...
...
Next Story

దిల్లీలో BRICS Summit 2026- దేశాధినేతల కోసం 500 లగ్జరీ కార్లు! మెర్సిడెస్ నుంచి బీఎండబ్ల్యూ వరకు..

దిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం కేంద్ర ప్రభుత్వం కళ్లుచెదిరే రీతిలో రవాణా ఏర్పాట్లు చేసింది! విదేశీ అధినేతలు, దౌత్యవేత్తల ప్రయాణం కోసం పునియా ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఏకంగా 500 అధునాతన లగ్జరీ వాహనాలను రంగంలోకి దించింది కేంద్రం.

Published on: Sep 12, 2026, 12:20:08 IST
Advertisement

భారత రాజధాని దిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపం వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు, విదేశీ దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు ఈ మెగా ఈవెంట్‌కు తరలిరావడంతో మన దేశ రాజధాని అంతర్జాతీయ దౌత్యానికి కేంద్రబిందువుగా మారింది. ఈ అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసిన విదేశీ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం భద్రతతో పాటు రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది.

బ్రిక్స్ నేపథ్యంలో పూరీలో మానస్​ కుమార్ సాహో చేసిన సాండ్​ ఆర్ట్.. (ANI Video Grab)
బ్రిక్స్ నేపథ్యంలో పూరీలో మానస్​ కుమార్ సాహో చేసిన సాండ్​ ఆర్ట్.. (ANI Video Grab)

ఈ ద్వైవార్షిక వేడుకలో భాగంగా విదేశీ అతిథుల రవాణా బాధ్యతలను ప్రముఖ రవాణా సంస్థ 'పునియా ట్రావెల్స్' దక్కించుకుంది. రాజధాని నగరంలో విదేశీ ప్రముఖుల రాకపోకల కోసం ఈ సంస్థ ఏకంగా 500 అత్యంత ఖరీదైన, ప్రీమియం లగ్జరీ వాహనాల కాన్వాయ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

రాజసంతో మెరిసిపోతున్న లగ్జరీ కార్లు!

విదేశీ అధ్యక్షులు, ప్రధానమంత్రులు, మంత్రుల హోదాకు తగినట్లుగా అత్యంత సురక్షితమైన, సౌకర్యవంతమైన లగ్జరీ ఎస్‌యూవీలు, విలాసవంతమైన ఎంపీవీలు, ఎగ్జిక్యూటివ్ సెడాన్లను ఈ కాన్వాయ్‌లో చేర్చారు.

ప్రధానంగా జర్మన్ లగ్జరీ బ్రాండ్ మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఎస్ 450, టయోటా వెల్‌ఫైర్, కియా కార్నివాల్, బీఎండబ్ల్యూ 5 సిరీస్ మోడళ్లు దిల్లీ వీధుల్లో విదేశీ నేతలతో సందడి చేస్తున్నాయి.

ప్రత్యేకించి విదేశీ ప్రతినిధులు ప్రయాణంలో కూడా విశ్రాంతి తీసుకునేలా కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్‌లలో రీక్లైనింగ్ సీట్లతో పాటు ట్యాబ్ ఆధారిత క్యాబిన్ కంట్రోల్స్ అమర్చారు. హోటళ్ల నుంచి సమావేశ వేదిక భారత్ మండపానికి చేరుకునే క్రమంలో ప్రయాణం ఎంతో హాయిగా ఉండేలా వీటిని తీర్చిదిద్దారు.

"బ్రిక్స్​ 2026 కోసం దిల్లీలో ఉన్నంత కాలం విదేశీ నేతలకు, విఐపీలకు అత్యుత్తమ, అత్యంత సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడమే మా ముఖ్య ఉద్దేశం," అని పునియా ట్రావెల్స్ డైరెక్టర్ హర్మన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.

18వ బ్రిక్స్ సదస్సు ప్రత్యేకతలు ఇవే..

ఈ రెండు రోజుల సమావేశాల్లో ప్రపంచ పాలనా సంస్కరణలు, అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల హక్కులు, ఆర్థిక సహకారం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఫిన్‌టెక్, వాతావరణ మార్పులపై గ్రీన్ ఫైనాన్స్ వంటి కీలక అంశాలపై ప్రపంచ నేతలు విస్తృతంగా చర్చిస్తున్నారు.

11 దేశాల నేతలతో కట్టుదిట్టమైన భద్రత.

ఈ సదస్సుకు 11 బ్రిక్స్ సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అగ్రనేతలు హాజరువుతున్నారు. వీరితో పాటు ప్రత్యేక ఆహ్వానిత దేశాల ప్రతినిధులు కూడా విచ్చేశారు.

ఇంత భారీ ఎత్తున విదేశీ ప్రముఖులు రావడంతో దిల్లీ పోలీసులతో పాటు కేంద్ర భద్రతా దళాలు రాజధాని అంతటా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశాయి. విఐపీ కాన్వాయ్‌లు సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించి, మార్గాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks