Sukhoi 30 Crash : సుఖోయ్-30 యుద్ధ విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి- అసలేం జరిగింది?

Sukhoi 30 MKI crash in Assam : అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్​) చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఐఏఎఫ్​ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

Published on: Mar 06, 2026 11:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత వైమానిక రక్షణ రంగంలో విషాదం చోటుచేసుకుంది. అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో ఐఏఎఫ్​కి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం కుప్పకూలిందని అధికారులు శుక్రవారం ధృవీకరించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

సుఖోయ్​ 30 ఎంకేఐ క్రాష్​.. (PTI/File)
సుఖోయ్​ 30 ఎంకేఐ క్రాష్​.. (PTI/File)

గురువారం సాయంత్రం అసోంలోని జోర్హాట్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం కనిపించకుండా పోయింది. గాలింపు చర్యల అనంతరం ప్రమాద వివరాలు వెలుగులోకి వచ్చాయి.

సుకోయ్​-30 క్రాష్​ : ప్రమాదం జరిగిన తీరు..

జోర్హాట్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం ట్రైనింగ్ మిషన్‌లో భాగంగా బయలుదేరిన ఈ ఫైటర్ జెట్, రాత్రి 7:42 గంటల సమయంలో గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత రాడార్ నుంచి అదృశ్యమవడంతో వైమానిక దళం తక్షణమే గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లను ప్రారంభించింది.

సుకోయ్​-30 క్రాష్​ : ఇద్దరు పైలట్లు అమరత్వం..

ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురగ్‌కర్ మరణించినట్లు ఐఏఎఫ్ అధికారికంగా ప్రకటించింది. "ఐఏఎఫ్ సిబ్బంది అందరూ పైలట్ల మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాము," అని ఐఏఎఫ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

సుకోయ్​- 30 క్రాష్​ : స్థానికుల కథనం..

కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని స్థానికులు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు తెలిపారు. విమానం కిందకు పడిపోవడాన్ని చూసినట్లు ఒక ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.

"మేము ఒక్కసారిగా పెద్ద శబ్దాన్ని విన్నాము. ఆ తర్వాత భారీ పేలుడు సంభవించింది," అని స్థానికులు పేర్కొన్నారు.

స్థానికల సమాచారంతో ఐఏఎఫ్​ సిబ్బంది అర్థరాత్రి 1 గంట వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం విమానం కూలిన ఘటన కనిపించింది.

సుఖోయ్-30 ఎంకేఐ గురించి..

సుఖోయ్-30 MKI అనేది రష్యాకు చెందిన సుఖోయ్ కంపెనీ రూపొందించిన అత్యంత శక్తివంతమైన రెండు సీట్ల మల్టీరోల్ ఫైటర్ జెట్. భారత్‌లో దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్​ఏఐ) లైసెన్స్‌తో తయారు చేస్తోంది. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద 260కి పైగా సుఖోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయి.

వరుస విమాన ప్రమాదాలు..

గత కొన్ని వారాలుగా దేశంలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

గత నెలలో ఝార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఒక ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది.

జనవరిలో మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన లియర్‌జెట్ 45 విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు.

జూన్ 2024లో నాసిక్‌లో, జనవరి 2023లో గ్వాలియర్ ఎయిర్‌బేస్ వద్ద కూడా సుఖోయ్ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More