CBSE Scholarship 2026 : సీబీఎస్​ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కీమ్- అర్హత, దరఖాస్తు వివరాలు..

పదో తరగతి పూర్తి చేసిన సింగిల్​ ఫీమేల్​ చైల్డ్​ ఉన్నత చదువుల కోసం సీబీఎస్ఈ మెరిట్ స్కాలర్‌షిప్ పథకాన్ని అందిస్తోంది. నెలకు రూ. 1,000 చొప్పున రెండేళ్ల పాటు అందే ఈ సాయం కోసం అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు మీకోసం..

Published on: Mar 15, 2026, 05:25:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తె ఉన్న కుటుంబాల్లో ఆడపిల్లల విద్యను ప్రోత్సహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. 'మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్' పేరుతో పదో తరగతి తర్వాత పైచదువులకు బోర్డు ఆర్థిక భరోసా ఇస్తోంది. 2025లో 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థినులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

సీబీఎస్​ స్కాలర్​షిప్​ 2026 అప్డేట్స్​..
సీబీఎస్​ స్కాలర్​షిప్​ 2026 అప్డేట్స్​..

ఎవరు అర్హులు?

ఈ పథకం కింద 'సింగిల్ గర్ల్ చైల్డ్' అంటే తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే సంతానమై ఉండాలి. తోబుట్టువులు (అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్లు) ఉండకూడదు. ఒకవేళ కవలలు ఇద్దరూ ఆడపిల్లలే అయితే, వారిద్దరినీ కూడా ఈ పథకానికి అర్హులుగానే పరిగణిస్తారు.

ముఖ్యమైన నిబంధనలు ఇవే:

మార్కులు: పదో తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి.

చదువు: ప్రస్తుతం సీబీఎస్ఈ గుర్తింపు పొందిన స్కూల్‌లో 11 లేదా 12వ తరగతి చదువుతుండాలి.

ట్యూషన్ ఫీజు: విద్యార్థిని చదువుతున్న స్కూల్‌లో నెలకు ట్యూషన్ ఫీజు రూ. 1,500 (10వ తరగతిలో) మించకూడదు. అలాగే 11, 12 తరగతుల్లో ఫీజు నెలకు రూ. 3,000 లోపు ఉండాలి. (ఎన్ఆర్ఐ విద్యార్థులకైతే గరిష్టంగా నెలకు రూ. 6,000 వరకు ఉండొచ్చు).

ఆదాయ పరిమితి: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి. దీనికి సంబంధించి నోటరీ చేయించిన అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

స్కాలర్‌షిప్ మొత్తం ఎంత?

ఎంపికైన విద్యార్థినులకు నెలకు రూ. 1,000 చొప్పున రెండేళ్ల పాటు (11, 12 తరగతులు) ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థిని బ్యాంక్ ఖాతాకే (ఈసీఎస్​/ నెఫ్ట్ ద్వారా) జమ చేస్తారు.

పాత విద్యార్థులకు రెన్యూవల్ అవకాశం..

గతేడాది ఈ స్కాలర్‌షిప్ పొందిన వారు ఈ ఏడాది రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారు 11వ తరగతిలో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, 12వ తరగతికి ప్రమోట్ అయి ఉండాలి.

దరఖాస్తు విధానం..

అర్హత ఉన్న విద్యార్థినులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్​ (cbse.gov.in) లోని స్కాలర్‌షిప్ సెక్షన్‌కు వెళ్లి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కావాల్సిన పత్రాలు:

స్కూల్ ప్రిన్సిపాల్ ధృవీకరించిన మొదటి త్రైమాసిక ఫీజు రసీదు.

ఆదాయ ధృవీకరణ పత్రం

పదో తరగతి మార్కుల జాబితా.

దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పాఠశాల యాజమాన్యం ఆ వివరాలను వెరిఫై చేయాల్సి ఉంటుంది. గడువు ముగియక ముందే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని బోర్డు సూచించింది. ఒకవేళ పేమెంట్ లేదా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే సీబీఎస్ఈ స్కాలర్‌షిప్ విభాగాన్ని సంప్రదించవచ్చు.

ఆడపిల్లల చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర బోర్డు చేపట్టిన ఈ చొరవ ఎంతోమంది మెరిట్ విద్యార్థినులకు వరంగా మారనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More