BRICS Summit : దిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సు- ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ఈ సేవలు బంద్..
ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ సదస్సు కోసం దేశ రాజధాని దిల్లీ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. విదేశీ ప్రతినిధులు, వివిధ దేశాల అధినేతలు హాజరవుతున్న ఈ వేడుక నేపథ్యంలో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు నగరం వ్యాప్తంగా భారీ భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్న 'భారత్ మండపం' వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ (BRICS) అధినేతల సమిట్ ప్రారంభం కానుంది. ప్రపంచ దిగ్గజ దేశాల నాయకులు, విదేశీ ప్రతినిధులు తరలివస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం, దిల్లీ యంత్రాంగం నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. వీవీఐపీ వాహనాల రాకపోకల దృష్ట్యా సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు నగరంలో పలు సేవలకు ఆటంకం కలగనుంది.

ఉద్యోగ, వ్యాపార లేదా పర్యటన నిమిత్తం దిల్లీకి ప్రయాణమయ్యే వారు ఈ మూడు రోజుల పాటు విధించిన ఆంక్షలు, మూతపడే సేవల వివరాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.
దిల్లీలో బ్రిక్స్ సదస్సు- పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు..
భద్రతా కారణాల దృష్ట్యా సెప్టెంబర్ 11న (శుక్రవారం) దిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సెప్టెంబర్ 11ను స్థానిక సెలవు దినంగా ప్రకటించారు. దీనితో పాటు దిల్లీ ప్రభుత్వ పరిధిలోని కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు శుక్రవారం మూతపడనున్నాయి. శని, ఆదివారాల సెలవుల అనంతరం సోమవారం నుంచి బడులు, ఆఫీసులు తిరిగి ప్రారంభమవుతాయి.
దిల్లీలో బ్రిక్స్ సదస్సు- బ్యాంకులు, ప్రైవేటు కార్యాలయాల పరిస్థితి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 11న బ్యాంకింగ్ సెలవు లేదు. అయితే నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మె ఉంది. ఫలితంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
ఇక ప్రైవేటు కంపెనీల కార్యాలయాలు కూడా తెరిచే ఉంటాయి. అయితే, సెంట్రల్ దిల్లీ, ల్యూటియెన్స్ జోన్ పరిధిలోని రోడ్లపై వీవీఐపీ కాన్వాయ్ కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల తీవ్ర ట్రాఫిక్ మళ్లింపులు ఎదురయ్యే అవకాశముండటంతో, సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇవ్వాలని కంపెనీలకు పోలీసులు సూచించారు.
దిల్లీలో బ్రిక్స్ సదస్సు- మెట్రో సేవలు యథాతథం..
దిల్లీ మెట్రో రైళ్లు నగరమంతటా తమ సాధారణ వేళల ప్రకారమే నడుస్తాయి. ప్రయాణికులకు మెట్రో సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు. అయితే, సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్‌లో ఉన్న 'దిల్లీ మెట్రో మ్యూజియం' మాత్రం సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
దిల్లీలో బ్రిక్స్ సదస్సు- 4,800 మంది పోలీసులు, 35కు పైగా రోడ్లపై ఆంక్షలు..
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు దిల్లీ ట్రాఫిక్ పోలీస్ శాఖ ప్రత్యేక ప్లాన్ రూపొందించింది. దాదాపు 4,800 మంది ట్రాఫిక్ సిబ్బందిని విధుల్లోకి దించారు. వీవీఐపీ వాహనాల రిహార్సల్స్, ప్రతినిధుల ప్రయాణాల సమయంలో 22 ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాలను మళ్లిస్తారు. మధురా రోడ్, సర్దార్ పటేల్ మార్గ్, శాంతి పథ్, జనపథ్, అశోకా రోడ్, బారాఖంబా రోడ్, టాల్‌స్టాయ్ మార్గ్, ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించడం జరుగుతుంది. యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రయాణానికి ముందే ట్రాఫిక్ హెచ్చరికలను గమనించడం శ్రేయస్కరం.
బ్రిక్స్ సదస్సుకు దిల్లీ ముస్తాబు..
భారత అధ్యక్షతన జరుగుతున్న 18వ ‘బ్రిక్స్’ సదస్సు కోసం భాగస్వామ్య దేశ రాజధాని దిల్లీ ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వాన చిత్రాలతో కూడిన భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలతో దిల్లీ వీధులు ఇప్పటికే సర్వాంగ సుందరంగా అలంకరించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధ మేఘాల నడుమ జరుగుతున్న ఈ సదస్సులో ఆర్థిక సహకారమే ప్రధాన అజెండాగా మారనుంది. రష్యా అధ్యక్షుడితో పాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియాన్‌లతో ప్రధాని మోదీ వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇంధన సరఫరా, అంతర్జాతీయ రవాణా మార్గాలు, ద్వైపాక్షిక వాణిజ్యం పటిష్టపరచడంపై ఈ భేటీలలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
ఆరేళ్ల తర్వాత భారత్‌లో షీ జిన్‌పింగ్!
ఈ బ్రిక్స్ సదస్సులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో కీలక అంశం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రాక! 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత దాదాపు ఆరేళ్ల విరామం అనంతరం ఆయన భారత గడ్డపై అడుగుపెడుతున్నారు. గాల్వాన్ ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య బంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.
అయితే, ఇటీవల కాలంలో ప్రత్యక్ష విమాన సర్వీసులు, వీసాల జారీ, ఉన్నత స్థాయి దౌత్య చర్చలు పునఃప్రారంభమవడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో మోదీ, జిన్‌పింగ్‌ల భేటీ ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలకు కొత్త ఊపిరి పోస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
విస్తరించిన 11 సభ్యదేశాల కూటమి
బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా వ్యవస్థాపక దేశాలుగా ఉన్న ఈ కూటమి ఇటీవల మరింత విస్తరించింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా దేశాలు కొత్తగా చేరడంతో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 11కు చేరింది. గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడంలో ఈ విస్తరిస్తున్న కూటమి కీలకంగా మారింది.
గ్లోబల్ సౌత్ వేదికగా భారత్ అజెండా..
"ఉమ్మడి ప్రాధాన్యతలపై అంతర్గత సహకారాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఆలోచనలను పంచుకోవడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం," అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఈ వేదికపై భారత్ తన దౌత్య చతురతను చాటుకుంటూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా చర్చలు నడిపే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


