Agniveer Recruitment 2026 : ఇండియన్ ఆర్మీలో 25,000 అగ్నివీర్ పోస్టులు- నేటి నుంచే రిజిస్ట్రేషన్!
అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ని భారత సైన్యం విడుదల చేసింది. ఈ దఫా రిక్రూట్మెంట్లో 25వేలకుపైగా మందిని తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్, ఫీజు సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత సైన్యంలో చేరి, దేశానికి సేవ చేయాలని సంకల్పిస్తున్న వారికి అలర్ట్! అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ని భారత సైన్యం విడుదల చేసింది. ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ (joinindianarmy.nic.in) లోకి వెళ్లి ఈ నోటిఫికేషన్ని చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. జీడీ (జనరల్ డ్యూటీ), టెక్నికల్, క్లర్క్/ స్టోర్‌కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సోల్జర్ ఫార్మా, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, ఉమెన్ మిలిటరీ పోలీసు తదితర విభాగాల్లో మొత్తం 25వేలకుపైగా పోస్టులకు ఈ దఫా రిక్రూట్మెంట్ జరగనుంది.

అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఈ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13, శుక్రవారం నాడు ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏప్రిల్ 1 వరకు గడువు ఉంది. అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా ఈ రిక్రూట్మెంట్ జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవలందిస్తారు.
ఆన్లైన్ టెస్ట్ జూన్ 1 నుంచి 6 మధ్యలో ఉండొచ్చు. అడ్మిట్ కార్డు, ఫలితాల తేదీపై భారత సైన్యం తర్వాత ప్రకటన విడుదల చేసింది.
అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- వేకెన్సీలు, అర్హత ప్రమాణాలు..
పోస్టు బట్టి వేకెన్సీలకు అర్హత 8వ తరగతి నుంచి 12వ తరగతి, డిగ్రీ వరకు ఉంటుంది. అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026 కోసం అప్లై చేయాలని భావిస్తున్న వారి వయస్సు 17.5ఏళ్ల నుంచి 21ఏళ్ల మధ్యలో ఉండాలి. అభ్యర్థి కనీస ఎత్తు 170 సె.మీ ఉండాలి. వీటితో పాటు మరిన్ని అర్హత ప్రమాణాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ని చూడాల్సి ఉంటుంది.
అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- ఎంపిక ప్రక్రియ, పరీక్ష పాటర్న్..
ఇండియన్ ఆర్మీలో చేరాలని భావిస్తున్న వారు అగ్నివీర్ 2026 ఎంపిక ప్రక్రియ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మూడు భాగాల్లో జరుగుతుంది. అవి.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), రిక్రూట్మెంట్ ర్యాలీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
ఆన్లైన్ పరీక్షని సీఈసీ అని కూడా అంటారు. ఇందులో జనరల్ సైన్స్, జనరల్ జ్ఞాలెడ్జ్, మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, జనరల్ ఇంగ్లీష్‌పై ప్రశ్నలు ఉంటాయి.
జీడీ పోస్టులకు ఈ పరీక్షలో 50 ప్రశ్నలు ఉంటాయి. ఇవి 100 మార్కులకు ఉంటాయి. టెక్నికల్, క్లర్క్/ స్టోర్‌కీపర్ పోస్టులకు 200 మార్కులకు 50 ప్రశ్నలు ఉంటాయి.
ఈ ఆన్లైన్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వారు రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో అనేక శారీరక పరీక్షల ఉంటాయి.
అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- వేతనం..
అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026కి ఎంపికైన వారి నెలవారీ జీతం మొదటి ఏడాది రూ. 30వేల వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రతి ఏడాది పెరుగుతూ, నాల్గొవ ఏడాదికి రూ. 40వేల వరకు వెళుతుంది.
టేక్‌హోం శాలరీ మొదటి ఏడాది నుంచి నాల్గొవ ఏడాదికి రూ. 21వేల నుంచి రూ.28వేల వరకు వెళుతుంది. అదనంగా అగ్నివీర్ కార్పస్ ఫండ్ ఉంటుంది. ఇందులో ప్రభుత్వం కూడా నిధులు జమ చేస్తుంది.
అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- ఫీజు..
అభ్యర్థులు అందరికి రూ. 250. ఆన్లైన్లోనే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

E-Paper












