...
...
Next Story

డీలిమిటేషన్ కమిషన్‌లో ఎవరెవరు ఉంటారు? బిల్లు ముసాయిదా వివరాలివే

నవంబర్ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న వేళ డీలిమిటేషన్ బిల్లు వివరాలను ఇక్కడ చూడొచ్చు. సుప్రీంకోర్టు జడ్జి, ఎన్నికల కమిషనర్లతో ముగ్గురు సభ్యుల కమిషన్ ఏర్పాటును ఈ బిల్లు ప్రతిపాదించింది.

Published on: Nov 28, 2026, 08:45:15 IST
Advertisement

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ కోసం కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రం సిద్ధమైంది. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హెచ్‌టీ (హిందుస్తాన్ టైమ్స్) సేకరించిన బిల్లు ప్రతి ప్రకారం, పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించి, రాష్ట్రపతి సమ్మతితో చట్టంగా మారిన వెంటనే ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు.

డీలిమిటేషన్ కమిషన్‌లో ఎవరెవరు ఉంటారు?
డీలిమిటేషన్ కమిషన్‌లో ఎవరెవరు ఉంటారు?

ఈ కొత్త బిల్లుతో పాటు రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026ను కూడా ప్రభుత్వం తీసుకురానుంది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే తొలి డీలిమిటేషన్ అనంతరం మహిళలకు మూడో వంతు కోటా కల్పించేలా రాజ్యాంగ నిబంధనలను సవరించడమే దీని లక్ష్యం. ప్రత్యేక సమావేశాలకు ముందు శుక్రవారం కేంద్ర కేబినెట్ ఈ సవరించిన చట్టానికి ఆమోదం తెలిపింది.

ముగ్గురు సభ్యుల కమిషన్ స్వరూపం

బిల్లులోని సెక్షన్ 3 ప్రకారం డీలిమిటేషన్ కమిషన్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా మాజీ జడ్జిని కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) లేదా ఆయన నామినేట్ చేసిన ఎన్నికల కమిషనర్ హోదా రీత్యా (ఎక్స్-అఫీషియో) సభ్యుడిగా ఉంటారు. సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఎక్స్-అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తారు.

సెక్షన్ 6 కింద ఆకస్మిక ఖాళీని భర్తీ చేసేందుకు తప్ప, ఎన్నికల కమిషనర్ నామినేషన్ తర్వాత మరోసారి అదే నిబంధన కింద ఆ నామినేషన్ చేయబోమని బిల్లు స్పష్టం చేసింది. మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల విషయంలో మూడో సభ్యుడిని ఆయా రాష్ట్రాల గవర్నర్లు నామినేట్ చేస్తారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై స్పష్టత

ప్రతి రాష్ట్రం నుంచి పది మందిని అసోసియేట్ సభ్యులుగా కమిషన్‌తో అనుసంధానం చేయాలని బిల్లు ప్రతిపాదించింది. వీరిలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు లోక్‌సభ ఎంపీలు, ఐదుగురు శాసనసభ సభ్యులు ఉంటారు. ఐదు లేదా అంతకంటే తక్కువ మంది ఎంపీలు ఉన్న రాష్ట్రాల్లో, ఎంపీలందరినీ అసోసియేట్ సభ్యులుగా తీసుకుంటారు. దానికి అనుగుణంగా మొత్తం అసోసియేట్ సభ్యుల సంఖ్యను తగ్గిస్తారు.

అయితే ఈ అసోసియేట్ సభ్యులకు ఓటు వేసే హక్కు ఉండదు. కమిషన్ తీసుకునే ఏ నిర్ణయంపైనా సంతకం చేసే అధికారం కూడా వీరికి లేదు. ఎంపీలను లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేస్తారు. సభ కూర్పును దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలను ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు నామినేట్ చేస్తారు.

రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, సర్వేయర్ జనరల్, ప్రభుత్వ అధికారులు, భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) నిపుణులు, ఇతర సంబంధిత వ్యక్తుల సాయాన్ని కూడా కమిషన్ తీసుకోవచ్చు.

కమిషన్ పదవీకాలం, విధులు ఇవే

బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే, కమిషన్ పదవీకాలాన్ని కేంద్రం నోటిఫికేషన్ ద్వారా ఖరారు చేస్తుంది. కమిషన్ అభ్యర్థన మేరకు అవసరమైనంత కాలం పదవీకాలాన్ని పొడిగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

ఈ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా కమిషన్ రెండు ప్రధాన పనులు చేస్తుంది. తాజా జనాభా లెక్కల ఆధారంగా ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాన్ని భౌగోళిక నియోజకవర్గాలుగా విభజిస్తుంది. అలాగే లోక్‌సభలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపును, ప్రతి రాష్ట్ర శాసనసభలోని మొత్తం సీట్ల సంఖ్యను పునఃసర్దుబాటు చేస్తుంది.

 

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks