Cockroach Janta Party : అల్లాడిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ! ఇన్​స్టాగ్రామ్​లో బీజేపీని దాటేసి..

దేశంలో నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, వ్యవస్థలపై యువతలో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తూ ఇంటర్నెట్‌లో వ్యంగ్యంగా ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటి, బీజేపీ అధికారిక ఖాతాను వెనక్కి నెట్టింది!

Published on: May 21, 2026, 07:14:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Cockroach Janata party Instagram : భారతీయ సోషల్ మీడియా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక వినూత్న డిజిటల్ విప్లవం నడుస్తోంది! కేవలం ఒక జోక్‌గా, పొలిటికల్ సెటైర్‌గా కేవలం కొన్ని రోజుల క్రితం (మే 16) ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మే 20 నాటికి ఈ పేజీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 9 మిలియన్లు (90 లక్షలు) దాటిపోయింది. గురువారం ఉదయం నాటికి 9.3 మిలియన్ల దగ్గర ఉంది.

దుమ్మురేపుతున్న కాక్రోచ్​ జనతా పార్టీ !
దుమ్మురేపుతున్న కాక్రోచ్​ జనతా పార్టీ !

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా, 14 కోట్లకు పైగా సభ్యులు ఉండి.. గత 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు ప్రస్తుతం 8.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అంటే, కేవలం 54 పోస్టులు మాత్రమే పెట్టిన ఒక నయా సెటైర్ పేజీ.. 18,000 కంటే ఎక్కువ పోస్టులు పెట్టిన అధికార బీజేపీని ఫాలోవర్ల రేసులో అధిగమించింది!

ఇక విపక్షాల నెంబర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది! ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు 13.2 మిలియన్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 1.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

అసలు ఎలా ప్రారంభమైంది?:

ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) సూర్యకాంత్ ఒక కోర్టు విచారణ సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఆయన ‘కాక్రోచ్’ (బొద్దింకలు), ‘పారాసైట్స్’ (పరాన్నజీవులు) అనే పదాలను వాడారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది.

ఆ తర్వాత సీజేఐ స్పందిస్తూ.. తాను నిరుద్యోగ యువతను అనలేదని, నకిలీ డిగ్రీలతో చట్టం, మీడియా రంగాల్లోకి వస్తున్న వారిని ఉద్దేశించి మాత్రమే అన్నానని, దేశ యువత అభివృద్ధికి మూలస్తంభాలని స్పష్టత ఇచ్చారు.

కాక్రోచ్ జనతా పార్టీ..
కాక్రోచ్ జనతా పార్టీ..

కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది! మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల అభిజీత్ దిప్కే అనే యువకుడు ఈ వ్యాఖ్యలపై సెటైరిక్‌గా స్పందిస్తూ మే 16న ఎక్స్ (ట్విట్టర్) లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ని ప్రకటిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. "దేశంలోని బొద్దింకల (నిరుద్యోగుల) కోసమే ఈ సరికొత్త ప్లాట్‌ఫారమ్. జాయిన్ అవ్వాలనుకునే వారికి ఉండాల్సిన అర్హతలు: నిరుద్యోగి అయి ఉండాలి, బద్ధకస్తుడు, 24 గంటలు ఆన్‌లైన్‌లో ఉంటూ ప్రొఫెషనల్‌గా గొడవపడగలిగే సామర్థ్యం ఉండాలి," అంటూ పెట్టిన పోస్ట్ కాస్తా విపరీతంగా వైరల్ అయ్యింది. 'యువత కోసం, యువత చేత, యువత పొలిటికల్ ఫ్రంట్' అని దీని బయోలో రాసుకొచ్చారు.

అభిజీత్ దిప్కే ఎవరు?:

ఈ వినూత్న ప్రచారానికి కారకుడైన అభిజీత్ దిప్కే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందినవాడు. ఆయన ఇటీవల అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) లో మాస్టర్స్ పూర్తి చేశారు. అంతకుముందు 2020-2022 మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీమ్‌లో వాలంటీర్‌గా, దిల్లీ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

సెటైర్ నుంచి సిస్టమ్​పై పోరాటం వైపు!

కేవలం సరదాగా ప్రారంభమైన ఈ పేజీ.. ఇప్పుడు నిరుద్యోగం, నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలు, రాజకీయ జవాబుదారీతనం వంటి తీవ్రమైన అంశాలపై యువతలో ఉన్న నిరాశను, అసంతృప్తిని వ్యక్తపరిచే వేదికగా మారింది. కేవలం 4 రోజుల్లోనే ఈ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో 1.6 లక్షల (1,60,000) కంటే ఎక్కువ మంది యువత సభ్యులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఈ మూవ్‌మెంట్‌కు అఖిలేష్ యాదవ్, మహువా మోయిత్రా, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖ రాజకీయ నేతలు, సామాజిక విశ్లేషకులు కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు పలకడం విశేషం.

‘అబ్ కీ బార్ 10 మిలియన్ పార్’..

బీజేపీని ఇన్‌స్టాగ్రామ్‌లో దాటేయడంతో నిరుద్యోగ యువత, నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ పండగ చేసుకుంటున్నారు. బీజేపీ గత ఎన్నికల స్లోగన్ ‘అబ్ కీ బార్ 400 పార్’ని పేరడీ చేస్తూ.. 'అబ్ కీ బార్ 10 మిలియన్ పార్' (ఈసారి 10 మిలియన్లు దాటుతాం) అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. "ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీని ఇన్‌స్టాలో దాటేశాం.. యువత పవర్ ఏంటో తక్కువ అంచనా వేయకండి," అని సీజేపీ పేజీ పేర్కొంది.

ఈ పేజీ జోరు చూస్తుంటే.. 10 మిలియన్ ఫాలోవర్ల మార్క్​ని చేరడానికి ఎక్కువ సమయం పట్టేలా లేదు! ఇంకా 7లక్షల మంది ఫాలో అయితే చాలు!

అయితే కొందరు నెటిజన్లు.. "ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు పెరిగినంత మాత్రాన ఎన్నికల్లో ఓట్లు పడతాయా బ్రో?" అని ప్రశ్నించగా, దానికి సీజేపీ సపోర్టర్లు "వెయిట్ అండ్ వాచ్.. పిక్చర్ అభీ బాకీ హై" అని బదులిస్తున్నారు. ఈ డిజిటల్ ఉద్యమానికి వస్తున్న స్పందనను బట్టి.. తాను త్వరలోనే ఇండియాకు తిరిగి వచ్చి దీనిని ఒక స్వతంత్ర సంస్థగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More