...
...
Next Story

బ్యాంకు ఖాతా లేకపోయినా నగదు బదిలీ! ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే..

బ్యాంకు ఖాతా లేని సామాన్యులు సైతం సులభంగా డబ్బు పంపేందుకు, తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 'డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ డైరెక్షన్స్ 2026' పేరుతో జారీ చేసిన ఈ మార్గదర్శకాల్లో నగదు బదిలీ పరిమితులు, కేవైసీ నిబంధనలను స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి..

Published on: Nov 12, 2026, 12:21:07 IST
Advertisement

బ్యాంకు ఖాతా లేని సామాన్యులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీ ఊరట కల్పించింది! అకౌంట్ లేకపోయినా ఇతరుల ఖాతాల్లోకి డబ్బు పంపేందుకు, తమకు వచ్చిన నగదును తీసుకునేందుకు వీలుగా 'డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ (డీఎంటీ) డైరెక్షన్స్ 2026' పేరుతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

నగదలు బదిలీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్.. (REUTERS/Francis Mascarenhas)
నగదలు బదిలీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్.. (REUTERS/Francis Mascarenhas)

ఉపాధి కోసం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలకు వలస వచ్చే కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాలు లేని కుటుంబాలకు ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్​ఆర్బీలు), పట్టణ, రాష్ట్ర, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులతో పాటు అధీకృత పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. పాత 2024-25 సమీక్షా నిబంధనలు, 2011 సడలింపు మార్గదర్శకాల స్థానంలో ఆర్బీఐ ఈ కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది.

ఖాతా లేకపోయినా నగదు తీసుకోవచ్చు (క్యాష్ పే-ఔట్ సర్వీసు)

బ్యాంక్ ఖాతా లేని వ్యక్తులు కూడా ఇతరుల నుంచి డబ్బు అందుకునే వెసులుబాటును 'క్యాష్ పే-ఔట్' సేవ కల్పిస్తుంది. ఖాతాదారులు తమ బ్యాంక్ అకౌంట్ల నుంచి ఖాతా లేని వ్యక్తులకు నేరుగా నగదు బదిలీ చేసేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇలా పంపిన డబ్బును గ్రహీతలు ఏటీఎంలు, బిజినెస్ కరస్పాండెంట్లు లేదా ఇతర అధీకృత పేమెంట్ కేంద్రాల ద్వారా నగదు రూపంలో తీసుకోవచ్చు.

ఈ విధానంలో డబ్బు అందుకునే లబ్ధిదారుని పేరు, చిరునామా వివరాలను బ్యాంకులు తప్పనిసరిగా నమోదు చేయాలి. క్యాష్ పే-ఔట్ సేవ ద్వారా ఒక లావాదేవీలో గరిష్ఠంగా రూ. 10,000 వరకు పంపవచ్చు. ఒక లబ్ధిదారునికి నెలకు గరిష్ఠంగా రూ. 25,000 వరకు మాత్రమే ఈ పద్ధతిలో నగదు అందించే వీలుంటుంది.

నగదు జమ చేసే సదుపాయం (క్యాప్ పే-ఇన్ సర్వీస్)

బ్యాంకు శాఖలకే కాకుండా బిజినెస్ కరస్పాండెంట్లు, ఏటీఎంలు, ఇతర అధీకృత కేంద్రాల ద్వారా కూడా నగదు బదిలీ చేసే సదుపాయాన్ని బ్యాంకులు కల్పించవచ్చు. అయితే ఈ కేంద్రాల్లో ఒక్కో లావాదేవీకి రూ. 5,000 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక వ్యక్తి నెలకు గరిష్ఠంగా రూ. 25,000 వరకు మాత్రమే ఈ మార్గంలో ఇతరులకు పంపగలరు.

ఈ సేవలను ఎలా వినియోగించుకోవాలి? నిబంధనలేంటి?

క్యాష్ పే-ఇన్ సేవను ఉపయోగించుకోవాలనుకునే వారు ఆర్బీఐ కేవైసీ 2025 నిబంధనల ప్రకారం ముందుగా బ్యాంకు లేదా బిజినెస్ కరస్పాండెంట్ వద్ద నమోదు చేసుకోవాలి. ఇందుకోసం ధ్రువీకరించిన మొబైల్ నంబర్‌తో పాటు స్వయంగా ధ్రువీకరించిన అధికారిక గుర్తింపు పత్రాన్ని (ఓవీడీ) సమర్పించాలి. ప్రతి లావాదేవీకి అదనపు భద్రతా ధ్రువీకరణ (ఏఎఫ్ఏ) తప్పనిసరి.

నగదు డిపాజిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను నిబంధనలను బ్యాంకులు, బీసీలు కచ్చితంగా పాటించాలని ఆర్బీఐ ఆదేశించింది. అంతేకాదు, ఐఎంపీఎస్ లేదా నెఫ్ట్ లావాదేవీ సందేశంలో డబ్బు పంపిన వారి వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. దీనిని నగదు ఆధారిత బదిలీగా గుర్తించాలని ఆర్బీఐ తన తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks