Nisarga Adhikary : సీబీఎస్‌ఈ వెబ్‌సైట్ లోపాలను కనిపెట్టిన కుర్రోడికి ఐఐటీ కాన్పూర్‌లో జాబ్- డిగ్రీ కూడా లేదు!
Nisarga Adhikary CBSE : సీబీఎస్‌ఈ పోర్టల్‌లో ఉన్న పెద్ద సైబర్ సెక్యూరిటీ లోపాలను బయటపెట్టిన 19 ఏళ్ల నిసర్గ అధికారిని ఐఐటీ కాన్పూర్ తమ సైబర్ సెక్యూరిటీ టీమ్‌లోకి తీసుకుంది. డిగ్రీ కూడా లేని ఈ కుర్రాడి ప్రతిభకు మెచ్చి డైరెక్టర్ నేరుగా ఉద్యోగం ఇచ్చారు.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలంటే సాధారణంగా ఒక మంచి రెజ్యూమ్, ఈమెయిల్ ఉంటే సరిపోతుంది. కానీ, 19 ఏళ్ల నిసర్గ అధికారి విషయంలో మాత్రం కథ పూర్తిగా అడ్డం తిరిగింది! సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఆన్-స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లో ఉన్న భారీ భద్రతా లోపాలను వివరిస్తూ అతను రాసిన ఒక బ్లాగ్ పోస్టే.. నేడు ఆయనకు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కాన్పూర్‌లో ఏకంగా సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది.

నిసర్గ అధికారి.. ఈ వారంలోనే ఐఐటీ కాన్పూర్‌కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ (C3iHub)లో ఓపెన్-సౌర్స్ ఇంటెలిజెన్స్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాదిలోనే తన 12వ తరగతి (ఇంటర్మీడియట్) పూర్తి చేసిన నిసర్గ, ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగం సంపాదించిన అత్యంత పిన్న వయస్కుడైన ఇంజనీర్లలో ఒకరిగా నిలిచారు.
మే 22న నిసర్గ రాసిన ఆ బ్లాగ్ పోస్ట్ చదివిన తర్వాత.. తానే స్వయంగా అతడిని సంప్రదించానని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు.
"మా సైబర్ సెక్యూరిటీ టీమ్‌లో నిసర్గ అధికారిని ఇంజనీర్‌గా నియమించాం. కొన్ని ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఇద్దరు యువ ఇంజనీర్లను మా టీమ్‌లోకి తీసుకున్నాం. ఐఐటీ కాన్పూర్ చరిత్రలోనే ఇతను అత్యంత పిన్న వయస్కుడైన ఉద్యోగి అవునా కాదా అనేదానిపై నాకు స్పష్టత లేదు కానీ, మా ఇన్‌స్టిట్యూట్ నియమించుకున్న అత్యంత చిన్న వయసు ఇంజనీర్లలో ఖచ్చితంగా ఒకడు," అని మణీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు.
సీబీఎస్‌ఈ పోర్టల్ వివాదం - వెలుగులోకి షాకింగ్ నిజాలు!
నిసర్గ అధికారి బయటపెట్టిన భద్రతా లోపాలు.. ప్రస్తుతం సీబీఎస్‌ఈ బోర్డు అమలు చేస్తున్న ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంపై జరుగుతున్న పెద్ద వివాదంలో ఒక భాగం. ఈ ప్రక్రియను ఎలాంటి ముందస్తు సనహాలు లేకుండా, చాలా తొందరపాటుగా పూర్తి చేశారని మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. మొదటి టెండర్‌కు ఎవరూ ముందుకు రాకపోవడం, రెండో టెండర్ విఫలం కావడంతో.. మూడో టెండర్ సమయంలో సాంకేతిక నిబంధనలను కావాలనే తగ్గించారని, చివరికి ఈ టెండర్‌ను 'కోఎంప్ట్ ఎడ్యు టెక్' అనే సంస్థ దక్కించుకుందని వార్తలు వచ్చాయి.
అయితే, ఈ సంస్థ సమర్పించిన సైబర్ సెక్యూరిటీ సర్టిఫికెట్లు అసలైన లైవ్ సైట్‌వి కావు. ఒక డెవలప్‌మెంట్ స్టేజింగ్ ఎన్విరాన్‌మెంట్‌కు సంబంధించినవని, పైగా అందులో ఒక సర్టిఫికెట్ దాదాపు రెండేళ్ల పాతదని విచారణలో తేలింది.
ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మే 24న ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన నలుగురు సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందం సీబీఎస్‌ఈ ఫలితాల అనంతర సర్వీసెస్ పోర్టల్‌లో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి రంగంలోకి దిగింది. ఈ ప్రక్రియలో భాగంగా దిల్లీలోని సీబీఎస్‌ఈ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అగర్వాల్, రెండు వారాల క్రితం నిసర్గను నేరుగా కలిసి మాట్లాడారు.
"నిసర్గ నిస్సందేహంగా చాలా ప్రతిభావంతుడు. కానీ అతను ఇంకా నేర్చుకోవాల్సింది, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సింది చాలా ఉంది. ఐఐటీ కాన్పూర్ అతనికి ఆ గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు," అని అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏడేళ్ల వయసులోనే కోడింగ్.. హాబీనే ఉద్యోగమైంది!
ఐఐటీ కాన్పూర్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేరిన నిసర్గ, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండే సమాచారాన్ని విశ్లేషిస్తూ, వివిధ వెబ్‌సైట్లు, అప్లికేషన్లలోని భద్రతా లోపాలను గుర్తించి, వాటిని ఎలా ప్యాచ్ చేయాలో (పరిష్కరించాలో) సంస్థలకు సహాయం చేయనున్నారు.
"ఈ అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పూర్తిస్థాయి సెక్యూరిటీ రోల్‌లో పనిచేయడం నాకు ఇదే మొదటిసారి. ఇంతకుముందు నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాను. సైబర్ సెక్యూరిటీ అనేది అప్పట్లో నాకు కేవలం ఒక హాబీ మాత్రమే," అని నిసర్గ చెప్పారు.
వారి కుటుంబంలో ఎవరూ సైబర్ సెక్యూరిటీ రంగంలో లేరు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఫైనాన్స్ రంగంలోనే పనిచేస్తున్నారు.
"నేను ఆరు లేదా ఏడేళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించాను. కానీ ఆరో తరగతికి వచ్చాక సైబర్ సెక్యూరిటీని సీరియస్‌గా తీసుకుని.. క్యాప్చర్ ది ఫ్లాగ్ వంటి హ్యాకింగ్ పోటీలలో పాల్గొనడం మొదలుపెట్టాను," అని తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.
డాలర్ల సంపాదన మిస్ అవుతున్నా.. కాలేజీకి వెళ్లను!
ఐఐటీ కాన్పూర్ ఇస్తున్న జీతం వివరాలను వెల్లడించడానికి నిసర్గ నిరాకరించారు. అయితే తాను ఆశించిన దానికంటే ఇది కొంచెం తక్కువేనని హింట్ ఇచ్చారు.
"జీతం బాగానే ఉంది కానీ, నేను ఇంకొంచెం ఎక్కువ ఆశించాను. ఇంతకుముందు నేను అమెరికాకు చెందిన కంపెనీలు, ప్రాజెక్టులతో పనిచేశాను. ఆ సమయంలో యూఎస్‌డీ-ఐఎన్‌ఆర్ కన్వర్షన్ వల్ల డాలర్లలో వచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని ఇప్పుడు కొంచెం మిస్ అవుతున్నాను," అని అన్నాడు.
ప్రస్తుతానికి తాను ఎలాంటి కాలేజీలో చేరి ఉన్నత చదువులు చదవాలనే ఆలోచనలో లేనని నిసర్గ స్పష్టం చేశారు.
"ప్రజలు నిత్య జీవితంలో ఉపయోగించే సరికొత్త స్టార్టప్‌లు, ప్రొడక్ట్స్‌ను బిల్డ్ చేయడమే నా లక్ష్యం. నాకు సంప్రదాయ చదువులపై అంతగా ఆసక్తి లేదు," అని కుర్రాడు తేల్చి చెప్పారు.
ఆ లోపాలు ఏంటి? దేశ రక్షణ సంస్థకు ముందే అలర్ట్!
ఫిబ్రవరి 25నే తాను ఈ భద్రతా లోపాల గురించి భారతదేశ సైబర్ సెక్యూరిటీ నిఘా సంస్థ ‘సెర్ట్-ఇన్’కు సమాచారం అందించానని నిసర్గ తన బ్లాగ్‌లో రాశారు. ఆన్-స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లో ఐదు అత్యంత ప్రమాదకరమైన లోపాలు ఉన్నట్లు ఆయన గుర్తించారు. అందులో ముఖ్యంగా.. యూజర్ల మెయిన్ పాస్‌వర్డ్‌ను ఎన్‌క్రిప్ట్ చేయకుండా సాధారణ టెక్ట్స్ రూపంలోనే స్టోర్ చేయడం వల్ల టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను (2ఎఫ్ఏ) ఎవరైనా సులభంగా బైపాస్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తాను అలర్ట్ చేసినా కేవలం ఒక లోపాన్ని మాత్రమే సరిచేశారని, మిగిలిన సమస్యలు అలాగే ఉండటం వల్లే చివరికి ఆ పోర్టల్‌ను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చిందని నిసర్గ వివరించారు.
ఇంతకుముందు పలు స్టార్టప్‌ల్లో ప్రొఫెషనల్‌గా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, ఒక విద్యాసంస్థలో తాను చేస్తున్న మొదటి ఉద్యోగం ఇదేనని నిసర్గ అధికారి సంతోషంగా చెప్పారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


