చదువు కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల్లో ఆంధ్ర వారే ఎక్కువ! ఈ దేశాలకే డిమాండ్..
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 2024లో కెనడా, అమెరికా దేశాలు టాప్ డెస్టినేషన్లుగా నిలిచాయని, ఇండియా నుంచి వెళుతున్న వారిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ వాసులే ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది.
భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఏయే దేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుపుతూ నీతి ఆయోగ్ తాజాగా ఒక కీలక నివేదికను విడుదల చేసింది. మన దేశం నుంచి విదేశాలకు వెళ్లి చదువుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని.. మరీ ముఖ్యంగా కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలు టాప్-5 స్థానాల్లో ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.

మరోవైపు విదేశాలకు వెళుతున్న భారతీయుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు ఉన్నారని నివేదిక వివరించింది.
విదేశాల్లో భారతీయులు- ఏ దేశంలో ఎంతమంది?
2024 గణాంకాల ప్రకారం.. 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులతో కెనడా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సుమారు 3.38 లక్షల మందితో అమెరికా రెండో స్థానంలో ఉంది. బ్రిటన్ (1.85 లక్షలు), ఆస్ట్రేలియా (1.22 లక్షలు), జర్మనీ (43,000) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విద్యార్థులను అత్యధికంగా పంపిస్తున్న దేశంగా భారత్ తన రికార్డును కొనసాగిస్తోంది! 2024లో మొత్తం 13.35 లక్షల మంది భారతీయులు విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నారు. మన దేశంలో 18 నుంచి 23 ఏళ్ల లోపు యువత సంఖ్య సుమారు 15.5 కోట్లుగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని నివేదిక అభిప్రాయపడింది.
ఆందోళన కలిగిస్తున్న 'బ్రెయిన్ డ్రైన్' "2024లో భారత్‌కు వస్తున్న ప్రతి ఒక్క అంతర్జాతీయ విద్యార్థికి బదులుగా.. 28 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. ఇది దేశంలో మేధో వలస (బ్రెయిన్ డ్రైన్) తీవ్రతను సూచిస్తోంది," అని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు, భారత్‌కు వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్యపై కూడా ఈ నివేదిక వెలుగునిచ్చింది. 2021–22 విద్యా సంవత్సరంలో నేపాల్ నుంచి అత్యధిక మంది విద్యార్థులు భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్, అమెరికా, బంగ్లాదేశ్, యూఏఈ దేశాల విద్యార్థులు మన దేశంలో విద్యను అభ్యసిస్తున్నారు.
- H-1B ఉద్యోగులకు యాపిల్, గూగుల్ గట్టి హెచ్చరిక: అమెరికా విడిచి వెళ్లొద్దంటూ! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
వేల కోట్ల ఖర్చు.. ఏపీ నుంచే అత్యధికం!
కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో చదువుతున్న 8.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు 2023-24లో ఏకంగా రూ. 2.9 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. 2014 నుంచి 2024 మధ్య కాలంలో విదేశీ విద్య కోసం భారత్ నుంచి పంపే నిధులు రూ. 975 కోట్ల నుంచి ఏకంగా రూ. 29,000 కోట్లకు పెరగడం గమనార్హం.
రాష్ట్రాల వారీగా చూస్తే.. విదేశాలకు వెళుతున్న విద్యార్థుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 2020 లెక్కల ప్రకారం ఏపీ నుంచి 35,614 మంది విద్యార్థులు వెళ్లగా.. పంజాబ్ (33,412), మహారాష్ట్ర (29,079) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మొత్తానికి భారతీయ యువత ప్రపంచ స్థాయి విద్యపై మక్కువ చూపుతున్నప్పటికీ, దేశం నుంచి తరలిపోతున్న మేధస్సు, భారీ నిధుల విషయంలో పాలకులు దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక గుర్తుచేస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


