సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రస్తుత విద్యాసంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగించింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020 కింద ప్రతిపాదించిన మూడు భాషల సూత్రాన్ని (Three-Language Formula) అమలు చేయడంలో ఒకేసారి మినహాయింపు (One-time relaxation) ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. పరివర్తన కాలంలో (Transitional period) విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ తాత్కాలిక సడలింపులు ఇచ్చినట్లు బోర్డు స్పష్టం చేసింది.

ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, రెండు నాన్-నేటివ్ భాషలను (ఉదాహరణకు ఇంగ్లీష్, ఫ్రెంచ్) ఎంచుకున్న 9వ తరగతి విద్యార్థులు అదే కాంబినేషన్‌ను కొనసాగించవచ్చు. అయితే, వారు మూడవ భాషగా ఒక భారతీయ భాషను అదనంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. "ఈ మార్పుల వల్ల ఏ విద్యార్థి కూడా నష్టపోకూడదు" అని బోర్డు స్పష్టం చేసింది. ఈ అదనపు మూడవ భాషకు స్కూల్ స్థాయిలోనే అంతర్గత మూల్యాంకనం (Internal assessment) ఉంటుంది తప్ప, ఈ బ్యాచ్ విద్యార్థులు 2027-28లో 10వ తరగతికి వెళ్లినప్పుడు ఎలాంటి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు.
వివాదాస్పద సర్క్యులర్ - నేపథ్యం
అంతకుముందు మే 15న సీబీఎస్‌ఈ ఒక సర్క్యులర్ జారీ చేస్తూ, అనుబంధ పాఠశాలలన్నీ జూలై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మూడు భాషలను తప్పనిసరి చేయాలని ఆదేశించింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) ప్రత్యేక పాఠ్యపుస్తకాలను విడుదల చేసే వరకు ఈ విధానాన్ని నిలిపివేయాలని డిసెంబర్ 2025లో సీబీఎస్‌ఈ గవర్నింగ్ బాడీ తీసుకున్న నిర్ణయానికి ఈ సర్క్యులర్ విరుద్ధంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. విద్యాసంవత్సరం మధ్యలో ఇలాంటి నిర్ణయాల వల్ల పాఠశాలల నిర్వహణ, విద్యా ప్రణాళికలు దెబ్బతింటాయని ప్రిన్సిపాల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బోర్డు తాజా సడలింపులు ఇచ్చింది.
మిగతా తరగతుల పరిస్థితి ఏంటి?
ప్రస్తుత విద్యాసంవత్సరంలో 7, 8 తరగతుల్లో ఉంటూ రెండు నాన్-నేటివ్ భాషలు చదువుతున్న విద్యార్థులకు కూడా ఇదే సడలింపు వర్తిస్తుంది. వారు కూడా ఒక భారతీయ భాషను మూడవ భాషగా జోడించుకోవాలి. దీనికి కేవలం అంతర్గత పరీక్షలే ఉంటాయి తప్ప 10వ తరగతి బోర్డు పరీక్ష ఉండదు.
{{/usCountry}}ప్రస్తుత విద్యాసంవత్సరంలో 7, 8 తరగతుల్లో ఉంటూ రెండు నాన్-నేటివ్ భాషలు చదువుతున్న విద్యార్థులకు కూడా ఇదే సడలింపు వర్తిస్తుంది. వారు కూడా ఒక భారతీయ భాషను మూడవ భాషగా జోడించుకోవాలి. దీనికి కేవలం అంతర్గత పరీక్షలే ఉంటాయి తప్ప 10వ తరగతి బోర్డు పరీక్ష ఉండదు.
{{/usCountry}}మరోవైపు, ప్రస్తుత 10వ తరగతి (2026-27) బ్యాచ్ విద్యార్థులకు ఎటువంటి మార్పులు లేవు. వారు పాత రెండు భాషల విధానంలోనే కొనసాగుతారు. వీరు మూడవ భాషను చదవాల్సిన అవసరం లేదు.
అయితే, 2026-27 విద్యాసంవత్సరంలో 6వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు, ఆ తర్వాతి బ్యాచ్‌లకు ఈ మూడు భాషల విధానం పూర్తిగా వర్తిస్తుంది. వారు తప్పనిసరిగా రెండు భారతీయ భాషలను చదవాలి. ఈ బ్యాచ్‌లు 10వ తరగతికి వచ్చేసరికి మూడవ భాష (R3) కు కూడా బోర్డు పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనికోసమే 22 భారతీయ భాషలకు సంబంధించిన 6వ తరగతి ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
టీచర్ల కొరత అధిగమించేందుకు.. మినహాయింపులు ఇవే
పాఠశాలల్లో భాషా ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి సీబీఎస్‌ఈ కొన్ని వెసులుబాట్లు కల్పించింది. రిటైర్డ్ టీచర్లు, వర్చువల్ లేదా హైబ్రిడ్ బోధనా పద్ధతులు, సాహోదయ స్కూల్ క్లస్టర్ల సేవలను వాడుకోవడానికి పాఠశాలలకు అనుమతి ఇచ్చింది.
ఇక ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు (Children with Special Needs) రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసిబిలిటీస్ యాక్ట్, 2016 ప్రకారం ఈ విధానం నుండి మినహాయింపులు ఉంటాయి. అలాగే భారతదేశం వెలుపల ఉన్న సీబీఎస్‌ఈ స్కూళ్లకు, విదేశాల నుండి తిరిగి వచ్చే విదేశీ విద్యార్థులకు భారతీయ భాషను మూడవ భాషగా చదవడం నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు.
సుప్రీంకోర్టులో సవాలు
సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టిన ఈ మూడు భాషల విధానాన్ని సవాలు చేస్తూ మే 27న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్.. పాఠశాలల్లో తగినన్ని పుస్తకాలు, ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, చెన్నైలకు చెందిన 19 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వేసిన ఈ పిటిషన్‌పై జూలై రెండో వారంలో తదుపరి విచారణ జరగనుంది. అప్పటివరకు సీబీఎస్‌ఈ ఇచ్చిన తాజా మినహాయింపులు విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యాలకు పెద్ద ఊరటనిచ్చాయనే చెప్పాలి.