...
...
Next Story

భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం- చెన్నైలో పాఠశాలలు బంద్​..

భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం అవుతోంది. బుధవారం కూడా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్​ జారీ చేసింది. ఈ నేపథ్యంలో చెన్నైలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరిన్ని వివరాలు..

Published on: Dec 3, 2025, 07:30:07 IST
Advertisement

దిత్వా తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, చెన్నైలోని పాఠశాలలకు నేడు, డిసెంబర్ 3న సెలవు ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల యెల్లో, ఇంకొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్​లను జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). బుధవారం తమిళనాడులో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

చెన్నైలో వర్షాలు- దిత్వా తుపాను పరిస్థితి..

భారీ వర్షాలకు చెన్నైలో పరిస్థితి ఇలా.. (PTI)
భారీ వర్షాలకు చెన్నైలో పరిస్థితి ఇలా.. (PTI)

మంగళవారం (డిసెంబర్ 2) బలహీనపడి అల్పపీడనంగా మారిన 'దిత్వా' తుపాను నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. డిసెంబర్ 2న సాయంత్రం 5:30 గంటల సమయానికి ఇది గంటకు 3 కి.మీ. వేగంతో నైరుతి దిశగా కదులుతోంది.

ఆ సమయంలో ఇది పుదుచ్చేరికి ఈశాన్యంగా 60 కి.మీ, చెన్నైకి దక్షిణంగా 80 కి.మీ దూరంలో ఉంది. ఈ అల్పపీడనం భారతదేశానికి తమిళనాడు-పుదుచ్చేరి తీరాల నుంచి కేవలం 25 కి.మీ.ల కనిష్ట దూరంలో ఉంది.

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు..

ఐఎండీ అంచనాల ప్రకారం చెన్నై, కడలూరు, కాంచీపురం, తంజావూరుతో పాటు పలు జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో కోయంబత్తూరు, మధురై, తేని, తిరుప్పూర్, నీలగిరి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, మంగళవారం మధురైలో భారీ వర్షాలు కురిశాయి. దీని కారణంగా సౌత్ మాసి స్ట్రీట్‌తో సహా పలు ప్రాంతాలు నీట మునిగాయని ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది.

మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కొనసాగడంతో, ముందు జాగ్రత్త చర్యగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ వర్షాల కారణంగా చెన్నై, చెంగల్పేట్, కాంచీపురం జిల్లాల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

తమిళనాడులో భారీ వర్షాలు- నష్టం, సహాయక చర్యలు..

డిసెంబర్ 1 నుంచి 2 వరకు గత 24 గంటల్లో చెన్నైలో సగటున 15 సెం.మీ వర్షపాతం నమోదైందని మంత్రి పేర్కొన్నారు.

మరోవైపు, వర్షాలకు సంబంధించిన పనులను, ముఖ్యంగా డ్రైనేజీలలో పూడిక తొలగింపు వంటి చర్యలను చేపట్టడానికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు సహా దాదాపు 22,000 మంది సిబ్బందిని మోహరించింది.

తమిళనాడులో భారీ వర్షాలు- సీఎం స్పందన..

భారీ వర్షాలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ స్పందించారు. అక్టోబర్​ నుంచి ఇప్పటివరకు భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారికి ఎస్​డీఆర్​ఎఫ్​ (స్టేట్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫండ్​) నుంచి అత్యవసంగా పరిహారాన్ని చెల్లించమని అధికారులను ఆదేశించారు. పరిస్థితులను సమీక్షిస్తునట్టు స్పష్టం చేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks