LPG cylinder price hike : పండుగకు ముందు షాక్! ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు- ఎంతంటే..
పండుగ సీజన్ ముంగిట వ్యాపారులకు చమురు సంస్థలు షాకిచ్చాయి. అక్టోబర్ 1 నుంచి 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ. 62 నుంచి రూ. 71.50 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ (14.2 కేజీలు) సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
దసరా పండుగ వేళ హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ నిర్వాహకులకు చమురు విక్రయ సంస్థలు బిగ్ షాక్ ఇచ్చాయి! వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను గురువారం (అక్టోబర్ 1) నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. నగరాలను బట్టి ఈ సిలిండర్ ధర రూ. 62.50 నుంచి గరిష్టంగా రూ. 71.50 వరకు పెరిగింది!

అయితే గృహ వినియోగదారులు వాడే 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.
నగరాల వారీగా పెరిగిన ధరల వివరాలు
దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 62.50 పెరిగి రూ. 2,810కి చేరింది. సెప్టెంబర్ నెలలో దీని ధర రూ. 2,747.50గా ఉండేది.
మిగిలిన ప్రధాన నగరాల్లోనూ కొత్త ధరలు ఈ క్రింది విధంగా అమల్లోకి వచ్చాయి:
హైదరాబాద్: భాగ్యనగరంలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 69 పెరగడంతో 19 కేజీల సిలిండర్ ధర రూ. 3,065కి చేరింది.
విజయవాడ : విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 69 పెరిగి రూ. 3,001.50కి చేరింది.
బెంగళూరు: దేశ ఐటీ హబ్‌లో 19 కేజీల సిలిండర్ రూ. 67 వృద్ధిచెంది రూ. 2,898కి వెళ్లింది.
ముంబై: రూ. 63 పెరగడంతో సిలిండర్ ధర రూ. 2,701 నుంచి రూ. 2,764కు పెరిగింది.
చెన్నై: రూ. 66.50 పెంపుతో రూ. 2,916.50గా ఉన్న ధర ఇప్పుడు రూ. 2,983కి చేరింది.
పట్నా: దేశంలోనే అత్యధికంగా ఇక్కడ రూ. 71.50 పెరిగింది. దీనితో గతంలో రూ. 3,029గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ. 3,100.50కి చేరింది.
లక్నో: రూ. 62.50 పెరగడంతో ధర రూ. 2,932.50గా మారింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, రూపాయి మారకపు విలువ ఆధారంగా ఎల్పీజీ గ్యాస్ ధరలను సవరించినట్లు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) వర్గాలు స్పష్టం చేశాయి.
హోటల్ ఆహార పదార్థాల ధరలపై ప్రభావం..
ఇళ్లల్లో వినియోగించే సిలిండర్ ధరలు పెరగనప్పట్టికీ, కమర్షియల్ సిలిండర్ల ధరల పెంపు అనేది సామాన్యుడి మీద పరోక్షంగా ప్రభావం చూపించనుంది. వాణిజ్య గ్యాస్ ధరలు పెరగడంతో పండుగల వేళ బయట తినే ఆహార పదార్థాల ధరలు, టిఫిన్లు, స్వీట్ల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, దాబాలు, బేకరీలు, కేటరింగ్ రంగాలు నడిపే వ్యాపారుల నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ఈ అదనపు భారం చివరికి వినియోగదారులపై పడే అవకాశం ఉంది.
స్థిరంగా గృహ వినియోగ గ్యాస్ ధరలు..
కమర్షియల్ గ్యాస్ ధరలు బాదినప్పటికీ, ఇళ్లలో వంట కోసం వాడే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు సంస్థలు యథాతథంగా ఉంచాయి. దిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 942, ముంబైలో రూ. 941.50, చెన్నైలో రూ. 957.50, లక్నోలో రూ. 979.50, పట్నాలో రూ. 1,031.50 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక హైదరాబాద్, విజయవాడల్లో ఇళ్లల్లో వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలు వరుసగా రూ. 994, 966.5గా ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


