LPG price hike : షాక్​ మీద షాక్​! మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్​ ధరలు..

LPG cylinder price in Hyderabad : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం గ్యాస్ సిలిండర్లపై పడింది. ఏప్రిల్ 1 నుంచి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ. 195.5 పెరిగింది. అయితే డొమెస్టిక్ (వంట) గ్యాస్ వినియోగదారులకు మాత్రం ఉపశమనం లభించింది.

Published on: Apr 01, 2026 8:02 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, సరఫరాలో తలెత్తిన ఆందోళనల నేపథ్యంలో.. భారతీయ చమురు సంస్థలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులపై భారీ భారాన్ని మోపాయి. బుధవారం వెలువడిన నివేదికల ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ. 195.5 మేర పెంచాయి. ఈ తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,078.50కి చేరుకుంది.

కమర్షియల్​ ఎల్పీజీ సిలిండర్​ ధరలు పెంపు..
కమర్షియల్​ ఎల్పీజీ సిలిండర్​ ధరలు పెంపు..

ఫిబ్రవరి చివరలో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత, చమురు ధరలు పెరగడంతో మార్చి 7న కమర్షియల్​, డొమెస్టిక్​ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్​ సంస్థలు పెంచిన విషయం తెలిసిందే.

కాగా.. గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రస్తుతానికి యథాతథంగా ఉంచారు. ప్రస్తుతం దిల్లీలో ఒక 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 913 వద్ద కొనసాగుతోంది.

అంటే వాణిజ్య సిలిండర్ల ధరలు నెల రోజుల్లో రెండుసార్లు పెరిగాయని అర్థం. ఇది ప్రజలపై పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది. ఇలా కమర్షియల్​ సిలిండర్​ ధరలు పెరిగితే, రెస్టారెంట్లు, హోటళ్లు ఆ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తారు.

ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు ప్రతి నెలా ఒకటో తేదీన అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌లు, మారకపు విలువ ఆధారంగా ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగానే ఏప్రిల్​ 1 వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచాయి.

ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపు- వివిధ నగరాల్లో ఇలా..

దిల్లీ : డొమెస్టిక్​ సిలిండర్​- రూ. 913, కమర్షియల్​- రూ. 2078.5

కోల్​కతా : డొమెస్టిక్​ సిలిండర్​- రూ. 939, కమర్షియల్​- రూ. 22-8

ముంబై : డొమెస్టిక్​ సిలిండర్​- రూ. 912.5, కమర్షియల్​- రూ. 2031

చెన్నై : డొమెస్టిక్​ సిలిండర్​- రూ. 928.5, కమర్షియల్​- రూ. 2246.5

హైదరాబాద్​ : డొమెస్టిక్​ సిలిండర్​- 965, కమర్షియల్​- రూ. 2301

ధరల పెంపునకు గల ప్రధాన కారణాలు..

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు చమురు మార్కెట్‌లో అనిశ్చితిని సృష్టించాయి. ఫిబ్రవరిలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి, ప్రపంచ చమురు ధరలు దాదాపు 50% పెరిగాయి. ఇంధన సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడటం వల్ల ఈ సంక్షోభం తలెత్తింది. ఫలితంగా సిలిండర్​ ధరలను సైతం పెంచుతున్నారు.

మరోవైపు గ్యాస్ సరఫరా పరిస్థితిపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్చి 31న ఒక ప్రకటన విడుదల చేసింది.

కమర్షియల్ సప్లై: కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను 20% వరకు పునరుద్ధరించామని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా, పీఎన్జీ విస్తరణలో భాగంగా రాష్ట్రాలకు అదనంగా మరో 10% కమర్షియల్ గ్యాస్‌ను కేటాయించాలని ప్రతిపాదించింది.

వలస కార్మికుల కోసం: మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా వలస కార్మికులకు 3.2 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లను విక్రయించారు. కేవలం నిన్న ఒక్కరోజే 63,000 సిలిండర్లు అమ్ముడయ్యాయి.

ఆన్‌లైన్ బుకింగ్స్: ఎల్పీజీ సిలిండర్ల ఆన్‌లైన్ బుకింగ్‌లు మార్చి 30 నాటికి రికార్డు స్థాయిలో 92 శాతానికి పెరిగాయి.

అక్రమాల నిరోధం: గ్యాస్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' (డీఏసీ) విధానాన్ని పటిష్టం చేశారు. ఫిబ్రవరిలో 53%గా ఉన్న డీఏసీ ఆధారిత డెలివరీలు మార్చి నాటికి 83%కి చేరుకున్నాయి.

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని అంగీకరించిన కేంద్రం, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. చమురు సంస్థలు ప్రతిరోజూ సగటున 50 లక్షలకు పైగా డొమెస్టిక్ సిలిండర్లను డెలివరీ చేస్తున్నాయని వివరించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More