...
...
Next Story

DA hike news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు.. ఈసారి ఎంత ఉంటుంది? ప్రకటన ఎప్పుడు?

జనవరి 2026 నుంచి పెరగాల్సిన డియర్నెస్ అలవెన్స్ (డీఏ) కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ నెల వచ్చినా ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, త్వరలోనే 3% నుంచి 4% వరకు పెంపు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published on: Apr 4, 2026, 09:10:52 IST
Advertisement

జనవరి 2026 డీఏ (డియర్​నెస్​ అలొవెన్స్​), డీఆర్​ (డియర్​నెస్​ రిలీఫ్​) పెంపు వార్తల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్​ నెల మొదలైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగంలో ఉత్కంఠ పెరిగిపోయింది. డీఏ పెంపు అనేది నెలవారీ జీతాలు, పింఛనులపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది కాబట్టి, ఇది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఈసారి డీఏ, డీఆర్​ పెంపు ఎంత ఉండే అవకాశం ఉంది? డీఏ పెంపు వార్త ఎప్పుడు వెలువడుతుంది? వంటి వివరాలపై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు- ప్రకటన ఆలస్యమైందా?

ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి డీఏ పెంపు ఎంత ఉంటుంది?
ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి డీఏ పెంపు ఎంత ఉంటుంది?

సాధారణంగా మార్చి నెలలోనే డీఏ పెంపుపై స్పష్టత వస్తుంటుంది. కానీ ఈసారి ఏప్రిల్ వచ్చినా ప్రకటన రాకపోవడంపై 'కర్మ మేనేజ్‌మెంట్ గ్లోబల్ కన్సల్టింగ్ సొల్యూషన్స్' ఎండీ ప్రతీక్ వైద్యా స్పందించారు.

"డిసెంబర్ వరకు ఉన్న ద్రవ్యోల్బణ గణాంకాలను విశ్లేషించి, ఫైనాన్షియల్ వెట్టింగ్, క్యాబినెట్ ఆమోదం పొందేందుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇది పెద్ద ఆలస్యమేమీ కాదు, కేవలం ప్రక్రియలో భాగమే," అని ఆయన వివరించారు. దేశ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాలను దశలవారీగా వెల్లడించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు- ఈసారి ఎంత శాతం ఉండొచ్చు?

గత ఏడాది కాలంగా ఉన్న ద్రవ్యోల్బణ ధోరణులను, ముఖ్యంగా ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) గణాంకాలను పరిశీలిస్తే, ఈసారి డీఏ పెంపు 3% నుంచి 4% మధ్యలో ఉండే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం డీఏ 50% మార్కును తాకిన నేపథ్యంలో, తాజా పెంపుతో ఇది 53శాతం లేదా 54శాతానికి చేరుకోవచ్చని అంచనా.

ఈ పెంపు కేవలం సర్వీసులో ఉన్న ఉద్యోగులకే కాకుండా, పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. దీనిని వారికి 'డియర్నెస్ రిలీఫ్' (డీఆర్) రూపంలో చెల్లిస్తారు. పెన్షనర్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది కాబట్టి, ఈ 3-4% పెరుగుదల కూడా వారి నెలవారీ ఖర్చులకు ఎంతో వెసులుబాటును కల్పిస్తుందని వైద్యా పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి అధికారిక తేదీ ఖరారు కానప్పటికీ, అనుమతుల ప్రక్రియ ముగియగానే ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పెరిగిన జీవన వ్యయాల దృష్ట్యా చిన్నపాటి పెంపు కూడా లక్షలాది కుటుంబాలకు ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. జనవరి 2026 డీఏ పెంపు ఎంత ఉండవచ్చు?

ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం నుంచి 4 శాతం వరకు డీఏ పెరిగే అవకాశం ఉంది.

2. డీఏ పెరిగితే పెన్షనర్లకు ఏమైనా లాభం ఉంటుందా?

అవును, ఉద్యోగులకు పెరిగినంత శాతమే పెన్షనర్లకు కూడా 'డియర్నెస్ రిలీఫ్' (డీఆర్​) రూపంలో పెన్షన్ పెరుగుతుంది.

3. ప్రస్తుతం డీఏ ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది?

ప్రస్తుతం ఉన్న 50 శాతం డీఏ, తాజా పెంపుతో 53 శాతం లేదా 54 శాతానికి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks