CBSE exams 2026 : ఈ నెల 17 నుంచి సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు- 10, 12 విద్యార్థులకు కీలక సూచనలు..

ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న 10, 12వ తరగతి బోర్డు పరీక్షల నేపథ్యంలో సీబీఎస్‌ఈ కీలక అడ్వైజరీ జారీ చేసింది. పరీక్ష టైమింగ్స్​, కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Published on: Feb 14, 2026, 11:20:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీబీఎస్​ఈ (సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​) 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 17, 2026 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలలకు బోర్డు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

విద్యార్థులకు సీబీఎస్​ఈ కీలక సూచనలు..
విద్యార్థులకు సీబీఎస్​ఈ కీలక సూచనలు..

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- ఇవి తెలుసుకోండి..

ఏ. సమయంపై ప్రత్యేక శ్రద్ధ: 10 గంటలకే క్లోజ్!

సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం.. పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే, విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 10:00 గంటలకల్లా చేరుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. 10:00 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని హెచ్చరించింది.

బీ. ట్రాఫిక్ అడ్డంకులు.. ముందే బయలుదేరండి!

దేశవ్యాప్తంగా వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, అత్యున్నత స్థాయి సమావేశాలు, ఇతర ఈవెంట్లు.. సీబీఎస్​ఈ బోర్డు పరీక్షల సమయంలో జరగనున్నాయి. దీనివల్ల పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉండే అవకాశం ఉంది.

"స్థానిక పరిస్థితులు, వాతావరణం, ట్రాఫిక్, దూరాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇంటి నుంచి ముందే బయలుదేరాలి," అని బోర్డు సూచించింది.

విద్యార్థులు పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందే సందర్శించి, ప్రయాణ సమయంపై అవగాహన పెంచుకోవడం ఉత్తమం.

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- మూడు విప్లవాత్మక మార్పులు..

పరీక్షా ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు సీబీఎస్‌ఈ ఈ ఏడాది మూడు కీలక మార్పులను ప్రవేశపెట్టింది:

10వ తరగతికి రెండుసార్లు బోర్డు పరీక్ష: విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నుంచి 10వ తరగతి పరీక్షలు రెండుసార్లు జరుగుతాయి. మొదటికి కచ్చితంగా రాయలి. రెండోది ఆప్షనల్​.

ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్​ఎం): 12వ తరగతి సమాధాన పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేయనున్నారు. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ప్రశ్నపత్రాల విభజన: 10వ తరగతి సైన్స్, సోషల్ స్టడీస్ ప్రశ్నపత్రాలను విభజించి అందించనున్నారు.

"స్మార్ట్ ఎగ్జామ్ - స్మార్టర్ మూల్యాంకనం"

సీబీఎస్​ పరీక్షల నిర్వహణపై శుక్రవారం నిర్వహించిన వెబ్‌కాస్ట్‌లో బోర్డు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సంయమ్ భరద్వాజ్ మాట్లాడారు. "నవ భారత్ గుర్తింపుగా స్మార్ట్ పరీక్షలు, స్మార్ట్ మూల్యాంకన విధానాన్ని అమలు చేస్తున్నాం. టెక్నాలజీ సాయంతో పారదర్శకమైన, వేగవంతమైన ఫలితాలను అందించడమే మా లక్ష్యం," అని ఆయన పేర్కొన్నారు. నియమ నిబంధనలు, ఎస్​ఓపీలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు.

ఈ ఏడాది భారత్‌తో పాటు మరో 26 దేశాల్లో మొత్తం 46 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- క్లాస్​ 10, 12 విద్యార్థుల కోసం చెక్-లిస్ట్..

  1. అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) మర్చిపోవద్దు.
  2. ఉదయం 10:00 గంటలకల్లా కేంద్రానికి చేరుకోండి.
  3. పరీక్షా కేంద్రాన్ని ముందే ఒకసారి చూసి రండి.
  4. ట్రాఫిక్ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరగా బయలుదేరండి.

ప్రశ్నలు- సమాధానాలు..

ప్రశ్న- 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో ప్రవేశపెట్టిన 'ఆన్-స్క్రీన్ మార్కింగ్' అంటే ఏంటి?

సమాధానం- ఇది ఒక డిజిటల్ మూల్యాంకన విధానం. ఇందులో ఉపాధ్యాయులు భౌతిక పేపర్లకు బదులుగా, కంప్యూటర్ స్క్రీన్‌పై డిజిటలైజ్ చేసిన సమాధాన పత్రాలను దిద్దుతారు. దీనివల్ల మార్కుల లెక్కింపులో తప్పులు దొర్లే అవకాశం ఉండదు. ఫలితాలను మరింత వేగంగా, పారదర్శకంగా వెల్లడించడానికి వీలవుతుంది.

ప్రశ్న- పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి డెడ్​లైన్​ ఎంత?

పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి, కానీ విద్యార్థులు ఖచ్చితంగా ఉదయం 10:00 గంటలకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 10:00 గంటల తర్వాత వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోరు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More