BMW LayOffs: బీఎండబ్ల్యూలో 8 వేల ఉద్యోగాల కోత.. ఆటోమొబైల్ రంగంపై ఆర్థిక మందగమన ప్రభావం
BMW LayOffs: ప్రపంచవ్యాప్తంగా వాహనాల విక్రయాలు పడిపోవడం, లాభాలు తగ్గడంతో జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం 'బీఎండబ్ల్యూ' (BMW) భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. 2027 చివరి నాటికి జర్మనీలో దాదాపు 8,000 డెస్క్ ఉద్యోగాలను తొలగించనున్నట్లు వెల్లడించింది.
ఆటోమొబైల్ రంగాన్ని వేధిస్తున్న మందగమనం ఇప్పుడు ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూను చుట్టుముట్టింది. కస్టమర్ల నుంచి డిమాండ్ తగ్గడం, చైనా కంపెనీల పోటీ, లాభాలు క్షీణిస్తున్న నేపథ్యంలో 2027 చివరి నాటికి జర్మనీలో వేలాది ఉద్యోగాలను తగ్గించుకోవాలని బీఎండబ్ల్యూ నిర్ణయించింది. స్వచ్ఛంద విరమణ (Voluntary Redundancy) పథకం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సిఎన్‌బిసి (CNBC) నివేదిక స్పష్టం చేసింది.

కంపెనీ వర్క్స్ కౌన్సిల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఈ లేఆఫ్‌లు కేవలం అడ్మినిస్ట్రేటివ్, డెవలప్‌మెంట్ విభాగాలకే పరిమితం కానున్నాయి. ప్రొడక్షన్ (కార్ల తయారీ) విభాగంలో పనిచేసే కార్మికులపై దీని ప్రభావం ఉండదని బీఎండబ్ల్యూ ప్రతినిధి స్పష్టం చేశారు. బీఎండబ్ల్యూ ప్రతిపాదించిన ఈ ప్రణాళిక ద్వారా దాదాపు 8,000 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో దాదాపు 1.5 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
చైనా పోటీ.. అమెరికా సుంకాల దెబ్బ
జర్మనీకి చెందిన ఇతర కార్ల తయారీ దిగ్గజాలు ఫోక్స్‌వాగన్, మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేశాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారీగా ఖర్చు చేయడం, చైనా ఆటోమొబైల్ కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదురవడం, అమెరికా విధించిన టారిఫ్‌లు మొత్తం జర్మన్ కార్ల పరిశ్రమను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయి.
ఈ వారంలోనే ఫోక్స్‌వాగన్ గ్రూప్‌నకు చెందిన 'పోర్షే' కంపెనీ తన పునర్నిర్మాణ ప్రణాళికను విస్తరిస్తూ, 2035 నాటికి 20 శాతం ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఆడి (Audi) కంపెనీ జర్మనీలోని తన నాలుగు ప్లాంట్లలో ఒకటైన నెకార్సుల్మ్ ప్లాంట్‌ను మూసివేసే యోచనలో ఉండటంతో బుధవారం వేలాది మంది ఆడి కార్మికులు నిరసనలకు దిగారు.
పడిపోయిన అమ్మకాలు.. తగ్గిన లాభాల అంచనా
ఇప్పటివరకు జర్మనీ ఆటోమొబైల్ రంగంలో అత్యంత బలంగా నిలిచిన బీఎండబ్ల్యూ, జూన్ నెలలో తన వార్షిక లాభాల అంచనాలను తగ్గించుకుంది. ముఖ్యంగా చైనా మార్కెట్లో ఊహించని రీతిలో కార్ల విక్రయాలు పడిపోవడమే దీనికి ప్రధాన కారణం.
లాభాల అంచనాలను సవరించిన అనంతరం వ్యయ నియంత్రణ చర్యలను వేగవంతం చేస్తామని కంపెనీ సీఈఓ మిలన్ నెడెల్కోవిచ్ (Milan Nedeljkovic) ప్రకటించారు.
"ఆటోమొబైల్ పరిశ్రమలోని నిర్వహణ వాతావరణం ప్రాథమికంగా మారిపోయింది. బీఎండబ్ల్యూ తన వ్యాపార నమూనాను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది" అని మ్యూనిచ్‌లో జరిగిన కార్మికుల సమావేశంలో సీఈఓ మిలన్ నెడెల్కోవిచ్ పేర్కొన్నారు.
కంపెనీ కఠినమైన కాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, సుదీర్ఘకాలంలో లాభదాయకతను పెంచుకోవడానికి ఈ మార్పులు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మేనేజ్‌మెంట్ నిర్మాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వ్యయ నియంత్రణ ప్రాధాన్యతల దృష్ట్యా ఈ ఏడాది పారిస్ మోటార్ షో నుంచి కూడా బిఎమ్‌డబ్ల్యూ తప్పుకుంది.
జర్మనీలో ఉద్యోగాల తొలగింపు అంత సులువు కాదు
జర్మనీలోని కఠినమైన కార్మిక చట్టాల కారణంగా ఉద్యోగులను నేరుగా తొలగించడం కంపెనీలకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే బీఎండబ్ల్యూ ఆకర్షణీయమైన పరిహార ప్యాకేజీలు ఇచ్చి voluntary exit (స్వచ్ఛంద విరమణ) పద్ధతిని ఎంచుకుంది.
2025 చివరి నాటికి జర్మనీలో బీఎండబ్ల్యూకి 87,436 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే జర్మనీలోని ఉద్యోగుల సంఖ్య ఇప్పటికే 2.3 శాతం తగ్గింది. ఇక లేఆఫ్‌ల వార్తల నేపథ్యంలో ఫ్రాంక్‌ఫర్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బీఎండబ్ల్యూ షేర్లు 1.9 శాతం మేర పుంజుకున్నప్పటికీ, ఈ ఏడాది మొత్తంగా షేరు విలువ మూడోవంతు కంటే ఎక్కువగానే పడిపోయింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


