Women reservation - Delimitation Bills : లోక్‌సభ ముందుకు 3 కీలక బిల్లులు - వాడివేడిగా ప్రత్యేక సమావేశాలు

కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 131 రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు ఇందులో ఉన్నాయి.

Published on: Apr 16, 2026, 13:07:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో పాటు కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు ఇందులో ఉన్నాయి.

లోక్ సభ ముందుకు 3 కీలక బిల్లులు
లోక్ సభ ముందుకు 3 కీలక బిల్లులు

మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పార్లమెంటులో వాడివేడి చర్చ జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే… కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ 2 బిల్లులను ప్రవేశపెట్టగా… మరో బిల్లును కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా వీటిని ప్రతిపాదించారు. అనంతరం వీటిని సభలో ప్రవేశపెట్టేందుకు చర్చ చేపట్టారు. ఈ బిల్లులను విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డివిజన్‌ ఓటింగ్‌కు పట్టుబట్టాయి. అందుకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతించారు.

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్ జరగగా… ఓటింగ్‌లో 333 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 207 ఓట్లు రాగా… బిల్లును ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మిగిలిన రెండు బిల్లులను ప్రభుత్వం…. లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

నారీ శక్తి వందన్ అధినియమ్ ను సవరణను ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా 2029 లోక్ సభ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడానికి సవరణ బిల్లును ఆమోదించడానికి ప్రభుత్వం ప్రతిపక్షాల మద్దతును కోరుతోంది.

2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళల రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా సవరణకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలను కోరారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పించే అంశానికి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ కీలకమైన బిల్లులపై లోక్‌సభలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రధాని మోదీ ఈ సాయంత్రం లోక్‌సభలో ప్రసంగిస్తారు.

ఇక ప్రస్తుతం దేశంలో 1971 జనాభా లెక్కల ప్రకారమే లోక్‌సభ స్థానాలు కొనసాగుతున్నాయి. గతంలో 2002లో పునర్విభజన జరిగినప్పటికీ, కేవలం నియోజకవర్గాల సరిహద్దులు మాత్రమే మారాయి తప్ప సీట్ల సంఖ్య పెరగలేదు. కానీ ఇప్పుడు 2011 జనాభా గణాంకాల ప్రకారం సీట్లను భారీగా పెంచబోతున్నారు. ఇందులో 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించనున్నారు.

ఇక మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే పునర్విభజన తప్పనిసరి అని కేంద్రం వాదిస్తోంది. అయితే ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగేలా ఈ ప్రక్రియ సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి విపక్షాల డిమాండ్ మేరకు కేంద్రం ఏవైనా మార్పులు చేస్తుందా లేదా అనేది పార్లమెంట్ సమావేశాల్లో తేలనుంది. ఈ కీలకమైన బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభిస్తే… దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More