LPG vs PNG : ఎల్పీజీ వర్సెస్​ పీఎన్జీ- కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనల పూర్తి వివరాలు..

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ యుద్ధం ముదురుతుండటంతో భారతదేశంలో వంటగ్యాస్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఎల్పీజీ సిలిండర్ల వాడకాన్ని తగ్గించి, పీఎన్జీ వాడకాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసలు వీటి మధ్య తేడాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Mar 29, 2026, 14:15:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడంతో భారతదేశం వంటగ్యాస్ సరఫరాపై ఆందోళన చెందుతోంది. మన దేశంలో ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు సరిపడా ఉన్నాయా లేదా అనే చర్చలు సామాన్యుల ఇళ్ల నుంచి బహిరంగ వేదికల వరకు సాగుతున్నాయి.

ఎల్పీజీ వర్సెస్​ పీఎన్జీ- తేడాలేంటి? (ANI)
ఎల్పీజీ వర్సెస్​ పీఎన్జీ- తేడాలేంటి? (ANI)

ఈ నేపథ్యంలో, ఈ వారంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్రకారం, పీఎన్జీ (పైప్​డ్​ నేచురల్​ గ్యాస్) కనెక్షన్ అందుబాటులో ఉన్న ప్రతి ఎల్పీజీ వినియోగదారుడు తప్పనిసరిగా పీఎన్జీకి మారాల్సి ఉంటుంది. పీఎన్జీ కనెక్షన్ ఉన్న ఏ వ్యక్తి కూడా కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ పొందకూడదు లేదా ప్రభుత్వ చమురు సంస్థల నుంచి ఎల్పీజీ సిలిండర్లను రీఫిల్ చేసుకోకూడదు.

ఒకవేళ మీరు పీఎన్జీకి మారాలని నోటీసు అందుకుంటే, ఆ మార్పు చేసుకోవడానికి మీకు 90 రోజుల సమయం ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత మీ ఎల్పీజీ కనెక్షన్ రద్దు అవుతుంది.

ఈ నేపథ్యంలో అసలు ఎల్పీజీకి, పీఎన్జీకి మధ్య తేడా ఏంటి? వంటి తరచూ అడిగే ప్రశ్నలకు ఇక్కడ డీటైల్​గా సమాధానం తెలుసుకోండి.

ఎల్పీజీ వర్సెస్​ పీఎన్జీ: తరచుగా అడిగే ప్రశ్నలు..

భారతీయులు ఎందుకు పీఎన్జీకి మారాలి? అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? అనే సందేహాలకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి:

ఎల్పీజీ అంటే ఏంటి?

ఎల్పీజీ లేదా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనేది భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే వంటగ్యాస్. ఇది ప్రధానంగా ప్రొపేన్, బ్యూటేన్ మిశ్రమం. దీనిని ద్రవ రూపంలో సిలిండర్లలో సరఫరా చేస్తారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి — డొమెస్టిక్ (14.2 కేజీలు), కమర్షియల్ (19 కేజీలు).

పీఎన్జీ అంటే ఏంటి?

పీఎన్జీ అంటే పైప్​డ్​ నేచురల్ గ్యాస్. ఇందులో ప్రధానంగా మీథేన్, తక్కువ శాతంలో ఇతర హైడ్రోకార్బన్లు ఉంటాయి. ఇది దేశంలోని అనేక ప్రాంతాల్లో పైప్‌లైన్ల ద్వారా నేరుగా ఇళ్లకు సరఫరా అవుతుంది. అయితే, ప్రస్తుతం భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పీఎన్జీ సౌకర్యం లేదు.

ఎల్పీజీ, పీఎన్జీ మధ్య తేడాలు ఏంటి?

ఎల్పీజీ ద్రవ రూపంలో సిలిండర్లలో సరఫరా అవుతుంది, పీఎన్జీ గ్యాస్ పైప్‌లైన్ ద్వారా అందుతుంది. వీటి తయారీ విధానంలో కూడా మార్పు ఉంటుంది. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో లేదా సహజ వాయువు ప్రాసెసింగ్‌లో ఎల్పీజీ తయారవుతుంది. పీఎన్జీ మాత్రం చమురు/గ్యాస్ బావుల నుంచి సేకరించి, పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా రవాణా అవుతుంది.

ప్రభుత్వం నోటిఫై చేసిన కొత్త నిబంధన ఏంటి?

మార్చి 24న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. పీఎన్జీ కనెక్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ దానిని ఎంచుకోని గృహాలకు "మూడు నెలల తర్వాత" ఎల్పీజీ సరఫరా నిలిపివేస్తారు. అయితే, పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వడానికి "సాంకేతికంగా సాధ్యం కాని" ప్రాంతాల్లో మాత్రం నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్​ఓసీ) ఆధారంగా ఎల్పీజీని కొనసాగించవచ్చు.

భారతీయులను ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారమని ప్రభుత్వం ఎందుకు అడుగుతోంది?

అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో తలెత్తిన సంక్షోభం, 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' మూతపడటం ప్రధాన కారణం. భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులో ఎక్కువ భాగం స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ మార్గం ద్వారానే వస్తుంది. యుద్ధం వల్ల ఈ సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో, ఎల్పీజీపై భారాన్ని తగ్గించి పీఎన్జీ వైపు మళ్లించడం ద్వారా వంటగ్యాస్ ఒత్తిడిని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

నేను పీఎన్జీకి మారకపోతే ఏమవుతుంది?

మీ ప్రాంతంలో పీఎన్జీ సౌకర్యం ఉండి కూడా మీరు మారకపోతే, నోటీసు అందిన 90 రోజుల తర్వాత మీకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుంది. ఒకవేళ మీ ప్రాంతంలో పీఎన్జీ కనెక్షన్ లేకపోతే, మీరు అధికారుల నుంచి ఎన్ఓసీ పొంది ఎల్పీజీని వాడుకోవచ్చు.

భారతదేశం వద్ద ఎంత ఎల్పీజీ నిల్వ ఉంది?

భారత్ వద్ద సుమారు 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, అలాగే ఒక నెల మొత్తానికి సరిపడా ఎల్పీజీ సరఫరాను ముందే ఏర్పాటు చేసినట్లు మార్చి 26న ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం, 8 లక్షల టన్నుల ఎల్పీజీ కార్గోలను ఇప్పటికే భద్రపరిచారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More