CBSE Exams 2026 : ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో భారీ మార్పులు- ఇవి తెలుసుకోండి..
జాతీయ విద్యా విధానంలో భాగంగా 2026 నుంచి సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో కీలక మార్పులు రానున్నాయి. పదో తరగతి విద్యార్థుల కోసం ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించనుండగా, పన్నెండో తరగతి జవాబు పత్రాల కోసం ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ 2026 నుంచి సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) బోర్డు పరీక్షల విషయంలో కీలక మార్పులు కనిపించబోతున్నాయి. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020కి అనుగుణంగా 2026 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షల్లో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

ఈసారి భారత్ సహా దాదాపు 26 దేశాల నుంచి సుమారు 46 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 17, 2026 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ఆ ముఖ్యమైన మార్పులు ఇవే:
సీబీఎస్ఈ క్లాస్ 10- ఏడాదికి రెండు బోర్డు పరీక్షలు
విద్యార్థులకు ఊరటనిచ్చేలా సీబీఎస్ఈ ఈ ఏడాది నుంచి పదో తరగతికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనుంది.
మొదటి పరీక్ష: ఫిబ్రవరి - మార్చి 2026లో జరుగుతుంది. (ఇది అందరికీ తప్పనిసరి).
రెండో పరీక్ష: మే 15, 2026 నుంచి ప్రారంభమై 15 రోజుల పాటు జరుగుతుంది.
పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకుంటే (ఇంప్రూవ్మెంట్).. సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్ లేదా లాంగ్వేజస్‌లో ఏవైనా మూడు సబ్జెక్టులను ఎంచుకుని రెండోసారి పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో వచ్చిన ఉత్తమ మార్కులనే ఫైనల్ స్కోరుగా పరిగణిస్తారు.
ప్రశ్నపత్రాల విభజన (సెక్షన్ల వారీగా..)
పదో తరగతి సైన్స్, సోషల్ సైన్స్ ప్రశ్నపత్రాల్లో ఈసారి కీలక మార్పు చేశారు. మూల్యాంకనం నాణ్యంగా జరగాలన్న ఉద్దేశంతో వీటిని ప్రత్యేక విభాగాలుగా విభజించారు.
సైన్స్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలుగా ఉంటుంది.
సోషల్ సైన్స్: హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ విభాగాలుగా ఉంటుంది.
విద్యార్థులు ఆయా విభాగాల ప్రశ్నలకు విడివిడిగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఆయా సబ్జెక్టుల నిపుణులే ఆ సెక్షన్లను దిద్దుతారు.
సీబీఎస్ఈ 12వ తరగతికి 'ఆన్-స్క్రీన్' మార్కింగ్..
సీబీఎస్ఈ క్లాస్ 12 విద్యార్థుల జవాబు పత్రాల దిద్దుబాటులో పారదర్శకత కోసం ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. జవాబు పత్రాలను స్కాన్ చేసి కంప్యూటర్ స్క్రీన్‌పైనే డిజిటల్‌గా దిద్దుతారు. దీనివల్ల టోటలింగ్ తప్పులు జరగవు, ఫలితాలు కూడా వేగంగా వెల్లడవుతాయి.
అయితే, పదో తరగతికి మాత్రం ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే మాన్యువల్ దిద్దుబాటు కొనసాగుతుంది.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఎర్రర్ ఫ్రీ మూల్యాంకనం కోసం ప్రత్యేక చర్యలు-
పరీక్షా ఫలితాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా బోర్డు ఈసారి కొన్ని కఠినమైన నిబంధనలను రూపొందించింది:
జవాబు పత్రాలను దిద్దే టీచర్లపై పనిభారం తగ్గించేలా, ఒక్కొక్కరికి తక్కువ సంఖ్యలో పేపర్లు కేటాయిస్తారు.
టీచర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు చిన్న చిన్న ఇన్స్ట్రక్షనల్ వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తారు.
గతంలో 10 నుంచి 12 రోజులు పట్టే దిద్దుబాటు ప్రక్రియను, ఈసారి 8 నుంచి 10 రోజుల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అందువల్ల సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు త్వరగా వెలువడే అవకాశం ఉంటుంది.
విద్యార్థులు బట్టీ పట్టే పద్ధతి నుంచి బయటకు వచ్చి, సబ్జెక్టుపై పట్టు సాధించేలా ఈ మార్పులన్నీ ప్రోత్సహిస్తాయని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

E-Paper












