Colombia earthquake : పెను భూకంపంతో అతలాకుతలమైన కొలంబియా- 111మంది మృతి!
కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం కారణంగా 111 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది.
కొలంబియా దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. ఈ పెను విపత్తులో ఇప్పటివరకు కనీసం 111 మంది ప్రాణాలు కోల్పోగా, డజన్ల కొద్దీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని వివరించారు.

పశ్చిమ కొలంబియాలో, స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:34 గంటలకు రిక్టార్ స్కేలుపై 7.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీనితో అక్కడ పరిస్థితులు దయనీయంగా మారాయి.
పలు నగరాల్లో క్షతగాత్రుల కోసం రెస్క్యూ టీమ్‌లు తీవ్రంగా గాలిస్తున్నాయి.
"ప్రాణాలను రక్షించడానికి, బాధితులను ఆదుకోవడానికి, అవసరమైన ప్రతి ప్రాంతానికి సహాయం అందించడానికి మా ప్రభుత్వం యంత్రాంగాన్ని పూర్తిగా మోహరించింది," అని బొగోటా నుంచి జాతిని ఉద్దేశించి దేశ అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా పేర్కొన్నారు.
కొలంబియా భూకంపంలో 111 మంది మృతి చెందగా, 87 మంది గాయపడ్డారని, వెయ్యికి పైగా భవనాలు దెబ్బతిన్నాయని.. కేవలం మూడు రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టిన అబెలార్డో తెలిపారు.
ఈ భూకంప కేంద్రాన్ని తీర ప్రాంతమైన చోకోలో 100 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. వెనుకబడిన ఈ ప్రాంతంలోనే 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
పెను ప్రభావం చూపిన ప్రాంతాల్లో పెరెయిరా నగరం ఒకటి. రిసారాల్డా ప్రాంతంలో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మానిజేలస్ నగరంలో ఒక చారిత్రక కేథడ్రల్ టవర్ పూర్తిగా నేలమట్టమైందని ఏఎఫ్‌పీ జర్నలిస్ట్ తెలిపారు.
"నగరంలో చాలా వరకు భవనాలు దెబ్బతిన్నాయి. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మరో భూకంపం వస్తుందనే భయంతో ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు సాహసించడం లేదు," అని 50 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి జైమే జులువాగా వివరించారు.
గల్లంతైన వారే ఎక్కువగా ఉన్నారు: బాధితుల ఆవేదన
కొలంబియా మూడో అతిపెద్ద నగరమైన కాలిలో కనీసం 20 భవనాలు కూలిపోవడంతో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారని మేయర్ అలెజాండ్రో ఎడర్ తెలిపారు. ప్రావిన్షియల్ రాజధాని కిబ్డోలో తీవ్ర నష్టం జరిగిందని చోకో గవర్నర్ హెచ్చరించారు. అక్కడ అనేక భవనాలు కుప్పకూలినట్లు వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.
"మేమంతా కోలుకోలేని స్థితిలో ఉన్నాం. ఇక్కడ కొందరు చనిపోయారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. అంతకంటే ఎక్కువగా చాలా మంది ఆచూకీ గల్లంతైంది," అని కిబ్డో కమ్యూనిటీ లీడర్ లూయిస్ గ్రెగోరియో మోరెనో ఆవేదన వ్యక్తం చేశారు.
కొలంబియా రాజధాని బొగోటాలో భవనాలు దెబ్బతినడంతో జనం భయంతో రోడ్లమీదకు పరుగులు తీశారు. చాలా మంది రాత్రి దుస్తులతోనే బయటకు పరుగులు తీశారు.
"భూకంపం చాలా తీవ్రంగా వచ్చింది," అని రాజధానిలో ఉన్న 29 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ వలేరియా పోలో చెప్పారు. అయితే అక్కడ స్వల్ప నష్టం మాత్రమే నమోదైంది.
భూకంప ప్రభావంతో పశ్చిమ కొలంబియాలోని ఆరు చిన్న విమానాశ్రయాలు సర్వీసులను నిలిపివేశాయి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను సైతం వాయిదా వేసినట్లు క్రీడా సంఘాలు ప్రకటించాయి.
కొలంబియాను కుదిపేసిన ఈ భారీ భూకంప పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని, ప్రజలకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఎక్స్ వేదికగా తెలిపారు. దక్షిణ అమెరికా దేశానికి అవసరమైన సహాయం అందించడానికి యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉందని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్లకు సాయపడేలా కోపర్నికస్ శాటిలైట్ సర్వీసులను ఇప్పటికే రంగంలోకి దించామని ఆమె తెలిపారు. ఇజ్రాయెల్, మెక్సికో, ఈక్వెడార్, ఫ్రాన్స్ దేశాలు కూడా సహాయం అందిస్తామని ముందుకొచ్చాయి.
గత జూన్‌లో వెనెజువెలాను తాకిన రెండు భారీ భూకంపాల వల్ల 6 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయి అపార నష్టం వాటిల్లిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. లాటిన్ అమెరికా ప్రాంతం ఇంకా ఆ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే కొలంబియా భూకంపం మరోసారి అందరిలో దుఖాన్ని నింపింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


