ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే అరెస్ట్
కన్నాట్ ప్లేస్‌లో 'లహెరా దో తిరంగా' ప్రదర్శనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను ఢిల్లీ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ నేతలు చేపట్టిన ఈ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది.
దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వేదికగా తలపెట్టిన 'లహెరా దో తిరంగా' కార్యక్రమానికి బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్ వద్ద ఈ నిరసన ప్రదర్శన నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ప్రదర్శన వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని, ప్రజా భద్రతతో పాటు స్థానిక వ్యాపారులు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతాయని పేర్కొంటూ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఢిల్లీ పోలీసులు అంతకుముందే దీప్కేకు స్పష్టం చేశారు.
కన్నాట్ ప్లేస్‌లో సెక్షన్ 163 అమల్లో ఉందన్న పోలీసులు
అభిజీత్ దిప్కే ఉన్న చోట పోలీసు బలగాలు (PTI)
{{^htLoading}} {{/htLoading}}
ఎన్సీపీ-ఎస్సీపీ ప్రతినిధి అనీష్ గవాండే నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో దీప్కేను పోలీసులు అడ్డుకున్నారు. "కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144) అమల్లో ఉంది. అందుకే మిమ్మల్ని ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నాం" అని పోలీస్ అధికారి ఒకరు దిప్కేకు స్పష్టం చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అయితే పోలీసుల చర్యను దిప్కే తీవ్రంగా ఖండించారు. తాను ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఒకవేళ కన్నాట్ ప్లేస్‌లో అనుమతి లేకపోతే నిరసన తెలపడానికి ప్రత్యామ్నాయ వేదికను చూపించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
అసలు వివాదం ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం జంతర్ మంతర్ నిరసన వేదికను డీనోటిఫై చేయడాన్ని నిరసిస్తూ, జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టారనే ఆరోపణలపై సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వారి ముందస్తు విడుదలను డిమాండ్ చేస్తూనే ఈ 'లహెరా దో తిరంగా' కార్యక్రమానికి సీజేపీ పిలుపునిచ్చింది.
దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని సీజేపీతో పాటు పలు ప్రతిపక్షాలు సుదీర్ఘంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదమే తాజాగా ఢిల్లీలో పోలీసుల ముందస్తు అరెస్టులకు, తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.