డివిడెండ్లు, బోనస్, స్టాక్ స్ప్లిట్స్.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు
కంపెనీలు ప్రకటించే డివిడెండ్లు, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్స్ వల్ల ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో ఎలాంటి మార్పులు వస్తాయో కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ వివరంగా విశ్లేషించారు. వీటి అంతర్లీన సూత్రాలు, ప్రకటనల వెనుకున్న అసలు కారణాలను అర్థం చేసుకోవడం ప్రతి ఇన్వెస్టర్‌కూ అవసరం.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ 'కార్పొరేట్ యాక్షన్స్' అనే పదాన్ని తరచూ వింటూనే ఉంటారు. కంపెనీ యాజమాన్యాలు తీసుకునే ఈ నిర్ణయాలు షేర్‌హోల్డర్లపై, వారి వద్ద ఉన్న షేర్ల సంఖ్యపై, అలాగే మార్కెట్లో ఆ స్టాక్ విలువపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. కార్పొరేట్ నిర్ణయం తర్వాత షేరు ధర తగ్గడం లేదా పెరగడం చూసి కొత్తగా లాభాలు వచ్చాయని లేదా నష్టపోయామని చాలామంది ఇన్వెస్టర్లు పొరపడుతుంటారు.

ఈ మార్పులను సరిగ్గా అర్థం చేసుకోవడానికి కార్పొరేట్ యాక్షన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. అందులో అత్యంత సాధారణమైన డివిడెండ్లు, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్స్ గురించి వివరంగా పరిశీలిద్దాం.
డివిడెండ్లు: లాభాల్లో వాటా పంపిణీ
కంపెనీ సంపాదించిన లాభాల నుంచి వాటాదారులకు పంచే మొత్తాన్ని డివిడెండ్ అంటారు. సాధారణంగా దీనిని ఒక్కో షేరుకు ఇన్ని రూపాయల చొప్పున లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో ఇచ్చేవాటిని 'ఇంటరిమ్ డివిడెండ్' (మధ్యంతర డివిడెండ్) అని, ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత ఇచ్చేదానిని 'ఫైనల్ డివిడెండ్' అని పిలుస్తారు.
డివిడెండ్ ఇవ్వడం అనేది కంపెనీకి నిబంధనేమీ కాదు. వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఆస్కారం ఉన్నప్పుడు, లాభాలను తిరిగి కంపెనీలోనే పెట్టుబడిగా పెట్టడానికి యాజమాన్యం మొగ్గుచూపుతుంది. స్థిరమైన నగదు ప్రవాహం (Cash Flows), మెరుగైన వ్యాపారం ఉన్న నిలకడైన కంపెనీలు మాత్రం తమ లాభాల్లో కొంత భాగాన్ని ఇన్వెస్టర్లకు పంచుతాయి.
డివిడెండ్లకు సంబంధించి కొన్ని కీలక తేదీలను గుర్తుంచుకోవాలి. 'రికార్డు డేట్' (Record Date) నాటికి డీమాట్ ఖాతాలో షేర్లు ఉన్నవారికే డివిడెండ్ అందుతుంది. 'ఎక్స్-డేట్' (Ex-Date) రోజు లేదా ఆ తర్వాత షేర్లు కొనుగోలు చేసేవారికి ఆ డివిడెండ్ లభించదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టీ+1 (T+1) సెటిల్మెంట్ విధానం ప్రకారం ఎక్స్-డేట్, రికార్డు డేట్ దాదాపు ఒకే రోజున ఉంటాయి.
బోనస్ షేర్లు: ఉచితంగా మరిన్ని షేర్లు
ప్రస్తుత వాటాదారుల నుంచి ఎలాంటి అదనపు డబ్బు తీసుకోకుండా కంపెనీ ఉచితంగా ఇచ్చే అదనపు షేర్లనే బోనస్ షేర్లు అంటారు. వీటిని 1:1 లేదా 2:1 వంటి నిర్ణీత నిష్పత్తిలో కేటాయిస్తారు.
ఉదాహరణకు, 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటిస్తే.. 100 షేర్లు ఉన్న ఇన్వెస్టర్‌కు మరో 100 షేర్లు అదనంగా వస్తాయి. దీనివల్ల షేర్ల సంఖ్య రెట్టింపు అవుతుంది, కానీ దానికి తగినట్లుగానే షేరు మార్కెట్ ధర తగ్గుతుంది. ఫలితంగా బోనస్ ఇచ్చిన వెంటనే ఇన్వెస్టర్ మొత్తం పెట్టుబడి విలువలో ఎలాంటి పెరగుదల ఉండదు.
షేర్‌హోల్డర్లను ప్రోత్సహించడానికి, మార్కెట్లో షేర్ల లభ్యతను పెంచడానికి, చిన్న ఇన్వెస్టర్లకు స్టాక్‌ను అందుబాటులోకి తేవడానికి కంపెనీలు బోనస్ ఇస్తుంటాయి. అదనపు షేర్లు రాగానే కొత్తగా సంపద పెరిగిపోయిందని భావించకూడదు.
స్టాక్ స్ప్లిట్స్: షేర్ల విభజన
ఒక షేరు ముఖ విలువను (Face Value) తగ్గించి, దానిని చిన్న చిన్న భాగాలుగా విభజించడాన్ని 'స్టాక్ స్ప్లిట్' అంటారు. ఉదాహరణకు, 1:2 స్ప్లిట్ లో రూ.10 ముఖ విలువ ఉన్న ఒక షేరు, రూ.5 ముఖ విలువ కలిగిన రెండు షేర్లుగా మారుతుంది.
దీనివల్ల షేర్ల సంఖ్య పెరిగి, మార్కెట్ ధర తగ్గుతుంది. అయితే ఇన్వెస్టర్ వద్ద ఉన్న మొత్తం పెట్టుబడి విలువ మారదు. కేవలం షేర్ల విభజన జరిగినంత మాత్రాన కంపెనీ ప్రాథమిక వ్యాపారం, ఆదాయం లేదా ఆర్థిక మూలాల్లో ఎలాంటి మార్పు ఉండదు.
బోనస్ షేర్లకు, స్టాక్ స్ప్లిట్‌కు ఉన్న ప్రధాన తేడా ముఖ విలువే. బోనస్ ఇచ్చినప్పుడు షేరు ముఖ విలువ మారదు. కానీ స్టాక్ స్ప్లిట్‌లో ముఖ విలువ తగ్గుతుంది. రెండింటిలోనూ షేర్ల సంఖ్య పెరిగి, ఒక్కో షేరు మార్కెట్ ధర తగ్గుతుంది.
కేవలం నిర్ణయాలనే చూడకండి
కార్పొరేట్ నిర్ణయాలు మార్కెట్ వర్గాల సెంటిమెంట్‌ను, ట్రేడింగ్ కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. అయితే స్ప్లిట్ లేదా బోనస్ వల్ల షేరు ధర తగ్గగానే, ఆ స్టాక్ చౌకగా లభిస్తోందని భావించడం సరికాదు.
అలాగే కేవలం ఎక్కువ డివిడెండ్ ఇస్తోందనే కారణంతో ఏ షేరునూ కొనకూడదు. నిర్ణయం తీసుకునేముందు కంపెనీ ఆదాయం, నగదు ప్రవాహం, అప్పులు, భవిష్యత్ అవకాశాలు, వ్యాల్యుయేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. అనౌన్స్‌మెంట్ డేట్, ఎక్స్-డేట్, రికార్డు డేట్‌లను గమనించాలి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (డెరివేటివ్స్) ట్రేడింగ్ చేసేవారు కార్పొరేట్ చర్యల వల్ల కాంట్రాక్టులలో జరిగే మార్పులను తప్పక తెలుసుకోవాలి.
డివిడెండ్లు నగదు రూపంలో ప్రయోజనం అందిస్తే, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్లు షేర్ల సంఖ్యను పెంచుతాయి. అయితే కంపెనీ సుదీర్ఘకాల భవిష్యత్తు, దాని ఆర్థిక బలం మాత్రమే నిజమైన పెట్టుబడి విలువను నిర్ణయిస్తాయి. కార్పొరేట్ చర్యలు షేర్ల నిర్మాణాన్ని మారుస్తాయి తప్ప, కంపెనీ ప్రాథమిక విలువను మార్చవని ఇన్వెస్టర్లు గ్రహించాలి.
వ్యాసకర్త:
శ్రీకాంత్ చౌహాన్,
హెడ్ – ఈక్విటీ రీసెర్చ్,
కోటక్ సెక్యూరిటీస్
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


