Hybrid SUV : ఇండియాలోకి బీవైడీ తొలి హైబ్రిడ్​ ఎస్​యూవీ- ఏకంగా 1000 కి.మీ రేంజ్​తో!

BYD Hybrid SUV : ఇండియాలో హైబ్రిడ్​ ఎస్​యూవీల డిమాండ్​ని అందిపుచ్చుకునేందుకు బీవైడీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ఈ సంస్థ త్వరలోనే తన తొలి హైబ్రిడ్​ ఎస్​యూవీని లాంచ్​ చేయనుంది. ఇంజిన్, బ్యాటరీని కలుపుకుని ఇది 1000 కి.మీ వరకు రేంజ్​ ఇస్తుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు..

Published on: Jun 04, 2026 5:58 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ.. భారత ఆటోమొబైల్ మార్కెట్​లో సరికొత్త మైలురాయిని అధిగమించడానికి సిద్ధమైంది. తన మొట్టమొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (పీహెచ్​ఈవీ) ఎస్‌యూవీ కారును జూన్ 9, 2026న భారత్‌లో విడుదల చేయబోతోంది. 'డీఎం-ఐ సూపర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్' టెక్నాలజీతో రానున్న ఈ కారు.. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ల కలయికతో మైండ్ బ్లోయింగ్ మైలేజ్/ రేంజ్‌ను ఇస్తుంది. టయోటా ఫార్చ్యూనర్, హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్న ఈ అప్‌కమింగ్ ఎస్‌యూవీల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

బీవైడీ హైబ్రిడ్​ ఎస్​యూవీ..
బీవైడీ హైబ్రిడ్​ ఎస్​యూవీ..

బీవైడీ 'డీఎం-ఐ' హైబ్రిడ్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి?

భారతదేశంలో ఇప్పటివరకు కేవలం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను (అట్టో 3, సియెల్, ఈ6) మాత్రమే విక్రయిస్తూ ప్రీమియం ఈవీ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న బీవైడీ, ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చింది! దేశంలో ఇంకా పూర్తి స్థాయిలో ఛార్జింగ్ మౌలిక వసతులు అభివృద్ధి చెందని నేపథ్యంలో, ఇంధన ఇంజిన్‌కు, ప్యూర్ ఈవీకి మధ్య వారధిగా నిలిచే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలపై కన్నేసింది.

ఈ నేపథ్యంలోనే బీవైడీ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా 'డీఎం-i సూపర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఈవీ' పవర్‌ట్రెయిన్ సాంకేతికతను భారత్‌కు పరిచయం చేయబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఈ టెక్నాలజీలో పెట్రోల్ ఇంజిన్‌ను పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్, రీఛార్జబుల్ బ్యాటరీ ప్యాక్‌తో అనుసంధానిస్తారు. దీనివల్ల కారు అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్లేటప్పుడు రేంజ్ యాంగ్జైటీ లేకుండా చేస్తుంది.

జూన్ 9న జరగబోయే ఈ ఈవెంట్‌లో కారును అధికారికంగా లాంచ్ చేస్తారా లేదా కేవలం ప్రదర్శిస్తారా అనేది కంపెనీ ఇంకా స్పష్టం చేయనప్పటికీ, భారత మార్కెట్​లో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి బీవైడీ చాలా సీరియస్‌గా ఉందని అర్థమవుతోంది.

మార్కెట్​లోకి రాబోతున్న ఆ రెండు క్రేజీ మోడళ్లు ఇవే!

ప్రస్తుతం ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం.. బీవైడీ సీలయన్ 6 డీఎఁ-ఐ, బీవైడీ అట్టో 2 డీఎం-ఐ మోడళ్లు ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి లేదా రెండు మోడళ్లూ మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉంది.

బీవైడీ అట్టో 2 డీఎం-ఐ..

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో రాబోతున్న ఈ కారు, మార్కెట్​లో విపరీతమైన క్రేజ్ ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లకు సైజ్ పరంగా గట్టి పోటీ ఇవ్వనుంది. ఇందులో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 7.8 kWh లేదా 18 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుంది. ఇంజిన్, బ్యాటరీ కలిపి ఇది వరుసగా గరిష్టంగా 928 కిలోమీటర్లు, 998 కిలోమీటర్ల భారీ రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే దీనిని 40 కి.మీ నుంచి 90 కి.మీల వరకు నడుపుకోవచ్చు అని సమాచారం.

బీవైడీ సీలయన్ 6 డీఎమ్-ఐ..

ఇది టయోటా ఫార్చ్యూనర్ పరిమాణంలో ఉండే ఒక పెద్ద లగ్జరీ ఎస్‌యూవీ. ఇందులో కూడా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నప్పటికీ, ఇది నేచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బోచార్జ్డ్ అనే రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. దీనికి 18.3 కేడబ్ల్యూహెచ్, 26.6 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను జత చేశారు.

సాధారణ వెర్షన్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ లేఔట్‌తో 218 బీహెచ్​పీ పవర్‌ను జనరేట్ చేస్తే, టర్బోచార్జ్డ్ వేరియంట్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఏకంగా 344 బీహెచ్​పీ భారీ పవర్‌ను అందిస్తుంది. ఈ లగ్జరీ కారు ఇంజిన్, బ్యాటరీ కలిపి మొత్తంగా 1,092 కిలోమీటర్ల మైండ్ బ్లోయింగ్ రేంజ్‌ను ఇస్తుంది. కేవలం ప్యూర్ ఈవీ మోడ్‌లోనే దీనిని ఏకంగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు పెట్రోల్ వాడాల్సిన అవసరమే లేకుండా ఈ ప్యూర్ ఈవీ మోడ్ సరిపోతుంది.

భారత ఆటోమొబైల్ రంగానికి సరికొత్త దిశ..

ప్రస్తుతం భారతదేశంలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ విభాగంలో ఎంపికలు, కస్టమర్ల ఆదరణ పరిమితంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ విభాగంలోకి బీవైడీ అడుగుపెట్టడం వల్ల ఈ విభాగానికి కొత్త ఊపు రానుంది. ఇటు మైలేజ్, అటు ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ఫీచర్లు కోరుకుంటూ.. చార్జింగ్ స్టేషన్ల కోసం వెతుక్కునే ఇబ్బంది లేకుండా లాంగ్ జర్నీలు చేయాలనుకునే భారతీయ కస్టమర్లకు బీవైడీ హైబ్రిడ్ ఎస్‌యూవీలు ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్‌గా మారనున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More