కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) నిర్వహించే పరీక్షల జవాబు పత్రాల డిజిటల్ స్కానింగ్, ఈ-మూల్యాంకనం (e-evaluation) టెండర్ ప్రక్రియలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు గట్టి పోటీ ఇస్తూ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే 'కోఎంప్ట్ ఎడ్యు టెక్ ప్రైవేట్ లిమిటెడ్' (Coempt Edu Teck) ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. టెండర్ రికార్డుల ప్రకారం.. సాంకేతిక విలువలలో టీసీఎస్ కంటే రెండు మార్కులు ఎక్కువ సాధించడమే కాకుండా, ఆర్థిక బిడ్‌లో భారీ వ్యత్యాసంతో కోఎంప్ట్ ఈ విజయాన్ని అందుకుంది.
స్క్రుటినీలో వెలుగులోకి..

ఈ ఏడాది సీబీఎస్‌ఈ పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) పోర్టల్‌లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడం, ఫలితాల అనంతర సేవల్లో ఆలస్యం జరగడంపై విద్యార్థులు, మూల్యాంకనదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్ ప్రారంభంలో జరిగిన ఆలస్యం కారణంగా ఈ టెండర్ ప్రక్రియ, సదరు వెండర్ ఎంపికపై ప్రస్తుతం అందరి దృష్టి పడింది.
టెక్నికల్ రౌండ్‌లో హోరాహోరీ
సాంకేతిక మూల్యాంకన పత్రాన్ని (Technical Evaluation Sheet) పరిశీలిస్తే, మొత్తం 100 మార్కులకు గాను కోఎంప్ట్ 91 మార్కులు సాధించగా, టీసీఎస్ 89 మార్కులు పొందింది. ఉద్యోగుల సంఖ్య, CMMI, ISO సర్టిఫికేషన్లు, సొల్యూషన్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ, డిజాస్టర్ రికవరీ ప్లానింగ్ వంటి కీలక విభాగాలలో రెండు కంపెనీలూ పూర్తి మార్కులు సాధించి సమవుజ్జీలుగా నిలిచాయి.
టర్నోవర్ పరంగా చూస్తే రెండు సంస్థలకూ భారీ వ్యత్యాసం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,67,021 కోట్ల ఆదాయం, 5.84 లక్షల మందికి పైగా ఉద్యోగులతో ఉన్న టీసీఎస్‌కు వార్షిక టర్నోవర్ విభాగంలో పూర్తి 5 మార్కులు వచ్చాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల మధ్య టర్నోవర్ నమోదు చేసిన కోఎంప్ట్ ఈ విభాగంలో 2 మార్కులు మాత్రమే సాధించింది. అయితే, మానవ వనరుల సామర్థ్యం (Manpower) విభాగంలో మాత్రం ఇరు కంపెనీల వద్ద 100 కంటే ఎక్కువ మంది సిబ్బంది ఉన్నందున బోర్డు రెండింటికీ గరిష్టంగా 15 మార్కులు కేటాయించింది.
కోఎంప్ట్‌కు కలిసివచ్చిన అనుభవం
ఈ టెండర్లో అత్యంత కీలకమైన "గత అనుభవం" (Past Experience) విభాగంలో కోఎంప్ట్ మార్కులు కొట్టింది.
సాంకేతిక మార్కుల విశ్లేషణ
{{/usCountry}}ఈ టెండర్లో అత్యంత కీలకమైన "గత అనుభవం" (Past Experience) విభాగంలో కోఎంప్ట్ మార్కులు కొట్టింది.
సాంకేతిక మార్కుల విశ్లేషణ
{{/usCountry}}| మూల్యాంకన విభాగం (Parameter) | కోఎంప్ట్ మార్కులు (Coempt) | టీసీఎస్ మార్కులు (TCS) |
|---|---|---|
| మొత్తం సాంకేతిక స్కోరు (Total Technical Score) | 91 | 89 |
| గత అనుభవం (Past Experience - గరిష్టం 35) | 32 | 25 |
| స్కానింగ్ & డిజిటల్ మూల్యాంకన పంపిణీ (గరిష్టం 10) | 10 | 0 |
| సాంకేతిక ప్రెజెంటేషన్ & లైవ్ డెమో (గరిష్టం 15) | 9 | 14 |
| వార్షిక టర్నోవర్ (Annual Turnover - గరిష్టం 5) | 2 | 5 |
'సబ్జెక్టివ్ జవాబు పత్రాల స్కానింగ్, డిజిటల్ మూల్యాంకన పంపిణీ' విభాగంలో కోఎంప్ట్‌కు పూర్తి 10 మార్కులు రాగా, టీసీఎస్ సున్నా మార్కులు సాధించడం ఇక్కడ ప్రధాన తేడాగా నిలిచింది. పెద్ద ఎత్తున డిజిటల్ మూల్యాంకన ప్రాజెక్టులను నిర్వహించడం, ఒకే సమయంలో బహుళ ఇవాల్యుయేషన్ కేంద్రాలను హ్యాండిల్ చేయడంలో కోఎంప్ట్ పూర్తి మార్కులు దక్కించుకుంది. పరీక్షల సాంకేతిక రంగంలో తమకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉందని లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం కోఎంప్ట్ పేర్కొంది.
మరోవైపు, టెక్నికల్ ప్రెజెంటేషన్, లైవ్ డెమో విభాగంలో టీసీఎస్ అద్భుతంగా రాణించి 15 మార్కులకు గాను 14 మార్కులు సాధించగా, కోఎంప్ట్ 9 మార్కులు మాత్రమే పొందింది.
పారదర్శకంగానే ఎంపిక
ఈ టెండర్ ప్రక్రియపై సీబీఎస్‌ఈ అధికారికంగా స్పందించనప్పటికీ, ఒక సీనియర్ అధికారి కీలక వివరాలు వెల్లడించారు. "సాంకేతిక రౌండ్‌లో బోర్డుకు ఉన్న ఏకైక విచక్షణ అధికార పరిధి ప్రెజెంటేషన్ మాత్రమే. అందులో కోఎంప్ట్ కంటే టీసీఎస్‌కే ఎక్కువ మార్కులు వచ్చాయి. బిడ్డింగ్ ప్రక్రియ పూర్తిగా నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగిందనడానికి ఇదే నిదర్శనం" అని సదరు అధికారి స్పష్టం చేశారు.
కోఎంప్ట్ సంస్థకు టెండర్ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలూ ఉన్నాయని, ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా పరీక్షల బోర్డు దీనిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేదని అధికారులు సమర్థించారు.
రూ. 566 కోట్ల భారీ వ్యత్యాసం
ఆర్థిక బిడ్‌ల (Financial Bids) విషయానికి వస్తే ఇరు కంపెనీల మధ్య వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపించింది. 'బిల్ ఆఫ్ క్వాంటిటీస్' (BoQ) పత్రాల ప్రకారం.. ఒక జవాబు పత్రం మూల్యాంకనానికి కోఎంప్ట్ రూ. 24.75 నుంచి రూ. 25.74 ల ధరను ప్రతిపాదించగా, టీసీఎస్ రూ. 53 నుంచి రూ. 65 ల వరకు కోట్ చేసింది.
మొత్తం ప్రాజెక్ట్ విలువను లెక్కిస్తే కోఎంప్ట్ బిడ్ విలువ దాదాపు రూ. 384.6 కోట్లు కాగా, టీసీఎస్ బిడ్ విలువ రూ. 951.3 కోట్లుగా తేలింది. అంటే ఇరు కంపెనీల మధ్య దాదాపు రూ. 566 కోట్ల భారీ తేడా ఉంది. ఈ ఏడాది సీబీఎస్‌ఈ క్లాస్ 12కు సంబంధించి సుమారు 9.86 మిలియన్ల జవాబు పత్రాలను ఓఎస్ఎమ్ ద్వారా మూల్యాంకనం చేసింది.
క్యూసీబీఎస్ (QCBS) విధానం
ఈ కాంట్రాక్టును 'క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలెక్షన్' (QCBS) పద్ధతిలో కేటాయించారు. ఇందులో సాంకేతిక స్కోరుకు 70 శాతం, ఆర్థిక బిడ్‌కు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ విధానంలో అతి తక్కువ ధర (L1) కోట్ చేసిన సంస్థకు ఆర్థిక విభాగంలో గరిష్ట మార్కులు వస్తాయి. టెక్నికల్ రౌండ్‌లో స్వల్ప ఆధిక్యం ఉండి, ధరలో భారీ వ్యత్యాసం చూపించినప్పుడు ఆ సంస్థకే తుది ర్యాంకింగ్‌లో విజయం దక్కుతుందని నిపుణులు వివరిస్తున్నారు. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారమే అత్యంత తక్కువ ధరతో పాటు టెక్నికల్ అర్హతలు ఉన్న సంస్థను ఎంపిక చేసినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.
తెరపైకి 2019 తెలంగాణ ఇంటర్ ఫలితాల విషాదం
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) పోర్టల్‌లో సాంకేతిక లోపాలపై విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ సంస్థ 'కోఎంప్ట్ ఎడ్యు టెక్' కు సంబంధించి గత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పరీక్షల నిర్వహణ, సాఫ్ట్‌వేర్ మూల్యాంకనంలో ఈ సంస్థపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తెలంగాణలో భారీ ఎత్తున విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీసిన ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంతో ఈ సంస్థకు ప్రత్యక్ష సంబంధం ఉందనే విషయం కంపెనీ అధికారిక పత్రాల ద్వారా స్పష్టమవుతోంది.
గ్లోబరీనానే ఈ కోఎంప్ట్
2019 ఏప్రిల్‌లో విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో తీవ్ర గందరగోళం నెలకొంది. పరీక్ష రాసిన 9.7లక్షల మంది విద్యార్థులలో ఏకంగా 3.8 లక్షల మంది ఫెయిల్ అయినట్లు బోర్డు ప్రకటించింది. మార్కుల కేటాయింపులో జరిగిన సాంకేతిక తప్పుల కారణంగా ఒత్తిడి తట్టుకోలేక 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఇంటర్ బోర్డు పరిపాలన, పరీక్షల డిజిటలైజేషన్ సాఫ్ట్‌వేర్ బాధ్యతలను 'గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్' (Globarena Technologies) అనే సంస్థ చూసింది. అయితే, ఆ వివాదం జరిగిన ఆరు నెలల లోపే గ్లోబరీనా సంస్థ తన పేరును 'కోఎంప్ట్ ఎడ్యు టెక్ ప్రైవేట్ లిమిటెడ్'గా మార్చుకుందని రికార్డులు చెబుతున్నాయి.