BRICS Summit : అసలు బ్రిక్స్ అంటే ఏంటి? ఇన్నేళ్లల్లో ఈ కూటమి సాధించింది ఏంటి?
భారత రాజధాని దిల్లీ వేదికగా శనివారం బ్రిక్స్ దేశాల వార్షిక సదస్సు ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు బ్రిక్స్ అంటే ఏంటి? దీని చరిత్ర ఏంటి? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారత రాజధాని దిల్లీ వేదికగా శనివారం అత్యంత కీలకమైన 'బ్రిక్స్' (BRICS) దేశాల వార్షిక శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, ఇంధన మార్కెట్లలో అనిశ్చితి, అంతర్జాతీయ నౌకా రవాణా ఆటంకాలు, సరఫరా గొలుసుల (సప్లై చైన్) నిలిపివేత సవాళ్ల నడుమ ఈ భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
దిల్లీలో బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో అసలు బ్రిక్స్ అంటే ఏంటి? బ్రిక్స్ ఎందుకు ఏర్పడింది? దీని చరిత్రేంటి? ఇప్పటివరకు ఏం సాధించింది? బ్రిక్స్ ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? వాటి పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
బ్రిక్స్ నేపథ్యం.. ఐదు నుంచి పది దేశాలకు ప్రయాణం!
2001లో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ ప్రధాన అర్థశాస్త్రవేత్త జిమ్ ఓ నీల్ 'బ్రిక్' (బీఆర్ఐసీ - బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పదాన్ని ప్రయోగాత్మకంగా తెరపైకి తెచ్చారు. వేగంగా ఎదుగుతున్న ఈ నాలుగు ఆర్థిక వ్యవస్థల సామర్థ్యాన్ని ఆయన తన పరిశోధనా పత్రంలో వివరించారు. ఆ తర్వాత 2009లో ఈ నాలుగు దేశాలు ఒక కూటమిగా రూపుదిద్దుకున్నాయి. 2011లో దక్షిణాఫ్రికా చేరడంతో ఇది 'బ్రిక్స్' (బీఆర్ఐసీఎస్)గా అవతరించింది.
కాలక్రమేణా ఈ కూటమి ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈలు ఈ బ్రిక్స్‌లో పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరగా, 2025లో ఇండోనేషియా ఈ వేదికపైకి అడుగుపెట్టింది. సౌదీ అరేబియాకు కూడా ఆహ్వానం పంపినప్పటికీ, ఆ దేశం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రపంచ మొత్తం జనాభాలో 40 శాతానికి పైగా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాదాపు పావు వంతు ఉత్పత్తి సామర్థ్యం ఒక్క బ్రిక్స్ కూటమి వద్దే ఉంది!
డాలర్ ఆధిపత్యానికి చెక్.. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ విజయాలు
పాశ్చాత్య దేశాలు, అమెరికా ఏకఛత్రాధిపత్యంతో నడిచే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలవడమే బ్రిక్స్ ప్రధాన ఉద్దేశం. అభివృద్ధి చెందుతున్న దేశాలు (గ్లోబల్ సౌత్) తమ ఆకాంక్షలను వినిపించే వేదికగా దీనిని మలిచాయి. రాజకీయ, భద్రతా, ఆర్థిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతో పాటు సాంస్కృతిక సంబంధాలను పెంపొందించుకోవడంపై ఈ బ్రిక్స్ కూటమి దృష్టి సారించింది.
బ్రిక్స్ సాధించిన అతిపెద్ద విజయం 'న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్' (ఎన్డీబీ) అని చెప్పుకోవాలి. 2015లో ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ ఇప్పటివరకు దాదాపు 43 బిలియన్ డాలర్ల విలువైన 139 మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసింది. అయితే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో, అక్కడ కొత్త లావాదేవీలను బ్యాంక్ నిలిపివేసింది.
స్వదేశీ కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడంలో బ్రిక్స్ అడుగులు వేస్తోంది. 'బ్రిక్స్ పే' పేరుతో కొత్త చెల్లింపుల వ్యవస్థను తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సభ్యదేశాల వేగవంతమైన డిజిటల్ పేమెంట్ వ్యవస్థలను అనుసంధానించడం ద్వారా డాలర్‌తో పనిలేకుండా నేరుగా సొంత కరెన్సీల్లోనే అంతర్జాతీయ వ్యాపార చెల్లింపులు జరపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ పరిణామం భారత రూపాయికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవడానికి దోహదపడుతుంది.
అంతర్గత విబేధాలు.. భారత్ ముందున్న దౌత్య పరీక్ష!
బ్రిక్స్ కూటమి విస్తరిస్తున్న కొద్దీ సభ్యదేశాల మధ్య భిన్నాభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. రష్యా, చైనాలు బ్రిక్స్‌ను అమెరికా, ఐరోపా దేశాలకు వ్యతిరేక వేదికగా మలచాలని భావిస్తుంటే.. భారత్, బ్రెజిల్‌లు మాత్రం దీనిని కేవలం ఆర్థిక సంస్కరణలు, వృద్ధి వేదికగానే పరిగణిస్తున్నాయి.
ప్రత్యేకించి పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ ఒకవైపు, అమెరికా మిత్రదేశమైన యూఏఈ మరోవైపు నిలవడం కూటమి దౌత్యానికి సవాలుగా మారింది. దిల్లీ సదస్సులో ఇరుదేశాల మధ్య సమన్వయం సాధించి ఉమ్మడి ప్రకటన విడుదల చేయించడం భారత విదేశాంగ విధానానికి పరీక్షగా మారనుంది.
పాశ్చాత్య దేశాల ఆందోళన.. ట్రంప్ ఆంక్షల హెచ్చరికలు
బ్రిక్స్ ఎదుగుదలను పాశ్చాత్య దేశాలు తీవ్రంగా గమనిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కూటమిపై పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. డాలర్ స్థానంలో ఉమ్మడి బ్రిక్స్ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తే సదరు దేశాల ఉత్పత్తులపై 100 శాతం టారిఫ్‌లు (దిగుమతి సుంకాలు) విధిస్తామని ఆయన హెచ్చరించారు. గతంలో బ్రెజిల్ ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన తెచ్చినప్పటికీ, ఆచరణాత్మక సమస్యల వల్ల ఆ ఆలోచనను పక్కనబెట్టారు.
ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ దిల్లీ సదస్సు ద్వారా గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంలో భారత్ ఏ రకమైన వ్యూహాత్మక పాత్ర పోషిస్తుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


