CNG price : నిన్న పెట్రోల్​, డీజిల్​- ఈరోజు సీఎన్జీ.. సామాన్యుడిపై ధరల పిడుగు!

CNG price in Delhi : దేశ ప్రజలకు గత కొన్ని రోజులుగా నిద్రలేస్తూనే షాక్​ తగులుతోంది! నిన్న పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచిన ఓఎంసీలు తాజాగా సీఎన్జీ రేట్లను సైతం సవరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా సీఎన్జీ ధరలు మళ్లీ పెరిగాయి. ఆ వివరాలు..

Published on: May 26, 2026, 09:38:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CNG price Hyderabad : అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఇంధన ధరల మంట కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం నేరుగా భారతీయ వాహనదారుల జేబులపై పడుతోంది. నిన్న పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. ఇక ఈరోజు, మంగళవారం సీఎన్జీ ధర కిలోకు రూ. 2 మేర జంప్​ అయ్యాయి.

సీఎన్జీ ధరలు పెంపు- ఈసారి ఎంతంటే.. (Sunil Ghosh/Hindustan Times))
సీఎన్జీ ధరలు పెంపు- ఈసారి ఎంతంటే.. (Sunil Ghosh/Hindustan Times))

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న డ్రోన్లు, క్షిపణుల యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన అవసరాలలో ఐదో వంతు వాటా సరఫరా చేసే అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్’ జలమార్గం దాదాపు మూతపడింది. భౌగోళికంగా ఈ ప్రాంతంపై ఇరాన్‌కు పట్టు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు విపరీతంగా అంటుకున్నాయి. దీని ప్రభావంతో గడిచిన 15 రోజుల్లోనే ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి.

ధరల పెంపునకు సంబంధించిన పూర్తి వివరాలు, తాజా రేట్లు ఇక్కడ చూద్దాం:

1. 15 రోజుల్లోపే నాలుగోసారి పెరిగిన సీఎన్జీ ధరలు..

సాధారణ పెట్రోల్ ఖర్చులు భరించలేక సీఎన్జీ వాహనాలకు మారిన మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా ధరల సెగ తప్పడం లేదు.

తాజా సవరణలో సీఎన్జీ ధర కిలోకు రూ. 2 పెరిగింది. దీనితో దిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ. 83.09 కి చేరుకుంది.

ఇక హైదరాబాద్​లో సీఎన్జీ ధర కిలోకు రూ. 97గా ఉంది. విజయవాడలో రూ. 91గా కొనసాగుతోంది.

కేవలం మూడు రోజుల క్రితమే సీఎన్జీపై రూ. 1 పెంచిన కంపెనీలు, ఇప్పుడు మళ్లీ రూ. 2 పెంచడం గమనార్హం. 15 రోజుల్లో సీఎన్జీ ధర పెరగడం కూడా ఇది నాలుగోసారి.

2. రూ. 100 దాటిన పెట్రోల్.. భారీగా పెరిగిన డీజిల్

ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్​లో పెరిగిన ముడిచమురు భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) ధరలను సవరించాయి.

పెట్రోల్ ధర: లీటరుకు రూ. 2.61 పెరగడంతో.. దిల్లీలో పాత ధర రూ. 99.51 నుంచి ఏకంగా రూ. 102.12 కి చేరింది. 2022 తర్వాత పెట్రోల్ ధర రూ. 100 మార్కును దాటడం ఇదే మొదటిసారి.

డీజిల్ ధర: లీటరుకు రూ. 2.71 పెరగడంతో.. దిల్లీలో ప్రస్తుతం డీజిల్ ధర రూ. 92.49 నుంచి రూ. 95.20 కి చేరింది.

మే 15 నుంచి ఇప్పటివరకు జరిగిన వరుస పెంపులతో కేవలం రెండు వారాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ. 7.50 మేర పెరగడం గమనార్హం.

చమురు కంపెనీల భారీ నష్టాలు..

ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మే 15న మొదటిసారి ధరలు పెంచడానికి ముందు చమురు మార్కెటింగ్ కంపెనీల రోజువారీ నష్టం దాదాపు రూ. 1,000 కోట్లుగా ఉండేది. ప్రస్తుత ధరల పెంపు తర్వాత ఆ నష్టం "కొద్దిగా తగ్గి రూ. 600 కోట్ల లోపుకు" చేరింది.

కంపెనీలు తమ ప్రస్తుత నష్టాల నుంచే కాకుండా, గతంలో ఆటో ఇంధనాలు, వంటగ్యాస్ (ఎల్పీజీ) పై వచ్చిన నష్టాలను కూడా భర్తీ చేసుకుంటున్నాయి. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ ఇంధన ధరల పెంపు కొనసాగవచ్చని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More