...
...
Next Story

ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కేటాయింపుల్లో భారీ మార్పులు- కొత్త పాలసీ తెచ్చిన కేంద్రం!

సివిల్ సర్వీసెస్ అధికారుల క్యాడర్ కేటాయింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేసింది. 2017 నాటి జోనల్ విధానాన్ని రద్దు చేస్తూ, పారదర్శకత కోసం 'గ్రూపుల' వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇకపై అధికారులు తమకు నచ్చిన భౌగోళిక ప్రాంతాలను ఎంచుకునే అవకాశం ఉండదు.

Published on: Jan 25, 2026, 10:01:47 IST
Advertisement

భారత పరిపాలనా రంగానికి వెన్నెముకగా నిలిచే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ అధికారుల క్యాడర్ కేటాయింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో 'క్యాడర్ అలోకేషన్​ పాలసీ 2026'ను తీసుకువచ్చింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) డైరెక్టర్ యషు రుస్తాగి ఇటీవలే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కేటాయింపుల్లో భారీ మార్పులు..
ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కేటాయింపుల్లో భారీ మార్పులు..

కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ విధానం 2017 నాటి పాత ఫ్రేమ్‌వర్క్‌ను పూర్తిగా మార్చివేసింది. గతంలో ఉన్న 'జోనింగ్' వ్యవస్థను రద్దు చేస్తూ, ఖాళీల భర్తీకి కచ్చితమైన గడువులను నిర్ణయించింది. ఆల్​ ఇండియా సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులను ఆయా రాష్ట్రాలకు లేదా సంయుక్త క్యాడర్లకు కేటాయించే విధానమే ఈ 'క్యాడర్ అలొకేషన్ పాలసీ'. రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతస్థాయిలో చర్చించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

జోన్లు పోయి.. గ్రూపులు వచ్చాయి!

2017 విధానం ప్రకారం రాష్ట్రాలను భౌగోళిక సరిహద్దుల ఆధారంగా వివిధ జోన్లుగా విభజించేవారు. ఉదాహరణకు, జోన్-1లో ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాలు)తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ఉండేవి. యూపీ, బీహార్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలను జోన్-2లో చేర్చారు. అభ్యర్థులు తమకు నచ్చిన జోన్ల వారీగా ప్రాధాన్యతలను ఎంచుకునేవారు.

అయితే, కొత్త పాలసీలో ఈ జోన్ల స్థానంలో అక్షర క్రమం ఆధారంగా రాష్ట్రాలను 'గ్రూపుల'గా విభజించారు. ఇప్పుడు గ్రూప్-1లో ఏజీఎంయూటీతో పాటు అసోం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మార్పు వల్ల అధికారులు భౌగోళిక సామీప్యతను సాకుగా చూపి తమకు నచ్చిన ప్రాంతాలను ఎంచుకునే వీలుండదు.

నిపుణులు ఏమంటున్నారు?

కర్ణాటక మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రిటైర్డ్ ఐఎఫ్ఓఎస్ అధికారి బీకే సింగ్ ఈ మార్పులను విశ్లేషిస్తూ.. "1980లలో ప్రవేశపెట్టిన భౌగోళిక విభజన విధానం వల్ల అభ్యర్థులు తమ సొంత రాష్ట్రానికి లేదా పక్క రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఉదాహరణకు యూపీ దొరకకపోతే బీహార్ లేదా మధ్యప్రదేశ్ ఎంచుకునేవారు. కానీ కొత్త పాలసీలో ఇది కుదరదు. గ్రూప్-4ను గమనిస్తే, ఒక అధికారికి తెలంగాణ రావచ్చు లేదా త్రిపుర కేటాయించవచ్చు. తెలంగాణ రానప్పుడు నాకు పక్కనే ఉన్న రాష్ట్రం కావాలని అడిగే అవకాశం ఇక ఉండదు. ఇది అత్యంత పారదర్శకమైన విధానం," అని వివరించారు.

కచ్చితమైన గడువు.. పక్కాగా భర్తీ!

కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి రాష్ట్రం తమ వద్ద ఉన్న ఖాళీల వివరాలను ఏటా జనవరి 31 లోపు కేంద్రానికి సమర్పించాలి. ఆ ఏడాది జనవరి 1 నాటికి ఉన్న 'క్యాడర్ గ్యాప్' ఆధారంగా ఈ ఖాళీలను లెక్కిస్తారు. అధికారుల వృత్తిపరమైన శిక్షణ ప్రారంభం కావడానికి ముందే క్యాడర్ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks