Car loan interest rates : లోన్ తీసుకుని కారు కొంటున్నారా? తక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకులు ఇవే..
Car loan tips : సొంత కారు కల నిజం చేసుకోవడానికి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, మీ క్రెడిట్ స్కోర్ వంటి కీలక అంశాలను పరిశీలించడం చాలా ముఖ్యం. తక్కువ వడ్డీతో ఆర్థిక భారం పడకుండా కారు లోన్ పొందేందుకు నిపుణులు చెబుతున్న 5 ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ చూద్దాము..
సొంతంగా ఒక కారు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. అందుకే, సరైన కార లోన్‌ను ఎంచుకోవడం ద్వారా మనం చెల్లించే అదనపు భారాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు కూడా పోటాపోటీగా తక్కువ వడ్డీ రేట్లకే వాహన రుణాలను అందిస్తున్నాయి. అందుకే లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు, ఈఎంఐ, లోన్ కాలపరిమితి, ప్రాసెసింగ్ ఫీజులను ఒకదానితో ఒకటి క్షుణ్ణంగా పోల్చి చూసుకోవడం ఎంతో అవసరం.

2026 జూన్ నాటి గణాంకాల ప్రకారం.. మార్కెట్లో కార్ లోన్ వడ్డీ రేట్లు ఏడాదికి 7.35 శాతం లాంటి అత్యల్ప రేటు నుంచే ప్రారంభమవుతున్నాయి. అయితే, ఈ వడ్డీ రేటు అనేది అందరికీ ఒకేలా ఉండదు! లోన్ తీసుకునే వ్యక్తి క్రెడిట్ స్కోర్, ప్రస్తుతం వారికి ఉన్న అప్పులు, గతంలో లోన్లు తీర్చిన విధానం, వారి నెలవారీ ఆదాయం, పని చేసే సంస్థ, లోన్ కాలపరిమితి వంటి అంశాల ఆధారంగా బ్యాంకులు ఫైనల్ వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.
ఈ నేపథ్యంలో.. వివిధ బ్యాంకులు అందిస్తున్న కార్ లోన్ వడ్డీ రేట్లను ఇక్కడ తెలుసుకోండి..
బ్యాంకు /ఎన్బీఎఫ్సీ పేరు | వడ్డీ రేటు (వార్షికం) | ఈఎంఐ (రూ.) | ప్రాసెసింగ్ ఫీజు |
|---|---|---|---|
| యూనియన్ బ్యాంక్ | 7.50-10.00 | 10,019 - 10,684 | రూ. 1,000 వరకు |
| పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 7.60-10.70 | 10,043 - 10,797 | 0.25% (రూ. 1,000-రూ. 1,500) వరకు |
| బ్యాంక్ ఆఫ్ బరోడా | 7.60-11.35 | 10,043 - 10,959 | రూ. 2,000 వరకు |
| కెనరా బ్యాంక్ | 7.45-11.45 | 10,007 - 10,984 | 0.25% (రూ.1,000-రూ.5,000)పై 50% వేవర్ |
| బ్యాంక్ ఆఫ్ ఇండియా | 7.60-12.55 | 10,043 - 11,262 | 0.25% (రూ.2,500-రూ.10,000) వరకు |
| యూకో బ్యాంక్ | 7.35-10.00 | 9,983 - 10,624 | 0.5% (రూ. 5,000 గరిష్ఠంగా) |
| ఎస్బీఐ | 8.80-9.85 | 10,331 - 10,587 | రూ. 1,500-రూ. 4,000 |
| ఐడీబీఐ బ్యాంక్ | 7.75-9.30 | 10,078 - 10,452 | రూ. 2,500 |
| బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర* | 7.45-11.75 | 10,007 - 11,059 | 0.25% (రూ. 1,000-రూ. 15,000) |
| ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ | 7.55-12.00 | 10,031 - 11,122 | నిల్ |
| ఐసీఐసీఐ బ్యాంక్ | 8.40 నుంచి | 10,234 నుంచి | 2% వరకు |
| హెచ్డీఎఫ్సీ బ్యాంక్ | 8.15 నుంచి | 10,174 నుంచి | 0.5% (రూ. 3,500-రూ. 8,000) వరకు |
| కర్ణాటక బ్యాంక్ | 8.12-11.62 | 10,167 - 11,026 | 0.60% (రూ. 2,500-రూ. 11,000) వరకు |
| ఫెడరల్ బ్యాంక్ | 7.65-9.00 | 10,055 నుంచి | 1% (రూ. 1,000-రూ. 50,000) |
| పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్** | 7.50-14.00 | 10,019 - 11,634 | 0.25% (రూ. 1,000-రూ. 15,000) |
| ఇండియన్ బ్యాంక్ | 7.50-9.65 | 10,019 - 10,513 | రూ. 1,200 |
| ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ | 8.99 నుంచి | 10,377 నుంచి | రూ. 10,000 వరకు |
| సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 7.60-9.30 | 10,043 - 10,452 | 0.50% (రూ. 2,000-రూ. 20,000) |
సోర్స్: Paisabazaar.com
గమని: 5ఏళ్ల పాటు రూ. 5లక్షల లోన్ ఆధారంగా ఈ ఈఎంఐ లెక్కించడం జరిగింది. జూన్ 24కు సంబంధించిన రేట్లు ఇవి. మహారాష్ట్ర బ్యాంకు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులు వడ్డీ రేట్లను, ప్రాసెసింగ్ ఫీజులను మరింత తగ్గించే అవకాశం ఉంది.
కార్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన 5 ముఖ్యమైన అంశాలు ఇవే:
1. మొత్తం ఖర్చును పోల్చి చూసుకోండి..
కార్ లోన్ తీసుకునేటప్పుడు కేవలం వడ్డీ రేటును మాత్రమే చూసి నిర్ణయానికి రాకండి. లోన్‌ను సమగ్రంగా పరిశీలించాలి. వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఖర్చులు, ఇతర దాగి ఉన్న అదనపు ఛార్జీలు ఏమైనా ఉన్నాయేమో ముందే సరిచూసుకోవడం మంచిది.
2. క్రెడిట్ స్కోర్ బాగుండేలా చూసుకోండి..
గతంలో తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించి, ఎలాంటి డిఫాల్ట్స్ లేకుండా మంచి క్రెడిట్ ప్రొఫైల్‌ను మెయింటెన్ చేయడం చాలా ప్లస్ అవుతుంది. ముఖ్యంగా మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే, బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే లోన్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తాయి. అంతేకాదు, మీకు నచ్చిన నిబంధనలపై లోన్ పొందే అవకాశం కూడా లభిస్తుంది.
3. లోన్ కాలపరిమితిని తెలివిగా ఎంచుకోండి..
కార్ లోన్ తీసుకునేటప్పుడు దానిని తిరిగి చెల్లించే కాలపరిమితిని ఎంతో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకోవాలి. దీనికోసం ఆర్థిక నిపుణులు '20/4/10' రూల్‌ను సూచిస్తున్నారు. ఈ నియమం ప్రకారం.. కారు కొనేటప్పుడు 20 శాతం డౌన్ పేమెంట్ చేయాలి, లోన్ కాలపరిమితిని 4 ఏళ్లకు పరిమితం చేసుకోవాలి, అలాగే మీ నెలవారీ కారు ఈఎంఐ అనేది మీ మొత్తం నెలవారీ ఆదాయంలో 10 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.. లోన్ కాలపరిమితి ఎక్కువగా ఉంటే నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది కానీ, మొత్తంగా మీరు చెల్లించే వడ్డీ భారం బాగా పెరుగుతుంది.
4. నిబంధనలను క్షుణ్ణంగా చదవండి..
లోన్ అగ్రిమెంట్‌పై సంతకం చేసే ముందే అన్ని నియమ నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా లోన్ ముందే క్లోజ్ చేస్తే అయ్యే ఖర్చులు, ప్రీ-పేమెంట్ రూల్స్, ఒకవేళ ఈఎంఐ ఆలస్యమైతే పడే పెనాల్టీలు, ఇతర షరతులు ఏంటో ముందే తెలుసుకోవడం ఉత్తమం.
5. మీ ఆర్థిక స్తోమతకు లోబడే లోన్ తీసుకోండి..
కారు కొనేటప్పుడు ఎమోషనల్ నిర్ణయాలు అస్సలు తీసుకోకండి! భవిష్యత్తులో ఈఎంఐలు కట్టడం కష్టమవుతుందని తెలిసినా పెద్ద మొత్తంలో లోన్ల కోసం ప్రయత్నించవద్దు. మీ నెలవారీ బడ్జెట్‌కు ఇబ్బంది కలగకుండా, సులువుగా చెల్లించగలిగే పరిమితిలోనే లోన్ ఉండేలా ప్లాన్ చేసుకోండి.
చివరగా.. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆప్షన్లలో ఏది బెస్ట్ అనేది మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, మీ అవసరాలు, మీ తిరిగి చెల్లించే సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, హడావుడిగా కాకుండా అన్నింటినీ బేరీజు వేసుకుని ముందడుగు వేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


