Nissan Tekton : నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీలో ఏ వేరియంట్ కొనాలి? ఇదిగో క్లారిటీ..
Nissan Tekton price : భారత మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి నిస్సాన్ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ఆకర్షణీయమైన ఫీచర్లు, పవర్‌ఫుల్ టర్బో ఇంజిన్ ఆప్షన్లతో 'టెక్టాన్' ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో ఏ వేరియంట్ బెస్ట్ ఛాయిస్ అనేది ఇప్పుడు చూద్దాము..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పోటీ మరోసారి వేడెక్కింది! హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి దిగ్గజాలకు సవాల్ విసురుతూ జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్.. తన సరికొత్త ఎస్‌యూవీ 'టెక్టాన్'ని దేశీయ మార్కెట్లోకి ఇటీవలే విడుదల చేసింది. సరికొత్త డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 10.49 లక్షలుగా నిర్ణయించారు. దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 18.59 లక్షల వరకు ఉంది.

ఈ మధ్య కాలంలో భారతీయ కస్టమర్లు బడ్జెట్‌తో పాటు సేఫ్టీ, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నిస్సాన్ తెచ్చిన టెక్టాన్ ఎలాంటి ఇంజిన్ ఆప్షన్లతో వచ్చింది? బడ్జెట్‌లో దొరికే బెస్ట్ వేరియంట్ ఏది? అనే పూర్తి వివరాలు మీకోసం..
ఆరు వేరియంట్లు.. రెండు టర్బో ఇంజిన్లు!
కస్టమర్ల అవసరాలు, బడ్జెట్‌ను బట్టి నిస్సాన్ ఈ కారును మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. అవి.. విసియా, విసియా ప్లస్, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్.
సాధారణంగా ఈ సెగ్మెంట్‌లో నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్లు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ నిస్సాన్ మాత్రం టెక్టాన్ ఎస్‌యూవీలో రెండు రకాల శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజిన్లను మాత్రమే ఆఫర్ చేస్తోంది:
1.0-లీటర్ టర్బో పెట్రోల్: ఇది 100 పీఎస్ పవర్‌ను, 166 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే లభిస్తుంది.
1.3-లీటర్ టర్బో పెట్రోల్: ఎక్కువ పవర్ కావాలనుకునే వారి కోసం రూపొందించిన ఈ ఇంజిన్ ఏకంగా 163 పీఎస్ పవర్‌ను, 280 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. దీనితో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ వెట్-క్లచ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు: 'అసెంటా' బెస్ట్ ఛాయిస్!
పరిమిత బడ్జెట్‌లో అవసరమైన అన్ని ముఖ్యమైన ఫీచర్లు కావాలనుకునే మధ్యతరగతి కస్టమర్లకు 'అసెంటా' వేరియంట్ అత్యంత సరైన ఎంపికగా నిలుస్తుంది. ఇందులో సిగ్నేచర్ ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, రియర్ వైపర్, డిఫాగర్, క్రూయిజ్ కంట్రోల్, 60:40 స్ల్పిట్ రియర్ సీట్లు వంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. 1.0-లీటర్ మాన్యువల్ ఆప్షన్ రూ. 11.79 లక్షల ధరతో ప్రారంభమవుతుండగా, 1.3-లీటర్ డీసీటీ ఆటోమేటిక్ వేరియంట్ రూ. 14.99 లక్షలకు లభిస్తుంది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రాథమిక అవసరాలన్నీ తీరాలంటే ఈ వేరియంట్ వైపు మొగ్గు చూపవచ్చు.
అసలైన మజా కావాలంటే.. 'టెక్నా'నే స్మార్ట్ అప్‌గ్రేడ్!
వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కావాలంటే మాత్రం నిస్సాన్ టెక్టాన్ టెక్నా వేరియంట్ అద్భుతమైన ఆప్షన్! టాప్-ఎండ్ వేరియంట్ కోసం భారీగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడని వారికి ఇది ఒక స్వీట్ స్పాట్ లాంటిది. ఇందులో ప్రీమియం అలాయ్ వీల్స్, 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ లభిస్తాయి. ఆటోమేటిక్ (డీసీటీ) మోడల్‌లో ప్యాడిల్ షిఫ్టర్లు, ఆటో హోల్డ్ ఫీచర్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అత్యాధునిక ఫీచర్లు వస్తాయి.
ధరల విషయానికి వస్తే, 1.0-లీటర్ మాన్యువల్ ధర రూ. 15.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక పవర్‌ఫుల్ 1.3-లీటర్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 16.39 లక్షలుగా, డీసీటీ ఆటోమేటిక్ ధర రూ. 17.79 లక్షలుగా ఉంది.
"పర్ఫార్మెన్స్ పరంగా 1.3-లీటర్ టర్బో ఇంజిన్ అదరగొడుతుంది. మాన్యువల్ వెర్షన్ కేవలం 9.51 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే మాన్యువల్ లీటరుకు 17.8 కిమీ, డీసీటీ ఆటోమేటిక్ 18.5 కిమీ మైలేజ్ ఇస్తాయని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది."
టాప్ ఎండ్ 'టెక్నా ప్లస్' ఎందుకు వద్దు?
టెక్నా ప్లస్ అనేది ఈ లైనప్‌లోనే అత్యంత ఖరీదైన, లగ్జరీ వేరియంట్. ఇందులో గూగుల్ బిల్ట్-ఇన్ సిస్టమ్, 10.25-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, 3డీ అరౌండ్-వ్యూ మానిటర్ వంటి అధునాతన సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఈ కెమెరా ప్యాకేజీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ప్రత్యేకంగా కావాలనుకునే వారు తప్ప, సాధారణ కస్టమర్లు దీని కోసం అదనంగా భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికంటే ఒక వేరియంట్ కింద ఉన్న 'టెక్నా'లోనే రోజువారీ సౌకర్యానికి కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్లు దొరుకుతాయి.
నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ- ఏ వేరియంట్ ఎంచుకోవాలి?
భారత మార్కెట్లో నిస్సాన్ టెక్టాన్ సరైన ధరలో పటిష్టమైన పోటీని ఇచ్చేందుకు సిద్ధమైంది. బడ్జెట్ పరిమితులు ఉండి, బేసిక్ ఫీచర్లు సరిపోతాయి అనుకునే వారికి 'అసెంటా' ఉత్తమమైనది. అలా కాకుండా, ఆధునిక ఫీచర్లు, అదిరిపోయే పవర్‌ఫుల్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ కావాలి కానీ బడ్జెట్ మించకూడదు అనుకునే వారికి 'టెక్నా' వేరియంట్ అన్ని విధాలా సరిగ్గా సరిపోతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


