టాటా పంచ్ ఈవీకి పోటీగా Vinfast VF5- 326 కి.మీ రేంజ్! ఎలక్ట్రిక్ కారు ధర ఎంతంటే..
వియత్నాం ఈవీ దిగ్గజం 'విన్‌ఫాస్ట్' భారత్‌లో వీఎఫ్5 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టనుంది. దాదాపు 326 కిలోమీటర్ల రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రానున్న ఈ మోడల్ టాటా పంచ్ ఈవీకి పోటీగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ కారుపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
టాటా మోటార్స్ తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో వియత్నాంకు చెందిన ‘విన్‌ఫాస్ట్’ తన దూకుడును పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేయనున్న 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ ‘లిమో గ్రీన్’తో పాటు, చిన్న కార్ల విభాగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సంస్థ చూస్తోంది. ఇందులో భాగంగానే టాటా పంచ్ ఈవీ, టియాగో ఈవీలకు గట్టి పోటీనిచ్చేలా 'వీఎఫ్5' హ్యాచ్‌బ్యాక్‌ను భారత్‌కు తీసుకువచ్చే యోచనలో ఉంది.

ఇప్పటికే తమిళనాడులో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, వీఎఫ్6, వీఎఫ్7 ఎస్‌యూవీలను విడుదల చేసిన ఈ సంస్థ, ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా వీఎఫ్5 హ్యాచ్‌బ్యాక్‌ని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
విన్‌ఫాస్ట్ వీఎఫ్5- రేంజ్, పర్ఫార్మెన్స్..
అంతర్జాతీయ మార్కెట్లో ఈ వీఎఫ్5 ఎలక్ట్రిక్ కారు రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తోంది. భారత మార్కెట్ అవసరాలను బట్టి విన్‌ఫాస్ట్ వీటిలో ఒకదాన్ని ఎంచుకోనుంది:
29.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది 95 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 268 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది.
37.23 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది మరింత శక్తివంతమైన 136 హెచ్‌పీ పవర్‌ను అందిస్తుంది. దీని రేంజ్ సుమారు 326 కిలోమీటర్లుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో తిరిగే వారికి, అలాగే అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్లే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ కానుంది.
విన్‌ఫాస్ట్ వీఎఫ్5- హ్యాచ్‌బ్యాక్ అయినా.. ఎస్‌యూవీ లుక్!
చూడటానికి హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ, వీఎఫ్5 డిజైన్ కొంచెం ఎస్‌యూవీ తరహాలోనే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు బాడీ చుట్టూ ఉండే బ్లాక్ క్లాడింగ్, వెడల్పైన వీల్ ఆర్చెస్ దీనికి ఒక రఫ్ అండ్ టఫ్ లుక్‌ను ఇస్తాయి.
కొలతలు: దీని పొడవు 3,967 ఎంఎం. ఇది టాటా పంచ్ ఈవీ కంటే పొడవుగా ఉండటమే కాకుండా, ఎక్కువ వీల్ బేస్ (2,514 ఎంఎం) కలిగి ఉంది. దీనివల్ల కారు లోపల ప్రయాణికులకు మంచి లెగ్ రూమ్ దొరుకుతుంది.
బూట్ స్పేస్: సాధారణంగా 260 లీటర్ల బూట్ స్పేస్ ఉన్నప్పటికీ, వెనుక సీట్లను మడతపెడితే దీన్ని ఏకంగా 900 లీటర్ల వరకు పెంచుకోవచ్చు!
విన్‌ఫాస్ట్ వీఎఫ్5- ఇంటీరియర్, ఫీచర్లు..
ఈ ఎలక్ట్రిక్ కారు లోపల అన్నీ నలుపు రంగులో ఉండి, అక్కడక్కడా సిల్వర్ టచ్‌తో ప్రీమియం అనుభూతిని కలిగిస్తాయి. సౌకర్యం కోసం ఈ విన్‌ఫాస్ట్ వీఎఫ్5లో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. అదనంగా 4 స్పీకర్ల సౌండ్ సిస్టమ్, గాలిని శుద్ధి చేసే పీఎం2.5 ఫిల్టర్, లెదరెట్ సీట్లు, కీ-లెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు దీని సొంతం.
విన్‌ఫాస్ట్ వీఎఫ్5- ధర ఎంత ఉండవచ్చు?
విన్‌ఫాస్ట్ ఎప్పుడూ తన కార్ల ధరల విషయంలో చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. ప్రధాన పోటీదారు టాటా పంచ్ ఈవీ ధరలు రూ. 10 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, వీఎఫ్5 ధర సుమారు రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉండవచ్చని అంచనా. ఒకవేళ విన్‌ఫాస్ట్ తన బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (బీఏఏఎస్) ప్లాన్‌ను ఇక్కడ కూడా ప్రవేశపెడితే, ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
ఈ విన్‌ఫాస్ట్ వీఎఫ్5 ఎలక్ట్రిక్ కారు లాంచ్, రేంజ్, ధర సహా ఇతర వివరాలపై సంస్థ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
మొత్తానికి 2026లో విన్‌ఫాస్ట్ నుంచి రాబోతున్న ఈ చిన్న కారు మధ్యతరగతి ఈవీ ప్రియులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


