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు.
"ఈ ఉదయాన్నే ఈ కథనాన్ని చదివాను, వెంటనే మీతో పంచుకోవాలనిపించింది! వెల్డన్, చాలా బాగా చేశావు! 21 ఏళ్ల వయస్సులో బిట్టు తబాహి ఎలాంటి గ్లోవ్స్, బూట్లు లేకుండా, ఈత కూడా రాకపోయినా కలుషిత నదిలోకి దిగి ప్రక్షాళన ప్రారంభించాడు. ప్లాస్టిక్ నిండిన నదిని బాగుచేసి, పూజా వ్యర్థాలను ఎరువుగా మార్చాడు. చేతులకు ఇన్ఫెక్షన్లు వచ్చినా, కొందరు లైక్స్ కోసం చేస్తున్నాడని విమర్శించినా అతడు ఆపలేదు. మార్పు అనేది వేరొకరు మొదలుపెడతారని ఎదురుచూడటం ఆపినప్పుడే మొదలవుతుంది. ఇతను నిజమైన హీరో! అతనికి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కాలి!" అని పీటర్సన్ కొనియాడారు.
ఒక సామాన్య భారతీయ కుర్రాడు చేసిన పని ప్రపంచ స్థాయి క్రీడాకారుడిని సైతం కదిలించడం నిజంగా గొప్ప విషయం. ప్రభుత్వంపై ఆధారపడకుండా పౌర బాధ్యతతో పనిచేస్తే ఎంతటి అద్భుతాలు సృష్టించవచ్చో బిట్టు తబాహి తన పట్టుదలతో నిరూపించి చూపించాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


