సుజుకీ ఇ-యాక్సెస్ వర్సెస్​ ఏథర్ రిజ్టా- ఏ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలి?

భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్​లోకి సుజుకీ ఇ-యాక్సెస్ అడుగుపెట్టింది. ఇప్పటికే మార్కెట్​లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్టాతో దీని పోటీ ఎలా ఉంటుంది? దేని రేంజ్​ ఎక్కువ? ధరల పరంగా ఏది లాభసాటి? పూర్తి వివరాలు మీకోసం..

Updated on: Jan 11, 2026, 05:36:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ రంగం ఇప్పుడు వివిధ మోడల్స్​తో కళకళలాడిపోతోంది. ఒకప్పుడు కేవలం స్టార్టప్‌ల ప్రయోగశాలగా ఉన్న ఈ విభాగం.. నేడు దిగ్గజ తయారీ సంస్థల రాకతో యుద్ధ క్షేత్రంగా మారింది. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీలు మొదట్లో గట్టి పునాది వేయగా.. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి మోడళ్లతో పాత తరం సంస్థలు తమ ఉనికిని చాటుకున్నాయి.

సుజుకీ ఇ-యాక్సెస్ వర్సెస్​ ఏథర్ రిజ్టా..
సుజుకీ ఇ-యాక్సెస్ వర్సెస్​ ఏథర్ రిజ్టా..

ఇప్పుడు మరో కొత్త అంకం మొదలైంది. సుజుకీ సంస్థ తన 'ఇ-యాక్సెస్' ఎలక్ట్రిక్​ స్కూటర్​ని ఇటీవలే లాంచ్ చేసింది. దీనితో వాహనదారులకు ఆప్షన్లు పెరిగాయి. మరి కొత్తగా వచ్చిన సుజుకీ ఇ-యాక్సెస్, ప్రస్తుతం ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్‌లో దుమ్మురేపుతున్న ఏథర్ రిజ్టాకు ఏ మేర పోటీ ఇవ్వనుంది? ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్లలో ఏది బెస్ట్​? ఓసారి చూద్దాము..

సుజుకీ ఇ-యాక్సెస్​ వర్సెస్​ ఏథర్​ రిజ్టా- ధరలు..

ధర విషయంలో సుజుకీ తన ఇ-యాక్సెస్‌ను కాస్త ప్రీమియం రేంజ్‌లో ఉంచింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.88 లక్షలుగా ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్​లో ఇది కాస్త ఖరీదైన ధరగానే కనిపిస్తోంది.

మరోవైపు, ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో వినియోగదారులకు మూడు వేర్వేరు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. దీని ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1.11 లక్షల నుంచి ప్రారంభమై రూ. 1.51 లక్షల వరకు ఉన్నాయి.

అంటే తమ బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా రిజ్టాలో నచ్చిన వేరియంట్‌ను ఎంచుకునే వెసులుబాటు కొనుగోలుదారులకు ఉంది.

సుజుకీ ఇ-యాక్సెస్​ వర్సెస్​ ఏథర్​ రిజ్టా- బ్యాటరీ, పర్ఫార్మెన్స్..

సుజుకీ ఇ-యాక్సెస్ విషయానికి వస్తే.. ఇందులో 3.07 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని అమర్చారు. దీని మోటార్ 5.49 బీహెచ్​పీ పవర్, 15 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గంటకు 71 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సుజుకీ సంస్థ పేర్కొంది. ఈ ఈ-స్కూటర్​ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి దాదాపు ఆరు గంటలకు పైగా సమయం పడుతుంది.

ఏథర్ రిజ్టా ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంది. ఇందులో 2.9 కేడబ్ల్యూహెచ్​, 3.7 కేడబ్ల్యూహెచ్​ సామర్థ్యం గల రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. మోడల్‌ను బట్టి ఇది 123 కి.మీ నుంచి గరిష్టంగా 160 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది. ఇక వేగం విషయానికొస్తే, ఇది గంటకు 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. నగర ప్రయాణాల్లో కొంచెం వేగంగా వెళ్లాలనుకునే వారికి రిజ్టా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

సుజుకీ ఇ-యాక్సెస్​ వర్సెస్​ ఏథర్​ రిజ్టా- ఏది కొనాలి?

సుజుకీ బ్రాండ్ పట్ల నమ్మకం ఉండి, సిటీలో తిరగడానికి సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వారికి ఇ-యాక్సెస్ సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, గణాంకాలను పరిశీలిస్తే మాత్రం ఏథర్ రిజ్టా స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తోంది. మెరుగైన రేంజ్, ఎక్కువ వేగం, తక్కువ ధరతో పాటు విభిన్న వేరియంట్లలో లభిస్తుండటం రిజ్టాకు పెద్ద ప్లస్ పాయింట్. అందుకే ఇండియాలో ఇది బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​గా కొనసాగుతోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధర, ఫీచర్ల పరంగా చూస్తే సుజుకీ కంటే ఏథర్ రిజ్టానే మెరుగైన ఎంపికగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More