BYD Atto 2 : క్రెటా, విటారా ఈవీలకు పోటీగా బీవైడీ అట్టో 2- లాంచ్, ఫీచర్లు, రేంజ్ వివరాలు..

ప్రపంచంలోనే ప్రముఖ ఈవీ తయారీ సంస్థ బీవైడీ, భారత మార్కెట్‌లో తన లైనప్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. 'బీవైడీ అట్టో 2' మిడ్‌సైజ్ ఎస్‌యూవీ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ప్రీమియం ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో రానున్న ఈ కొత్త ఎస్‌యూవీ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Aug 3, 2026, 09:59:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా వెలుగుందుతున్న చైనా ఈవీ దిగ్గజం 'బీవైడీ'.. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుతం మనదేశంలో అట్టో 3, ఈమ్యాక్స్ 7, సీల్, సీలియన్ 7 పేర్లతో నాలుగు మోడళ్లను విక్రయిస్తున్న ఈ సంస్థ.. తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి 'సీల్ యూ ప్లాగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీతో పాటు 'అట్టో 2' మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది.

బీవైడీ అట్టో 2..
బీవైడీ అట్టో 2..

అధికారికంగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే 'బీవైడీ అట్టో 2' మిడ్‌సైజ్ ఎస్‌యూవీ టెస్టింగ్ వాహనం భారతీయ రోడ్లపై తొలిసారిగా ముసుగుతో పరీక్షలు నిర్వహిస్తూ కనిపించింది. ఈ స్పై షాట్ ఆధారంగా బీవైడీ అట్టో 2 మోడల్ డిజైన్, ఫీచర్ల విశేషాలు బయటకొచ్చాయి.

అట్రాక్టివ్ డిజైన్.. స్పోర్టీ లుక్..

భారత్‌లో కనిపించిన టెస్టింగ్ వెహికల్‌ను పరిశీలిస్తే, ఇది అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అట్టో 2 మోడల్‌ను పోలి ఉంది.

ముందు భాగం: స్లీక్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లను కలుపుతూ మధ్యలో గ్లోస్ బ్లాక్ ట్రిమ్‌ను అందించారు. దీనిపై కంపెనీ పేరు 'BYD' బ్యాడ్జ్‌ను అమర్చారు.

పక్క భాగం: వీల్ ఆర్చ్‌లు, బాడీ దిగువ భాగంలో స్పోర్టీ బ్లాక్ క్లాడింగ్‌తో పాటు పెటల్ షేప్డ్ ఉండే అల్లాయ్ వీల్స్‌ను ఇందులో గమనించవచ్చు.

వెనుక భాగం: వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టైల్‌లాంప్స్, సిల్వర్ యాక్సెంట్లతో కూడిన స్పోర్టీ బ్లాక్ బంపర్ అలరించనున్నాయి.

హైటెక్ కేబిన్.. ప్రీమియం ఫీచర్లు!

అట్టో 2 కారు ఇంటీర్యర్​ సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పై ఇమేజెస్ ద్వారా స్పష్టమవుతోంది. విండ్‌స్క్రీన్‌పై కెమెరా ఆధారిత 'అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్' (అడాస్) సెన్సార్ అమర్చి ఉంది.

డిస్‌ప్లే: డ్యాష్‌బోర్డ్ మధ్యలో 12.8-ఇంచుల ఫ్రీ-స్టాండింగ్ రోటేటబుల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు.

సీటింగ్: ఆల్-బ్లాక్ సీట్ అప్‌హోల్‌స్టరీతో కేబిన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది.

ఇతర ఫీచర్లు: 8.8-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 3-స్పోక్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్) ఛార్జింగ్ ఫంక్షనాలిటీ వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ కార్లలో ఉండనున్నాయి.

ఎలక్ట్రిక్, ప్లాగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్లు..

యూరోపియన్ మార్కెట్లలో 'బీవైడీ అట్టో 2' మోడల్ ఆల్-ఎలక్ట్రిక్ (ఈవీ), ప్లాగ్-ఇన్ హైబ్రిడ్ (పీహెచ్​ఈవీ) పవర్‌ట్రెయిన్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.

ఈవీ వెర్షన్: ఇందులో 45.1kWh లేదా 64.8kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. ఇది ఒకే ఛార్జ్‌పై దాదాపు 430 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ముందు యాక్సిల్‌పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 201హెచ్​పీ పవర్, 310ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.9 సెకన్లలోనే అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 170 కిలోమీటర్లు.

పీహెచ్‌ఈవీ వెర్షన్: అట్టో 2 'డీఎం-ఐ' హైబ్రిడ్ వెర్షన్‌లో 1.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను (97హెచ్​పీ) 7.8kWh లేదా 18kWh బ్యాటరీ ప్యాక్‌లతో జోడించారు. ఇవి 197హెచ్​పీ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో మొత్తంగా 212హెచ్​పీ పవర్, 300ఎన్​ఎం టార్క్‌ను అందిస్తాయి. పెట్రోల్ + విద్యుత్ రెండింటి కలయికతో ఇది ఏకంగా 1,000 కిలోమీటర్ల మైలేజ్/రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

భారతీయ రోడ్లపై ఈ కారు టెస్టింగ్ ప్రారంభమవడంతో.. త్వరలోనే ఇది ఆటో మార్కెట్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతీ సుజుకీ ఈ విటారా, టాటా కర్వ్ ఈవీ వంటి పాపులర్ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More