CJP protests : ‘పోలీసుల ప్రవర్తనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలి’- సుప్రీంకోర్టు! సిట్ ఏర్పాటు?

Supreme court Delhi police : కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన చలో సంసద్ మార్చ్‌లో విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతిక్రమణకు పాల్పడిన వారిపై స్వతంత్ర దర్యాప్తు జరిపాలని అభిప్రాయపడింది.

Published on: Jul 28, 2026, 12:16:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నీట్​ యూజీ పేపర్​ లీక్​పై పోరాటంలో భాగంగా జులై 20న కాక్రోచ్​ జనతా పార్టీ నిర్వహించిన ‘చలో సంసద్’ నిరసనల్లో దిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై భారత అత్యున్నత నాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చ్‌లో శాంతిభద్రతల పేరుతో పోలీసులు పరిమితి దాటి ప్రవర్తించడంపై సుప్రీంకోర్టు మంగళవారం కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా, హద్దులు దాటి ప్రవర్తించినా సరే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది.

దిల్లీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. (Rahul Singh)
దిల్లీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. (Rahul Singh)

నాటి నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు లాఠీలు, టియర్​ గాస్​తో విరుచుకుపడిన విషయం తెలిసిందే.

పోలీసుల దౌర్జన్యంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు.

“ఈ ఘటనపై పూర్తిగా స్వతంత్ర దర్యాప్తు జరగాలి. హద్దులు దాటి ప్రవర్తించిన వారు ఎవరైనా సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోనప్పుడు నిర్వహించే దర్యాప్తుకు అర్థమే ఉండదు,” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు.

అంతేకాదు, మొత్తం హింసకు సంబంధించి విచారణ, దర్యాప్తు కోసం ‘సిట్​’ ఏర్పాటు చేసే యోచనలో సుప్రీంకోర్టు ఉన్నట్టు తెలుస్తోంది.

'ఆందోళనలు చేశారనే కారణంతో లాఠీఛార్జ్ చేయలేరు'

జులై 20న జరిపిన 'చలో సంసద్' మార్చ్‌లో విద్యార్థులు, నిరసనకారులపై విచక్షణారహితంగా బలాన్ని ప్రయోగించడాన్ని ధర్మాసనం తాజా విచారణలో తీవ్రంగా ఖండించింది. నిరసనల సమయంలో విద్యార్థులతో పాటు పోలీసులకు కూడా గాయాలు కావడం పట్ల తాము అంతే ఆందోళన చెందుతున్నామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఒక ప్రజాస్వామ్యంలో నిరసనకారులు, పోలీసులు ఇద్దరూ ‘స్వయం ప్రతిపత్తి, క్రమశిక్షణ’ పాటించడం చాలా అవసరమని ఉద్ఘాటించింది.

“దీనిని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒకవేళ ఇక్కడ అతిక్రమణలు జరిగి ఉంటే.. ఎవరి తప్పు ఉందో నిష్పక్షపాతంగా పరిశీలించాల్సిందే. ఇది ఒక్క దిల్లీకి మాత్రమే సంబంధించిన అంశం కాదు, దేశవ్యాప్త సమస్య. కేవలం నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నంత మాత్రాన లాఠీఛార్జ్ చేయడాన్ని సమర్థించుకోలేరు. అలాగే నిరసనల పేరుతో హింస చెలరేగడాన్ని కూడా అంగీకరించలేం,” అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

మరొకవైపు, బీహార్‌లో విద్యార్థి నిరసనకారులపై ఏకే-47 తుపాకీని ఉపయోగించిన అంశం కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి.. దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనల నిర్వహణపై సమగ్ర మార్గదర్శకాలను త్వరలోనే పరిశీలిస్తామని వెల్లడించారు.

విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారు!

జులై 20న నిర్వహించిన ‘చలో సంసద్’ ఆందోళనలో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసు బలగాలు విచక్షణారహితంగా వ్యవహరించాయనే ఆరోపణలకు మరిన్ని ఆధారాలు బలం చేకూరుస్తున్నాయి. ఆందోళనకారులను రద్దు చేసేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్​ఏఎఫ్) కనీసం రెండు సందర్భాల్లో ‘యాంటీ రైయట్ గన్స్’ ఉపయోగించిందని సమాచారం వెలుగులోకి వచ్చింది.

ఈ నిరసనల సమయంలో విద్యార్థులు, ఆందోళనకారులపై తాము పెల్లెట్ గన్స్ వాడలేదని దిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఖండిస్తూ వచ్చారు. కానీ, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 'జనరల్ డైరీ' ఎంట్రీ వివరాలు ఆ వాదనను పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి. జంతర్ మంతర్ వద్ద విధుల్లో ఉన్న డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హోదా కలిగిన అధికారి ఆదేశాల మేరకే ఆర్‌ఏఎఫ్ సిబ్బంది రెండుసార్లు యాంటీ రైయట్ గన్స్‌ను ప్రయోగించినట్లు వార్తా సంస్థ పీటీఐ మంగళవారం కథనం వెలువరించింది.

నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు "చలో సంసద్" మార్చ్ చేపట్టారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ సమీపంలో గుమిగూడిన గుంపును చెదరగొట్టేందుకు తీవ్రస్థాయిలో చర్యలు తీసుకున్నారు. ప్రాణాంతకం కాని మునిషన్స్‌తో పాటు కనీసం రెండు రౌండ్ల 'ప్లాస్టిక్ పెల్లెట్లను' ఆర్‌ఏఎఫ్ బలగాలు ప్రయోగించినట్లు అధికారిక రికార్డుల్లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఒకవైపు సుప్రీంకోర్టు ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించగా, మరోవైపు పోలీస్ స్టేషన్ రికార్డులే పోలీసుల చర్యలను బహిర్గతం చేయడం గమనార్హం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More