ఆపరేషన్ సిందూర్ వీరవనితకు అరుదైన గౌరవం.. కల్నల్ సోఫియా ఖురేషీకి ‘విశిష్ట సేవా మెడల్’
భారత సైన్యంలో ధీరత్వానికి నిలువుటద్దంగా నిలిచిన కల్నల్ సోఫియా ఖురేషీని కేంద్ర ప్రభుత్వం 'విశిష్ట సేవా మెడల్'తో గౌరవించింది. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన ఆమెతో పాటు మొత్తం 301 మందికి రాష్ట్రపతి సైనిక పురస్కారాలను ప్రకటించారు.
2025లో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులపై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో ప్రపంచ వేదికపై భారత సైన్యానికి ప్రతినిధిగా నిలిచిన కల్నల్ సోఫియా ఖురేషీకి మరో అరుదైన గౌరవం దక్కింది. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించిన గౌరవ జాబితాలో ఆమె పేరును 'విశిష్ట సేవా మెడల్' గ్రహీతగా చేర్చారు. అత్యున్నత స్థాయి విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆమెకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేయనున్నారు.

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను ఆమోదించారు. మరణానంతరం ఈ పురస్కారాలు దక్కిన వారిలో ఆరుగురు ఉన్నారు.
ముర్ము ఆమోదించిన మొత్తం 301 సైనిక అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి:
పరమ విశిష్ట సేవా మెడల్స్: 30
ఉత్తమ యుద్ధ సేవా మెడల్స్: 04
అతి విశిష్ట సేవా మెడల్స్: 56
యుద్ధ సేవా మెడల్స్: 09
సేనా మెడల్స్ (విశిష్ట - బార్): 02
సేనా మెడల్స్ (విశిష్ట): 43
నౌ సేనా మెడల్స్ (విశిష్ట): 08
వాయు సేనా మెడల్స్ (విశిష్ట): 14
విశిష్ట సేవా మెడల్స్: 135
ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషీ?
కల్నల్ సోఫియా ఖురేషీ పేరు భారత సైనిక చరిత్రలో ఒక మైలురాయి. 2016లో ఓ అంతర్జాతీయ సైనిక విన్యాసానికి భారత ఆర్మీ తరపున నేతృత్వం వహించిన తొలి మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. 'ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18' పేరుతో ఆసియా-ప్లస్ దేశాలు పాల్గొన్న మెగా మిలిటరీ డ్రిల్‌లో మానవతా దృక్పథంతో కూడిన మైన్ యాక్షన్ బృందానికి ఆమె నాయకత్వం వహించారు.
1974లో గుజరాత్‌లోని వడోదరలో ఒక సైనిక కుటుంబంలో సోఫియా జన్మించారు. 1997లో మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో మాస్టర్స్ పూర్తి చేసిన ఆమె, తన తాత స్ఫూర్తితో సైన్యంలో చేరారు. ఆమె తాత ఆర్మీలో మతపరమైన బోధకుడిగా ఉండేవారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) నుంచి సైన్యంలోకి ప్రవేశించిన సోఫియా వ్యూహరచన, సిగ్నల్ ఇంటెలిజెన్స్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు.
ఆపరేషన్ సిందూర్- ఇతర విజయాలు..
కల్నల్ సోఫియా ఖురేషీ తన ప్రశాంతమైన ప్రవర్తనకు, స్పష్టమైన మాటతీరుకు ప్రసిద్ధి. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో కలిసి ఆమె నిర్వహించిన ప్రెస్ బ్రీఫింగ్‌లు భారత సైన్యానికిఉన్న స్పష్టతను, ధీమాను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఆపరేషన్ ఏ విధంగా విజయవంతమైందో వారు వివరించిన తీరు విశేష ప్రశంసలు అందుకుంది.
మరికొన్ని మైలురాళ్లు:
ఆపరేషన్ పరాక్రమ్: 2001 పార్లమెంటు దాడి తర్వాత పంజాబ్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఆమె సేవలకు గాను జీఓసీ-ఇన్-సీ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
వరద సహాయక చర్యలు: ఈశాన్య భారతంలో వరదలు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించి, సిగ్నల్ ఆఫీసర్-ఇన్-చీఫ్ నుంచి గుర్తింపు పొందారు.
ఐక్యరాజ్యసమితి సేవలు: 2006 నుంచి ఆరేళ్ల పాటు కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో పనిచేశారు. "సంక్షోభ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు నేను చేసిన ప్రయత్నాలు నాకు ఎంతో గర్వకారణం," అని ఆమె పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


