EPFO : ఈపీఎఫ్‌ఓ కొత్త విత్‌డ్రా నిబంధనలు.. ఎంత డబ్బు తీసుకోవచ్చో తెలుసా? పూర్తి వివరాలు ఇవే..

భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాదారుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​ఓ) అడ్వాన్స్ నగదు ఉపసంహరణ నిబంధనలను సవరించింది. 12 నెలల సర్వీస్ పూర్తయిన చందాదారులు తమ ఖాతాలోని నిధుల నుంచి ఎంత శాతం సొమ్ము పొందవచ్చో తెలియజేస్తూ ఈపీఎఫ్‌ఓ విడుదల చేసిన పూర్తి మార్గదర్శకాలు ఇక్కడ చూడండి..

Published on: Oct 17, 2026, 14:01:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు అత్యవసర ఆర్థిక అవసరాలు ఎదురైనప్పుడు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవడంపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​ఓ) సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. చందాదారులు తమ పీఎఫ్ అడ్వాన్స్ నిధుల ఉపసంహరణపై సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక స్మార్ట్ గైడ్‌ను ఈపీఎఫ్‌ఓ పంచుకుంది.

ఈపీఎఫ్‌ఓ కొత్త విత్‌డ్రా నిబంధనలు.. (AI generated image for representational purposes only)
ఈపీఎఫ్‌ఓ కొత్త విత్‌డ్రా నిబంధనలు.. (AI generated image for representational purposes only)

12 నెలల సర్వీస్ ఉంటే చాలు.. 75 శాతం నగదు ఉపసంహరణ!

కొత్త నిబంధనల ప్రకారం, పీఎఫ్ సభ్యత్వం పొంది కనీసం 12 నెలలు (ఒక సంవత్సరం) పూర్తయిన ఉద్యోగులు తమ ఖాతా నుంచి అడ్వాన్స్ రూపంలో నిధులను పొందేందుకు అర్హత సాధిస్తారు. ఖాతాలో జమ అయిన మొత్తం బ్యాలెన్స్ (ఉద్యోగి వాటా + యాజమాన్యం వాటా + వడ్డీ)లో గరిష్టంగా 75 శాతం వరకు అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకోవడానికి ఈపీఎఫ్‌ఓ అనుమతినిచ్చింది.

3 కేటగిరీలుగా విత్‌డ్రా నిబంధనలు..

గతంలో పీఎఫ్ అడ్వాన్స్ పొందడానికి ఉన్న 13 రకాల నిబంధనలను కుదించి గతేడాది అక్టోబర్‌లో ఈపీఎఫ్‌ఓ వాటిని కేవలం 3 ప్రధాన విభాగాలుగా సరళీకరించింది:

అత్యవసర అవసరాలు : వైద్య అత్యవసరాలు, వివాహం, విద్య మొదలైనవి.

ఇంటి అవసరాలు : ఇల్లు లేదా స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణం, రిపేర్లు.

ప్రత్యేక పరిస్థితులు : ఉద్యోగం కోల్పోవడం, కంపెనీ మూసివేత వంటి సమయాలు.

ఉద్యోగం కోల్పోయిన సమయంలో, ఉద్యోగి తక్షణమే 75 శాతం వరకు పీఎఫ్ నిధులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ సదరు వ్యక్తి వరుసగా రెండు నెలల (60 రోజులు) పాటు నిరుద్యోగిగానే కొనసాగితే, మిగిలిన 25 శాతం బ్యాలెన్స్‌ను కూడా పొందే అవకాశం ఉంటుంది. సర్వీస్‌లో ఉన్నప్పుడు నాన్-రీఫండబుల్ అడ్వాన్స్ పొందేందుకు ‘ఫారమ్ 31’ సమర్పించాల్సి ఉంటుంది.

ప్రీ-మెచ్యూర్ విత్‌డ్రా, పెన్షన్ నిబంధనల్లో మార్పులు..

పూర్తిస్థాయి పీఎఫ్ సెటిల్‌మెంట్ లేదా ముందస్తు ఉపసంహరణ ప్రక్రియకు సంబంధించి కాలపరిమితిని ఈపీఎఫ్‌ఓ పొడిగించింది. ముందస్తు ఫైనల్ సెటిల్‌మెంట్ గడువును 2 నెలల నుంచి 12 నెలలకు, పెన్షన్ ఫండ్ ఫైనల్ విత్‌డ్రా గడువును 2 నెలల నుంచి 36 నెలలకు పెంచింది.

ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత లేదా రిటైర్మెంట్ అనంతరం 100 శాతం పీఎఫ్ సొమ్మును ఉపసంహరించుకోవడానికి 'ఫారమ్ 19' దాఖలు చేయాలి. అయితే కనీసం 60 రోజుల పాటు నిరుద్యోగిగా ఉంటేనే మొత్తం సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు అర్హత లభిస్తుంది.

పెన్షన్ సదుపాయం విషయానికి వస్తే, మీ మొత్తం సర్వీస్ కాలం 10 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే ‘ఫారమ్ 10సీ’ ద్వారా పెన్షన్ సొమ్మును ఒకేసారి పొందే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ మీ సర్వీస్ 10 ఏళ్లు దాటితే, ఆ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా ‘స్కీమ్ సర్టిఫికేట్’ పొంది, 58 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ప్రతి నెలా పింఛను రూపంలో పొందాల్సి ఉంటుంది.

క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయం ఎంత పడుతుంది?

ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం క్లెయిమ్ దరఖాస్తు చేసిన తర్వాత నిధులు జమ కావడానికి పట్టే సమయం:

ఆటో-మోడ్ క్లెయిమ్‌లు: క్లెయిమ్ దరఖాస్తు సమర్పించిన 72 గంటల్లోనే పూర్తవుతాయి.

ఆన్‌లైన్ క్లెయిమ్‌లు: పూర్తి కేవైసీ వివరాలు అప్డేట్ చేసిన ఖాతాదారులకు 3 నుంచి 7 పనిదినాల సమయం పడుతుంది.

ఆఫ్‌లైన్ క్లెయిమ్‌లు: పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో సమర్పించే భౌతిక దరఖాస్తులకు గరిష్టంగా 20 పనిదినాలు పడుతుంది.

ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 7 నుంచి 15 పనిదినాల్లో సొమ్ము నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. క్లెయిమ్ ఆమోదం, నిధుల విడుదల ప్రతి దశలోనూ సదరు ఉద్యోగి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్ రూపంలో సమాచారం అందుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More