కెనడాలో చదువుకు ప్లాన్​ చేస్తున్న భారతీయులకు షాక్​! స్టడీ పర్మిట్లలో ఏకంగా 50% కోత..

అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2025లో కెనడా జారీ చేసిన మొత్తం అంతర్జాతీయ స్టడీ పర్మిట్లు 25% తగ్గాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల విషయంలో స్టూడెంట్​ వీసాల సంఖ్య దాదాపు సగానికి (50శాతం) పడిపోయింది.

Published on: Feb 23, 2026, 15:31:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసే స్టడీ పర్మిట్ల సంఖ్య 2024తో పోలిస్తే గత ఏడాది పావు వంతు (25శాతం) మేర తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు జారీ చేసిన పర్మిట్ల సంఖ్య 2025లో మరింత దారుణంగా పడిపోయింది. ఇది 2024 నాటి సంఖ్యతో పోలిస్తే దాదాపు సగానికి తగ్గిపోవడం గమనార్హం.

భారతీయుల స్టడీ పర్మిట్లను 50శాతం కట్​ చేసిన కెనడా!
భారతీయుల స్టడీ పర్మిట్లను 50శాతం కట్​ చేసిన కెనడా!

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్​సీసీ) వార్షిక డేటా ప్రకారం:

మొత్తం స్టూడెంట్​ వీసా జారీ 2024లో 514,915 ఉండగా, 2025 నాటికి అది 383,905కి తగ్గింది (25% కోత).

2023లో నమోదైన గరిష్ట స్థాయి 680,795 తో పోలిస్తే ఈ తగ్గుదల ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది.

ఇది 2018 (354,260 పర్మిట్లు) తర్వాత నమోదైన అత్యల్ప ఇన్-టేక్. 2020 కోవిడ్ సమయంలో ఈ సంఖ్య 255,530కి పడిపోయిన విషయం తెలిసిందే.

కెనడాలో చదువు- భారతీయ విద్యార్థులపై ప్రభావం..

చదువు కోసం భారతీయులు అత్యధికంగా వెళ్లే దేశాల్లో కెనడా ఒకటి. ఇక్కడ స్థిరపడ్డ భారతీయులు కూడా ఎక్కువే. ఇప్పుడు భారతీయ విద్యార్థుల విషయంలో స్టడీ పర్మిట్ల కోత ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళనకర విషయం! ఈ సంఖ్య దాదాపు సగం పడిపోయింది. 2024లో 188,715 మంది భారతీయులకు పర్మిట్లు లభించగా, 2025లో ఆ సంఖ్య 94,605కి తగ్గింది.

2023లో ఈ స్టూడెంట్​ వీసాల సంఖ్య ఏకంగా 277,965గా ఉండేది.

కెనడా ప్రభుత్వ లక్ష్యం..

2024తో పోలిస్తే 2025లో కొత్త విద్యార్థుల రాక 61% తగ్గింది (177,595 మంది తగ్గారు). ఈ మొత్తం పర్మిట్ల సంఖ్యలో కొత్తగా వచ్చిన వారు, దేశంలో ఉంటూ వీసాలు పొడిగించుకున్న వారు కూడా ఉన్నారు.

అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను “సస్టైనెబుల్​ లెవల్స్​”కి తగ్గించడమే తమ లక్ష్యమని ఐఆర్​సీసీ పేర్కొంది.

కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి లీనా మెట్లెజ్ డియాబ్ గత వారం టొరంటోలో మాట్లాడుతూ.. ప్రధాని మార్క్ కార్నీ ద్వారా తాను నియమితులైనప్పుడు తన ముందు ఉన్న లక్ష్యం స్పష్టంగా ఉందని తెలిపారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో నియంత్రణను పునరుద్ధరించడం, సమతుల్యతను సాధించడం, వ్యవస్థపై నమ్మకాన్ని మళ్లీ నిర్మించడమే తమ కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు.

తీసుకున్న కఠిన చర్యలు..

అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై గరిష్ట పరిమితి (క్యాప్) విధించడం.

స్టడీ పర్మిట్ మోసాలను అరికట్టడానికి అడ్మిషన్ లెటర్ల సమీక్షను తప్పనిసరి చేయడం.

విద్యార్థుల ఆర్థిక అవసరాల పరిమితిని పెంచడం.

తాత్కాలిక వలసల వృద్ధి వల్ల గృహాల ధరలు పెరగడం, ప్రజా మౌలిక సదుపాయాలపై ఒత్తిడి కలగడం వంటి అంశాల నేపథ్యంలో 2023 చివరి త్రైమాసికం నుంచి ఈ ఆంక్షలను అమలు చేస్తున్నారు.

కెనడాలో చదువు- 2026 ప్రణాళికలు..

2026లో మొత్తం స్టడీ పర్మిట్ల సంఖ్యను 408,000కు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో కొత్తగా వచ్చే వారికి 155,000 వీసాలు, ప్రస్తుత విద్యార్థుల ఎక్స్‌టెన్షన్ల కోసం 253,000 వీసాలు ఉంటాయి.

ఈ సంఖ్య 2025 టార్గెట్​ (437,000) కంటే 7శాతం తక్కువ, 2024 లక్ష్యం కంటే 16% తక్కువ.

కెనడాలోని తాత్కాలిక జనాభా వాటాను 2027 నాటికి మొత్తం జనాభాలో 5శాతం కంటే తక్కువకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రణాళిక ప్రకారం.. తాత్కాలిక నివాసితుల (వర్కర్లు, విద్యార్థులు) సంఖ్యను దాదాపు 43% మేర తగ్గించనున్నారు. గతంలో ఏడాదికి 305,000 మంది కొత్త విద్యార్థులను తీసుకోవాలని భావించినప్పటికీ, తాజా మార్పుల వల్ల ఆ సంఖ్య 2027, 2028 నాటికి 150,000కి పరిమితం కానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

1. కెనడా ప్రభుత్వం స్టడీ పర్మిట్లపై ఈ స్థాయిలో కోత విధించడానికి ప్రధాన కారణాలేంటి?

కెనడా ప్రభుత్వం ప్రధానంగా మూడు కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. మొదటిది, తాత్కాలిక వలసదారుల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల దేశంలో హౌసింగ్ క్రైసిస్ (ఇళ్ల కొరత) ఏర్పడి, ఇళ్ల అద్దెలు, ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగిపోయాయి. రెండోది, ఆసుపత్రులు, రవాణా వంటి ప్రజా మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి పడటం. మూడోది, స్టడీ పర్మిట్ల పేరుతో జరుగుతున్న వీసా మోసాలను అరికట్టి, కేవలం నిజమైన విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించడం ద్వారా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడం.

2. 2026లో కెనడా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులపై ఈ 'క్యాప్' (పరిమితి) ప్రభావం ఎలా ఉండబోతోంది?

2026లో కొత్తగా వచ్చే విద్యార్థుల కోసం కెనడా కేవలం 1,55,000 వీసాలను మాత్రమే కేటాయించింది. దీనివల్ల పోటీ చాలా తీవ్రంగా ఉండబోతోంది. భారతీయ విద్యార్థులు ఇప్పుడు మరింత మెరుగైన అకడమిక్ ప్రొఫైల్ కలిగి ఉండటంతో పాటు పెంచిన ఆర్థిక నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అలాగే, నాణ్యమైన విద్యాసంస్థల నుంచి అడ్మిషన్ లెటర్లను పొందే వారికి మాత్రమే ప్రాధాన్యత లభించవచ్చు. వీసాల సంఖ్య సగానికి తగ్గడం వల్ల, అప్లికేషన్ రిజెక్షన్ రేటు పెరిగే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More