IND vs ENG : రూమర్స్‌కి చెక్.. రోహిత్ శర్మ సెంచరీ- అయినా ఓడిపోయిన టీమిండియా! ఇంగ్లాండ్‌లో ముగిసిన రో-కో శకం
IND vs ENG 3rd odi : టీమిండియాకు మరో సిరీస్ వైఫల్యం తప్పలేదు! రిటైర్మెంట్ రూమర్స్‌కి చెక్ పెడుతూ, రోహిత్ శర్మ చేసిన వీరోచిత సెంచరీ.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. ఫలితంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లలో టీ20 సిరీస్ ఓడిపోయిన టీమిండియా, ఇప్పుడు వన్డే సిరీస్‌ని కూడా చేజార్చుకుంది.
లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన హై-స్కోరింగ్ వన్డే మ్యాచ్‌లో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నిర్ణయాత్మక మూడో వన్డేలో 388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (138) సంచలన సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.

మ్యాచ్‌లో ఓడిపోయినా, టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం హీరోలా నిలిచాడు! తన ఫామ్‌పై విమర్శలు గుప్పిస్తున్న వారికి, రిటైర్ అయిపోతాడంటూ వచ్చిన వార్తలకి.. తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికేస్తూ 138 పరుగుల (110 బంతులు, 17 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత శతకంతో చెలరేగాడు. అసాధ్యమనుకున్న లక్ష్యం.. రోహిత్ ఆడుతున్నంత సేపు సాధ్యమయ్యేలానే కనిపించింది. కానీ, చివరి 11 ఓవర్లలో ఓవర్లకు 11 పరుగుల చొప్పున చేయాల్సిన రన్ రేట్ ఒత్తిడిని తట్టుకునే టీ20 తరహా హిట్టర్లు మిడిల్ ఆర్డర్‌లో లేకపోవడంతో మూడో వన్డేలో భారత్‌కు ఓటమి తప్పలేదు.
అంతకుముందు లార్డ్స్ మైదానం నలుమూలలా ఇంగ్లాండ్ బ్యాటర్లు మన అనుభవం లేని బౌలర్లను దారుణంగా దంచికొట్టారు. అయినప్పటికీ 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు పట్టుదలతో పోరాడారు. రెండో ఇన్నింగ్స్‌లో ఎక్కువ భాగం టీమిండియా రేసులోనే నిలిచింది. అయితే, 24 ఏళ్ల క్రితం నాటి ప్రసిద్ధ నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ నాటి మ్యాజిక్‌ను భారత్ ఇక్కడ పునరావృతం చేయలేకపోయింది.
రోహిత్-గిల్ అదిరిపోయే భాగస్వామ్యం..
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ పవర్‌ప్లేలో చాలా వ్యూహాత్మకంగా ఓవర్లకు 5 పరుగుల చొప్పున బ్యాటింగ్ చేశారు. బంతి తమ జోన్‌లోకి వస్తే తప్ప అనవసర షాట్లకు పోలేదు. తద్వారా వికెట్లు పారేసుకోలేదు. రోహిత్ తన ట్రేడ్‌మార్క్ పుల్ షాట్లతో విరుచుకుపడగా, పేసర్లు వేసిన లెంగ్త్ బంతులను గిల్ బౌండరీలకు తరలించాడు.
సహజమైన క్లాస్ షాట్లు, అవసరమైనప్పుడు రిస్క్ తీసుకుంటూ భారత ఓపెనర్లు స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఇన్నింగ్స్ సగభాగంలో శుభ్‌మన్ గిల్ (84 బంతుల్లో 77) ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అప్పటికి కావాల్సిన రన్ రేట్ 10కి చేరువవుతున్నా, భారత అభిమానుల్లో గెలుపు ఆశలు మాత్రం సజీవంగానే ఉన్నాయి.
విమర్శకుల నోళ్లు మూయించిన హిట్ మ్యాన్!
గిల్ అవుటైన తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. కోహ్లీ బ్యాటింగ్ జోరును అడ్డుకోవడానికి జోఫ్రా ఆర్చర్‌కు ఇంగ్లాండ్ అదనంగా మరో ఓవర్ ఇచ్చింది. కోహ్లీ కూడా ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా మూడోసారి అవుట్ అయ్యే అవకాశం ఇవ్వకుండా, డీప్ మిడ్-వికెట్ మీదుగా అద్భుతమైన ఫోర్ బాదాడు.
మరోవైపు జోష్ టంగ్ బౌలింగ్‌ను టార్గెట్ చేసిన రోహిత్, వరుసగా రెండు స్ట్రెయిట్ సిక్సర్లు బాదాడు. మ్యాచ్ 31వ ఓవర్లో ఆదిల్ రషీద్ బౌలింగ్‌ను స్లాగ్-స్వీప్ చేస్తూ రోహిత్ వన్డేల్లో తన 34వ సెంచరీని పూర్తి చేయడంతో స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. గత 9 నెలలుగా సెంచరీ లేని రోహిత్, తన రిటైర్మెంట్ గురించి వస్తున్న విమర్శలన్నింటికీ ఈ ఇన్నింగ్స్‌తో చెక్ పెట్టాడు. లార్డ్స్ బాల్కనీలో టీమిండియా సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందిస్తున్నా, రోహిత్ మాత్రం ఇంకా పని పూర్తి కాలేదన్నట్టు హెల్మెట్ కూడా తీయకుండా సీరియస్‌గా బ్యాటింగ్ కొనసాగించాడు.
ఆ తర్వాత రోహిత్‌కు కండరాలు పట్టేయడంతో సింగిల్స్ తీయడం కష్టంగా మారింది. దీనితో కోహ్లీతో మాట్లాడి కేవలం పెద్ద షాట్ల కోసమే ప్రయత్నించాడు. కొంత విధ్వంసం సృష్టించిన అనంతరం జాకబ్ బెథెల్ బౌలింగ్‌లో రోహిత్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీపై భారం పడింది. కోహ్లీ 74 పరుగుల (60 బంతుల్లో) వద్ద సామ్ కరన్ బౌలింగ్‌లో అవుటవడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ సారి సెంచరీ ఖాయం అనుకున్న కోహ్లీ ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది.
ఈ విధంగా.. ఇంగ్లాండ్‌లో రో-కో (రోహిత్- కోహ్లీ) శకం ముగిసింది! 2027 వన్డే ప్రపంచ కప్ అనంతరం ఈ లెజెండ్స్ రిటైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఆ ముందు ఇంగ్లాండ్‌తో మళ్లీ వన్డే సిరీస్ షెడ్యూల్ అవ్వకపోవడం ఇందుకు కారణం.
బౌలింగ్ వైఫల్యం దెబ్బకొట్టింది!
మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. ఇందులో భాగంగానే రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టింది. అయితే జట్టులోని ముగ్గురు పేసర్లు - ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్‌లకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో లార్డ్స్ పిచ్ బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి అనే విషయాన్ని యాజమాన్యం సరిగ్గా అంచనా వేయలేకపోయింది. వారి లైన్ అండ్ లెంగ్త్ లోపాలను ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డకెట్ (135 బంతుల్లో 141), జాకబ్ బెథెల్ (93 బంతుల్లో 91) పూర్తిగా వాడుకుని పరుగుల వరద పారించారు.
ఈ సిరీస్‌లో అంతకుముందు బాగా రాణించిన గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 97 పరుగులు ఇచ్చాడు. చివరి 5 ఓవర్లలో ఇంగ్లాండ్ ఏకంగా 82 పరుగులు రాబట్టడం గమనార్హం. వన్డే మొనగాడు జో రూట్ 74* (48 బంతుల్లో) ప్రదర్శనతో ఈ సిరీస్ పొడవునా నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు భారీ స్కోరు అందించాడు.
జూన్ నెలలో ఐర్లాండ్‌తో టీ20 ఓటమి, జులైలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఓటమి అనంతరం ఇప్పుడు టీమిండియా.. వన్డే సిరీస్‌ని కూడా చేజార్చుకుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


