...
...
Next Story

Crude oil price : సామాన్యుడికి ఊరట- భారీగా పతనమైన ముడి చమురు ధర.. అమెరికా-ఇరాన్ ఒప్పందమే కారణం!

అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 15, 2026, 05:58:36 IST
Advertisement

అమెరికా- ఇరాన్ యుద్ధంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడం వల్ల అష్టకష్టాలు పడుతున్న ప్రపంచ దేశాల ప్రజలకు భారీ రిలీఫ్! ఇరాన్​తో శాంతి ఒప్పందం కుదిరిందని, ఫలితంగా చమురు సరఫరాకు జీవనాధారమైన హర్ముజ్ జలసంధి ఓపెన్ అయ్యిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంతకాలంగా భారీగా పెరిగిపోయిన చమురు ధరలు ఇప్పుడు పతనమయ్యాయి.

ముడి చమురు ధరలు..
ముడి చమురు ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర 3.9 శాతం క్షీణించి బ్యారెల్‌కు 84 డాలర్లకు చేరుకోగా, యూఎస్ క్రూడ్ ధర 4.8 శాతం పతనమై 81 డాలర్ల వద్దకు పడిపోయింది.

అమెరికా- ఇరాన్ మధ్య ఫిబ్రవరి చివరి నుంచి జరుగుతున్న యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి మూతపడటం, ఫలితంగా చమురు ధర ఒకానొక దశలో బ్యారెల్​కి 120 డాలర్ల ఎగువకు చేరడం తెలిసిన విషయమే.

ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో అత్యధిక భాగం ఈ హార్ముజ్ జలసంధి గుండానే వెళుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ సముద్ర మార్గం దాదాపు మూతపడింది. ఈ ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించడానికి సగటున 20 లక్షల డాలర్ల (సుమారు రూ. 16.5 కోట్లు) వరకు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చేదని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు ఒకరు గతంలో వెల్లడించారు.

ధరలు ఎందుకు తగ్గాయి? నిపుణులు ఏమంటున్నారు?

ఒకవేళ ఈ జలసంధిలో గనుక ఇలాగే ఆటంకాలు కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 150 నుంచి 180 డాలర్ల వరకు పెరిగే ప్రమాదం ఉందని, అదే జరిగితే అమెరికాలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటాయని ఆర్థిక విపుణులు అంతకుముందు హెచ్చరించారు.

డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' ద్వారా ఈ చారిత్రాత్మక పురోగతిని ప్రపంచానికి తెలియజేశారు. టెహ్రాన్ (ఇరాన్)తో ఒప్పందం ఖరారైందని, సముద్ర రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

"ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం ఇప్పుడు పూర్తిగా విజయవంతమైంది. అందరికీ నా అభినందనలు! హార్ముజ్ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా ఉచితంగా తెరవడానికి నేను పూర్తి అధికారం ఇస్తున్నాను. అలాగే ఇరాన్‌పై విధించిన అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే రద్దు చేస్తున్నాను. ప్రపంచ దేశాల ఓడలారా.. మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి. చమురు ప్రవాహాన్ని రానివ్వండి!" అని డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు.

ట్రంప్ తన 80వ పుట్టినరోజును పురస్కరించుకుని వైట్‌హౌస్‌లో నిర్వహించిన యూఎఫ్‌సీ ఈవెంట్‌కు కొన్ని గంటల ముందే ఈ సంచలన ప్రకటన రావడం విశేషం.

యుద్ధం కారణంగా ఇండియాలో పెరిగిన ధరలు..

80శాతం ఇంధన అవసరాలు దిగుమతితోనే పూర్తి చేసుకునే ఇండియా అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా సామాన్యుడికి అత్యంత కీలకమైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలకు రెక్కలు వచ్చాయి. మే నెలలో 5 రాష్ట్రల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి వీటి ధరలు పెరుగుతూనే వచ్చాయి.

ఇక ఇప్పుడు అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం భారీ ఊరటనిచ్చే విషయం. మరి పెరిగిన ధరలు ఎప్పుడు దిగొస్తాయో వేచి చూడాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe