...
...
Next Story

కాక్రోచ్ జనతా పార్టీ, నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా

‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP), ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’ (NPF) పేరుతో పుట్టుకొచ్చిన రెండు వ్యంగ్య పార్టీలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. వినడానికి నవ్వులాటగా ఉన్నా, ఈ ‘మీమ్స్’ వెనుక యువతలో ఉన్న అసలైన నిరుద్యోగ నిరసన దాగి ఉంది.

Published on: May 20, 2026, 14:25:56 IST
Advertisement

మన దేశంలో రాజకీయ పార్టీలకు కొదవలేదు. కులం, మతం, ప్రాంతం ఆధారంగా పుట్టిన పార్టీలను చూశాం. కానీ తొలిసారిగా 'కీటకాల' పేరుతో ఒక డిజిటల్ విప్లవం మొదలైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అభిజీత్ దిప్కే స్థాపించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఇప్పుడు ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదిస్తూ హాట్ టాపిక్‌గా మారింది. వీరికి పోటీగా ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’ (NPF) కూడా రంగంలోకి దిగడంతో దేశంలో ‘మీమ్ పాలిటిక్స్’ కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

అవమానం నుంచే ఆవిర్భావం: అసలు కథ ఇదీ..

కాక్రోచ్ జనతా పార్టీ, నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా
కాక్రోచ్ జనతా పార్టీ, నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా

ఈ వింత రాజకీయ పార్టీల వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. నిరుద్యోగ యువతను 'బొద్దింకలు' (Cockroaches), 'పరాన్నజీవులు' (Parasites) అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. ఆ తరువాత సీజేఐ తన వ్యాఖ్యలు ఫేక్ డిగ్రీలను ఉద్దేశించి చేసినవని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ అవమానాన్ని భరించలేక, యువత వాటినే తమ ఆయుధాలుగా మార్చుకున్నారు. "మమ్మల్ని బొద్దింకలు అన్నారా? సరే.. మేము ఆ పేరుతోనే వ్యవస్థను ప్రశ్నిస్తాం" అంటూ అభిజీత్ దిప్కే మే 16న CJPని స్థాపించారు. ఇది కేవలం వ్యంగ్యం (Satire) మాత్రమే అని చెబుతున్నప్పటికీ, దీనికి వస్తున్న ఆదరణ చూస్తుంటే యువతలోని అసహనం స్పష్టంగా కనిపిస్తోంది.

బొద్దింకల మేనిఫెస్టో: నవ్వుతూనే చురకలు

కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇందులో ఉన్న డిమాండ్లు సామాన్యుడి ఆవేదనకు అద్దం పడుతున్నాయి.

  • న్యాయమూర్తులకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు.
  • పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై సుదీర్ఘకాలం నిషేధం విధించాలి.
  • తప్పుడు వార్తలు ప్రచారం చేసే మీడియా సంస్థలపై కఠిన చర్యలు.
  • కేబినెట్‌లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.

CJPకి పోటీగా వచ్చిన నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ (NPF) మరింత సీరియస్‌గా వ్యంగ్యాన్ని వడ్డిస్తోంది. "మేము వ్యవస్థను పట్టుకుని వేలాడే పరాన్నజీవులం కాదు.. కుళ్ళిన వ్యవస్థను లోపలి నుంచి మార్చడానికి వచ్చిన సైనికులం" అని వారు ప్రకటిస్తున్నారు. రోడ్లు చెరువుల్లా మారని, కరెంట్ బిల్లు కట్టడానికి ఇబ్బందులు లేని పాలన కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

"ప్రజలు ఈ అవమానాల్లో తమని తాము చూసుకున్నారు. అందుకే ఈ పోరాటం ఇంత వేగంగా విస్తరించింది," అని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే వ్యాఖ్యానించారు.

డిజిటల్ విప్లవం: ప్లకార్డులు పోయి.. మీమ్స్ వచ్చాయి

గతంలో నిరుద్యోగులు లేదా యువత రోడ్లపైకి వచ్చి ప్లకార్డులతో నిరసన తెలిపేవారు. కానీ 2026 నాటి డిజిటల్ యుగంలో స్టైల్ మారింది. ఒక వెబ్‌సైట్ తెరవడం, ఒక లోగో డిజైన్ చేయడం, వ్యంగ్యంగా మేనిఫెస్టో రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. లంచ్ టైమ్ అయ్యేసరికి లక్షల మంది ఫాలోవర్లను సంపాదించడం.. ఇదీ నేటి ట్రెండ్. మహువా మోయిత్రా వంటి ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ పోస్టులపై స్పందించడంతో ఈ ‘సెటైర్’ పార్టీలకు మరింత మైలేజ్ వచ్చింది.

ఇవి ఎన్నికల కమిషన్ గుర్తించిన పార్టీలు కాకపోవచ్చు, కానీ ప్రజల మనసుల్లోని అసంతృప్తిని నవ్వుల రూపంలో పాలకులకు చేరువ చేయడంలో మాత్రం ఇవి సూపర్ సక్సెస్ అయ్యాయి. సీజేపీ ఇప్పటికే తన ఇన్‌స్టా అకౌంట్‌కు 4.3 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిజమైన రాజకీయ పార్టీయేనా?

కాదు, ఇది కేవలం ఒక వ్యంగ్య (Satirical) ఉద్యమం. నిరుద్యోగం, రాజకీయ వ్యవస్థపై నిరసనను హాస్యం ద్వారా తెలియజేయడానికి అభిజీత్ దిప్కే దీనిని స్థాపించారు.

2. నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ అంటే ఏమిటి?

ఇది కాక్రోచ్ జనతా పార్టీకి పోటీగా సోషల్ మీడియాలో వెలసిన మరో వ్యంగ్య వేదిక. నిరుద్యోగులను 'పరాన్నజీవులు' అని పిలిచిన వారికి వ్యతిరేకంగా ఇది పుట్టుకొచ్చింది.

3. ఈ పార్టీల మేనిఫెస్టోలో ఏముంది?

ఇవి నిరుద్యోగం, న్యాయ వ్యవస్థ సంస్కరణలు, ఫిరాయింపుదారుల నిరోధం, మహిళా రిజర్వేషన్ల వంటి అంశాలపై హాస్యభరితంగా, కానీ లోతైన సందేశంతో కూడిన డిమాండ్లను ఉంచాయి.

4. ఈ ఉద్యమం ఎందుకు ఇంత వైరల్ అవుతోంది?

యూత్ ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు, సోషల్ మీడియాలో వచ్చే అవమానకర వ్యాఖ్యలకు ఇది ఒక 'రివర్స్ అటాక్' లా ఉండటంతో నెటిజన్లు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks