Cult Fit IPO : మార్కెట్లోకి వస్తున్న ప్రముఖ ఫిట్​నెస్​ బ్రాండ్- కల్ట్​ ఫిట్​ ఐపీఓపై బిగ్​ అప్డేట్..

Cult Fit IPO news : భారతదేశ ఫిట్‌నెస్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రముఖ వెల్‌నెస్ బ్రాండ్ కల్ట్ ఫిట్ త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. రూ. 950కోట్ల విలువైన కొత్త షేర్లతో పాటు భారీ ఆఫర్ ఫర్ సేల్​తో కలిపి మొత్తం రూ. 4,000 కోట్ల ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. పూర్తి వివరాలు..

Published on: Jul 7, 2026, 10:28:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ వ్యాపార రంగంలో సరికొత్త స్టార్టప్‌లు, డిజిటల్ బ్రాండ్లు ఐపీఓ బాట పడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద ఫిట్‌నెస్ సెంటర్ల నెట్‌వర్క్ కలిగిన 'కల్ట్ ఫిట్ లిమిటెడ్' (Cult.Fit Ltd) తన పబ్లిక్ ఇష్యూ కోసం కసరత్తు ముమ్మరం చేసింది. మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' వద్ద తాజాగా కంపెనీ ప్రాథమిక పత్రాలను (డీఆర్​హెచ్​పీ) దాఖలు చేసింది. ఈ ఐపీఓ ద్వారా మార్కెట్ నుంచి రూ. 4,000 కోట్ల వరకు నిధులను సేకరించాలని కంపెనీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో రూ. 950 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయనుండగా, మిగిలిన మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) రూపంలో విక్రయించనున్నారు.

కల్ట్ ఫిట్​ ఐపీఓ అప్డేట్స్..
కల్ట్ ఫిట్​ ఐపీఓ అప్డేట్స్..

సగం వాటా అమ్ముకుంటున్న సెలబ్రిటీలు, ఇన్వెస్టర్లు!

ఈ కల్ట్​ ఫిట్ ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ కింద దాదాపు 178.6 మిలియన్ల షేర్లను విక్రయించడానికి కంపెనీలోని అగ్రశ్రేణి పెట్టుబడిదారులు సిద్ధమయ్యారు. టెమాసెక్, చిరాతే వెంచర్స్, టాటా డిజిటల్, యాక్సెల్ ఇండియా, కలారి క్యాపిటల్, ష్రోడర్స్ క్యాపిటల్ వంటి దిగ్గజ సంస్థలు తమ వాటాలను పాక్షికంగా వదులుకోనున్నాయి.

వీరితో పాటు ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ సంస్థ అయిన డోలి ట్రేడింగ్, సన్ అండ్ శాండ్ హోటల్స్, ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు చెందిన హెచ్‌ఆర్‌ఎక్స్ ఇన్వెస్ట్‌మెంట్ విభాగానికి చెందిన 'ఎక్స్‌ట్రీమ్ బ్రాండ్స్' కూడా తమ షేర్లను విక్రయించనున్నాయి.

వ్యక్తిగత వాటాదారుల విషయానికి వస్తే కంపెనీ వ్యవస్థాపకుడు ముకేశ్ బన్సల్, ఏంజెల్ ఇన్వెస్టర్ బ్రూనో రాస్చ్లే, నటుడు హృతిక్ రోషన్ తమ వాటాలను విక్రయిస్తున్నారు. అయితే 2021లో కల్ట్ ఫిట్‌లో 6.4 శాతం వాటాను కొనుగోలు చేసిన ఎటర్నల్ లిమిటెడ్ మాత్రం తన షేర్లను విక్రయించడం లేదు.

కల్ట్​ ఫిట్ ఐపీఓ నిధులు ఎందుకోసం?

పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించే నిధులను కల్ట్​ ఫిట్ కంపెనీ విస్తరణకు ఉపయోగించనున్నారు. దేశవ్యాప్తంగా కొత్త ఫిట్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయడం, ప్రస్తుత సెంటర్ల లీజు ఒప్పందాలను బలోపేతం చేయడం, సంస్థకున్న అప్పులను తీర్చడంతో పాటు బ్రాండ్ మార్కెటింగ్, సబ్సిడరీ కంపెనీలలో పెట్టుబడుల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు కల్ట్ ఫిట్ తన డ్రాఫ్ట్ పత్రాలలో పేర్కొంది. ఐపీఓ కంటే ముందే రూ. 190 కోట్ల వరకు ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ జరిపే ఆలోచనలో కూడా యాజమాన్యం ఉంది.

యాక్సిస్ క్యాపిటల్, గోల్డ్‌మన్ శాక్స్, జెఫెరీస్ ఇండియా, జేఎమ్ ఫైనాన్షియల్. మోర్గాన్ స్టాన్లీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ షేర్ల విక్రయ ప్రక్రియను లీడ్ మేనేజర్లుగా పర్యవేక్షిస్తున్నాయి.

నష్టాలు తగ్గుతున్నాయి.. ఆదాయం పెరుగుతోంది!

మింత్రా సహ వ్యవస్థాపకుడు ముకేశ్ బన్సల్, అంకిత్ నాగోరి కలిసి 2016 లో ప్రారంభించిన కల్ట్ ఫిట్ సంస్థకు ప్రస్తుతం భారతదేశంలోని 77 నగరాల్లో 708 ఫిట్‌నెస్ సెంటర్లు ఉన్నాయి. 2021 చివరి నాటికి ఈ కంపెనీ విలువ దాదాపు 1.5 బిలియన్ డాలర్లకు చేరింది.

ఇక ఈ ఏడాది మార్చిలో కూడా టెమాసెక్ సంస్థ నుంచి కల్ట్ ఫిట్ రూ. 440 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.

ఫైనాన్షియల్స్ చూస్తే ఆర్థిక సంవత్సరం 2026 లో కల్ట్ ఫిట్ కార్యకలాపాల ద్వారా రూ. 1,721 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇది అంతకుముందు ఏడాది నమోదైన రూ. 1,216 కోట్లతో పోలిస్తే 40 శాతం వృద్ధిని సూచిస్తోంది. కంపెనీ ఇప్పటికీ లాభాల్లోకి రానప్పటికీ, దాని నష్టాల తీవ్రత భారీగా తగ్గింది. ఆర్థిక సంవత్సరం 2024 లో రూ. 888 కోట్ల నష్టాల్లో ఉన్న ఈ సంస్థ, 2025 లో రూ. 481 కోట్లకు, 2026 నాటికి రూ. 252 కోట్ల నష్టానికి తగ్గించుకోవడం గమనార్హం. కంపెనీకి వచ్చే ఆదాయంలో 70 శాతం జిమ్ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా, మిగిలిన 30 శాతం ఫిట్‌నెస్ ఉత్పత్తుల విక్రయాల ద్వారా లభిస్తోంది.

మార్కెట్లో సరికొత్త ట్రెండ్!

ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లలో కల్ట్ ఫిట్ తరహా వ్యాపార నమూనా కలిగిన కంపెనీలు ఏవీ లిస్ట్ కాలేదు. కాబట్టి కమర్షియల్ వెల్‌నెస్ రంగంలో వస్తున్న ఈ సరికొత్త ఐపీఓపై ఇన్వెస్టర్లలో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో 2010లో 'తల్వాల్కర్స్' గ్రూప్ దేశంలోనే మొదటి ఫిట్‌నెస్ చైన్‌గా మార్కెట్లో లిస్ట్ అయినప్పటికీ, అప్పుల భారం, అంతర్గత ఆడిట్ సమస్యల కారణంగా ఆ సంస్థ దివాలా తీసింది.

ప్రస్తుతం కల్ట్ ఫిట్ ఆధునిక సాంకేతికత, డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ల ఆధారంగా నడుస్తుండటంతో ఈ సరికొత్త ఐపీఓ మార్కెట్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ఇక ఈ కల్ట్​ ఫిట్​ ఐపీఓకి సంబంధించిన ప్రైజ్ బ్యాండ్, లాంచ్​ డేట్, లిస్టింగ్​ డేట్​ వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More