Credit cards : క్రెడిట్ కార్డు వరమా? లేక అప్పుల ఊబిలో కూరుకుపోయే శాపమా? ఇవి తెలుసుకోండి..

భారత్‌లో క్రెడిట్ కార్డు వాడకం వేగంగా పెరుగుతోంది. అయితే, సరైన ఆర్థిక స్పృహతో వాడితే ఇది గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది కానీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అప్పుల ఊబిలోకి నెట్టివేస్తుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డులను ఎలా సురక్షితంగా వాడాలో తెలుసుకోండి..

Published on: Jul 26, 2026, 08:16:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేటి ఆధునిక డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డులు మన దైనందిన ఆర్థిక జీవితంలో ఒక అత్యంత కీలకమైన భాగంగా మారిపోయాయి. రోజువారీ చెల్లింపుల నుంచి అత్యవసర ఖర్చుల వరకు ప్రయాణంలో సౌకర్యం, రివార్డులు, సులభంగా లభించే స్వల్పకాలిక రుణం వల్ల కొనుగోలుదారులు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్, ట్రావెల్ బుకింగ్స్, ఆకస్మిక వైద్య ఖర్చులకు చేతిలో నగదు లేకపోయినా క్రెడిట్ కార్డు కొండంత అండగా నిలుస్తోంది.

క్రెడిట్ కార్డు ఎలా ఉపయోగించాలి? ఇవి తెలుసుకోండి..
క్రెడిట్ కార్డు ఎలా ఉపయోగించాలి? ఇవి తెలుసుకోండి..

అయితే, ఈ క్రెడిట్ కార్డు మీ ఆర్థిక పురోగతికి నిజమైన మిత్రుడిగా మారుతుందా? లేక అప్పుల ఊబిలోకి నెట్టేసే పెద్ద భారంగా పరిణమిస్తుందా? అనేది పూర్తిగా మీరు దానిని ఎంత బాధ్యతాయుతంగా వాడుతున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే, క్రెడిట్ కార్డును ఉపయోగించడం ప్రారంభించే ముందే దాని గురించి సరైన అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.

మీ ప్రవర్తనే ఫలితాన్ని నిర్దేశిస్తుంది!

క్రెడిట్ కార్డులను ప్రమాదకరమైనవిగా లేదా వాడటం చాలా కష్టమైన సాధనాలుగా ముద్ర వేయడం సరైన పద్ధతి కాదు! ఎందుకంటే, కార్డు ఉపయోగించే వ్యక్తి ప్రవర్తన, చెల్లింపుల అలవాట్లే దాని ఫలితాన్ని నిర్ణయిస్తాయి.

ఈ విషయంపై Rupyaapaisa.com వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ పాండే స్పందించారు.

“సమస్య అంతా కార్డులో లేదు, మనం పాటించే జవాబుదారీతనం లేని ఆర్థిక ప్రవర్తనలోనే ఉద్భవిస్తుంది. భారత్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం 2026 మే నాటికి ఏకంగా రూ. 2 లక్షల కోట్లను దాటిపోయింది. అంటే, మన రోజువారీ ఖర్చు అలవాట్లలో ఈ ప్లాస్టిక్ కార్డు ఎంతగా కలిసిపోయిందో ఇది స్పష్టం చేస్తోంది. ఆలోచన లేకుండా చేసే కొనుగోళ్లు, బిల్‌ చెల్లింపుల్లో బద్ధకం, కార్డు ద్వారా ఏటీఎం నుంచి నగదు డ్రా చేయడం, బకాయిలు పేరుకుపోనివ్వడం వంటివి ఒకరి జీవితాన్ని సులభంగా నాశనం చేస్తాయి. క్రెడిట్ కార్డు అనేది కేవలం చెల్లింపులు చేయడానికి ఉపయోగపడే ఒక సాధనమే తప్ప, డబ్బులు అప్పుగా తీసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేసేది కాదని గుర్తించాలి. ఒకవేళ బిల్లులను నిర్ణీత సమయంలోగా చెల్లిస్తే, క్రెడిట్ కార్డు అద్భుతమైన రివార్డులను, ప్రయోజనాలను అందిస్తుంది,” అని ముకేశ్ పాండే పేర్కొన్నారు.

అంటే, క్రెడిట్ కార్డు బిల్లులను ఆలస్యం చేయకుండా సరైన సమయానికి చెల్లించినప్పుడు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. చెల్లింపులు వాయిదా వేయడం, మిగిలిన బకాయిలపై వడ్డీ పడనివ్వడం, కార్డు ద్వారా తరచూ నగదు డ్రా చేయడం వంటి అలవాట్లు అత్యధిక వడ్డీతో కూడిన అప్పుల్లోకి నెట్టివేస్తాయి. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాలి.

Credit Cards: Benefits vs Risks

Benefits

Potential Risks

ఖర్చులుక్యాష్​లెస్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చుఅనవసరమైన కొనుగోళ్లు
ఫైనాన్షియల్ మేనేజ్​మెంట్ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ (సరైన సమయానికి బిల్లు చెల్లిస్తే)టైమ్​కి బిల్లు కట్టకపోతే భారీ వడ్డీలు
రివార్డులుక్యాష్​బ్యాక్, రివార్డ్​ పాయింట్లు, ట్రావెల్ బెనిఫిట్స్రివార్డులు ఉన్నాయి కదా అని ఎక్కువ ఖర్చు చేసేయడం
క్రెడిట్ స్కోరుసరిగ్గా వాడితే బలమైన క్రెడిట్​ స్కోరు ఉంటుందిటైమ్​కి బిల్లు కట్టకపోతే క్రెడిట్​ స్కోరు పడిపోతుంది
యాక్సెసబులిటీఎమర్జెన్సీలో ఆర్థిక సాయం లభిస్తుందిఅప్పులు పెరిగిపోతాయి

బాధ్యతాయుతమైన క్రెడిట్ విస్తరణ..

దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగంపై ఆందోళనలు ఉన్నప్పటికీ, వాటిని వాడే విధానంపై చాలామందిలో సరైన అవగాహన లేకపోవడమే అసలు కారణమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో మన దేశీయ క్రెడిట్ మార్కెట్‌లో ఇంకా ఎంతో ప్రగతి సాధించే అవకాశాలు ఉన్నాయి.

“ప్రస్తుతం భారతదేశంలో 12 కోట్లకు పైగా యాక్టివ్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అయినప్పటికీ, మన సామర్థ్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దేశంలో ప్రస్తుతమున్న పరిమాణం కంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువ కార్డుల అవసరం ఉంది. అయితే, ఈ వృద్ధి సెక్యూర్డ్ లేదా ఎఫ్‌డీ ఆధారిత క్రెడిట్ కార్డుల రూపంలో రావాలి. ఇప్పటికే కార్డులు ఉన్న సంపన్న వర్గాలకే మళ్లీ మళ్లీ కొత్త కార్డులు ఇవ్వడం కంటే, కొత్తవారికి- క్రెడిట్ సదుపాయం లేని సామాన్య వినియోగదారులకు సురక్షితమైన మార్గంలో కార్డులను అందించడంపై దృష్టి పెట్టాలి,” అని రోహిత్ మహాజన్ సూచించారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రాతిపదికన ఇచ్చే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు, తొలిసారి కార్డు వాడే వారికి, తక్కువ క్రెడిట్ హిస్టరీ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆర్థిక ముప్పును పరిమితం చేస్తూనే, మంచి క్రెడిట్ స్కోర్) నిర్మించుకోవడానికి సహాయపడతాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే.. క్రెడిట్ కార్డు అనేది మొత్తానికే మంచిది కాదు, అలా అని చెడ్డదీ కాదు. అది కేవలం ఒక ఆర్థిక సాధనం మాత్రమే. దాని ప్రభావం పూర్తిగా వినియోగదారుడి క్రమశిక్షణపైనే ఆధారపడి ఉంటుంది. పరిమితంగా ఖర్చు చేయడం, సమయానికి బిల్లులు చెల్లించడం, ప్రణాళికాబద్ధమైన అప్పులు చేయడం ద్వారా రివార్డులను పొందడమే కాకుండా, మెరుగైన క్రెడిట్ స్కోర్‌ను సాధించవచ్చు. దేశంలో క్రెడిట్ కార్డు మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, ఈ కార్డులు మీకు అప్పుల భారాన్ని పెంచకుండా సహాయకారిగా నిలవాలంటే 'ఆర్థిక అవగాహన' ఒక్కటే ఏకైక మార్గం!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More