Maruti Suzuki Brezza facelift : మారుతీ బ్రెజ్జా ఫేస్​లిఫ్ట్​.. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?

మారుతీ సుజుకీ సరికొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను ఇండియన్ మార్కెట్లో ఇటీవలే లాంచ్ చేసింది. మీరు ఈ ఎస్​యూవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇందులోని వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ గురించి కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 28, 2026, 14:05:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న తన కాంపాక్ట్ ఎస్​యూవీ 'బ్రెజ్జా' కొత్త వర్షన్‌ను గత వారం లాంచ్ చేసింది. భారత మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు మారుతీ సుజుకీ ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ బ్రెజ్జా ఫేస్​లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7,39,900 నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ. 13,70,500 వరకు అందుబాటులో ఉంది.

మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్​లిఫ్ట్​లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?
మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్​లిఫ్ట్​లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?

వినియోగదారుల అవసరాలు, ఇంధన రకాలు, గేర్‌బాక్స్ ఆప్షన్లకు అనుగుణంగా ఈ 2026 మారుతీ సుజుకీ బ్రెజ్జాను కంపెనీ పలు వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా ఎల్​ఎక్స్ఐ, వీఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ+ అనే నాలుగు వేరియంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటార్‌తో పాటు 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. వినియోగదారులు తమకు నచ్చిన విధంగా పెట్రోల్ లేదా పెట్రోల్-సీఎన్జీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

మీరు కూడా ఈ కొత్త బ్రెజ్జాను సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇన్ని వేరియంట్లలో మీ బడ్జెట్‌కు ఏది సరిగ్గా సరిపోతుంది, ఏది కొంటే పెట్టిన డబ్బులకు పూర్తి న్యాయం జరుగుతుందో అనే సందేహం ఉంటే.. హెచ్​టీ ఆటోకు సంబంధించిన ఈ విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడుతుంది.

హెచ్​టీ ఆటో ఛాయిస్.. బ్రెజ్జా జెడ్​ఎక్స్​ఐ వేరియంట్!

హెట్​టీ ఆటో టీమ్ ప్రకారం.. ఈ కొత్త మారుతీ సుజుకీ బ్రెజ్జాను కొనాల్సి వస్తే, నిస్సందేహంగా జెడ్​ఎక్స్​ఐ వేరియంట్‌ను ఎంచుకోవాలి! బ్రెజ్జా లైన్‌అప్‌లో ఇది అత్యంత ‘వాల్యూ ఫర్ మనీ’ వేరియంట్‌గా పరిగణించవచ్చు. జేబుకు మరీ భారం కాకుండా, ఆధునిక కారులో ఉండాల్సిన కీలకమైన సౌకర్యాలు, టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్ల మధ్య ఇది సరైన సమతుల్యతను పాటిస్తుంది.

జెడ్​ఎక్స్​ఐ వేరియంట్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

కొత్త బ్రెజ్జా జెడ్​ఎక్స్​ఐ మోడల్ మిగిలిన వాటికంటే ప్రత్యేకం అనడానికి అనేక బలమైన కారణాలు ఉన్నాయి:

అధునాతన టెక్నాలజీ: ఈ మోడల్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పుష్-స్టార్ట్/స్టాప్ బటన్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాతన హంగులు లభిస్తాయి.

ఆకర్షణీయమైన డిజైన్: సాధారణ స్టీల్ రిమ్‌ల స్థానంలో స్టైలిష్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను అందించారు. ఇవి కారుకు మంచి లుక్‌ను ఇవ్వడమే కాకుండా, రాత్రివేళ డ్రైవింగ్‌ను సులభతరం చేస్తాయి.

అదనపు సౌకర్యాలు: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్‌పైనే ఆడియో కంట్రోల్స్, వాషర్‌తో కూడిన రియర్ వైపర్ వంటివి రోజూవారీ ప్రయాణాన్ని ఎంతో హాయిగా మారుస్తాయి.

పవర్‌ట్రెయిన్ ఎంపికలు: ఈ వేరియంట్‌లో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పాటు కంపెనీ ఫిట్టెడ్ పెట్రోల్-సీఎన్జీ ఆప్షన్ కూడా లభిస్తుంది.

ఇతర వేరియంట్లతో పోలిస్తే జెడ్​ఎక్స్​ఐ ఎందుకు బెటర్?

ఎల్​ఎక్స్ఐ (బేస్ మోడల్): మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్​లిఫ్ట్​లో ఇది కేవలం బేసిక్ మోడల్ మాత్రమే. ఇందులో కంపెనీ ఫిట్టెడ్ ఆధునిక ఫీచర్లు కానీ, లుక్స్ పెంచే ఎలిమెంట్స్ కానీ ఉండవు.

వీఎక్స్​ఐ (మిడ్ మోడల్): ఇది చూడటానికి పర్వాలేదనిపించినప్పటికీ.. నేటితరం వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే సన్‌రూఫ్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి కీలక ఫీచర్లు ఇందులో లభించవు.

ZXI+ (టాప్ ఎండ్): ఇది అన్ని ఫీచర్లతో నిండిన మోడల్ అయినప్పటికీ.. దీనికి అదనంగా వచ్చే 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి కొన్ని ఫీచర్ల కోసం చాలా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది.

అందుకే, మీ జేబుకు భారం కాకుండా, ప్రీమియం ఫీచర్లు ఉన్న కారు కావాలనుకుంటే మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్​లిఫ్ట్​లోని జెడ్​ఎక్స్​ఐ వేరియంట్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More