ఇండిగో విమానాల సంఖ్య తగ్గింపు: కఠిన చర్యలకు దిగిన కేంద్ర ప్రభుత్వం!

ఇండిగోకు డీజీసీఏ షాక్​ ఇచ్చింది! ఇటీవల సంక్షోభం నేపథ్యంలో సంస్థపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు మొత్తం విమానాల సంఖ్యను 5శాతం తగ్గించుకోవాలని స్పష్టం చేసింది.

Published on: Dec 09, 2025 12:18 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశ విమానయాన రంగంలో పెను సంక్షోభానికి కారణమైన ఇండిగోపై చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం చెప్పిన కొన్ని రోజులకే, ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండిగో విమానాల సంఖ్యను 5శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

ఇండిగో విమానాల సంఖ్య తగ్గింపు..
ఇండిగో విమానాల సంఖ్య తగ్గింపు..

డీజీసీఏ ఉత్తర్వుల్లో ఏముందంటే..

డీజీసీఏ ఉత్తర్వులలోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి:

"డీజీసీఏ జారీ చేసిన వింటర్ షెడ్యూల్ (డబ్ల్యూఎస్​) 2025 ప్రకారం, ఇండిగోకు వారానికి 15,014 డిపార్చర్‌లకు (విమానాలు బయలుదేరడం) అమోదం ఉంది. నవంబర్ 2025 నెలలో మొత్తం 64,346 విమానాలు నడపడానికి అనుమతి లభించింది. అయితే, ఇండిగో సమర్పించిన కార్యాచరణ డేటా ప్రకారం, నవంబర్ 2025లో 59,438 విమానాలు మాత్రమే నడిపింది. ఈ నెలలో 951 విమానాలు రద్దు అయినట్లు రికార్డు అయింది," అని నోటీసులో పేర్కొన్నారు.

"సమ్మర్ షెడ్యూల్ (ఎస్​ఎస్​25)తో పోలిస్తే, ఇండిగోకు ఎస్​ఎస్​25లో 351 విమానాలకు బదులుగా 403 విమానాలతో షెడ్యూల్‌ను 6% పెంచడానికి అనుమతి లభించింది. అయితే అక్టోబర్ 2025లో 339 విమానాలు, నవంబర్ 2025లో 344 విమానాలను మాత్రమే ఎయిర్‌లైన్ నిర్వహించగలిగింది," అని నోటీసు తెలిపింది.

5% విమానాల తగ్గింపు ఆదేశం..

ఎయిర్‌లైన్ ఈ షెడ్యూల్‌లను సమర్థవంతంగా నిర్వహించలేకపోయిందని నోటీసు పేర్కొంది. దీనితో రివైజ్డ్ షెడ్యూల్‌ను బుధవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఆదేశించింది.

"అయితే, ఎయిర్‌లైన్ ఈ షెడ్యూల్‌లను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యాన్ని ప్రదర్శించలేదు. కాబట్టి, అధిక డిమాండ్, అధిక ఫ్రీక్వెన్సీ ఉన్న విమానాలతో పాటు అన్ని సెక్టార్లలో షెడ్యూల్‌ను 5% తగ్గించాలని ఆదేశించాము. అలాగే, ఇండిగో ద్వారా ఒక సెక్టార్‌లో ఒకే విమాన కార్యకలాపాలను నివారించాలని సూచించాము. ఇంకా, డిసెంబర్ 10, 2025 సాయంత్రం 5 గంటల్లోగా సవరించిన షెడ్యూల్‌ను సమర్పించాలని కోరాము," అని ఆ నోటీసులో ఉంది.

మంత్రి వ్యాఖ్యలు, విచారణ కమిటీ..

ఇండిగోకు ప్రభుత్వం శుక్రవారం షోకాజ్​ నోటీసును ఇచ్చింది.ఈ నోటీసుకు లభించే సమాధానం.. మధ్యంతర చర్య తీసుకోవాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు సోమవారం హెట్​టీకి తెలిపారు.

"అయితే, డీజీసీఏ ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నివేదిక సమర్పించే వరకు మేము వేచి చూస్తాము," అని ఆయన అన్నారు.

గడువు పెంపు కోరిన ఇండిగో..

వాస్తవానికి, ఇండిగో ఎయిర్‌లైన్ సోమవారం సాయంత్రంలోగా వివరణాత్మక ప్రతిస్పందనను సమర్పించాల్సి ఉన్నప్పటికీ, వివరణాత్మక సమాధానం కోసం 15 రోజుల పొడిగింపును కోరింది. అయితే, డీజీసీఏకు సమర్పించిన సంక్షిప్త సమాధానంలో, తాము ఎదుర్కొన్న సామూహిక విమానాల రద్దుకు "కాంపౌండింగ్​ ఎఫెక్ట్​ ఆఫ్​ మల్టిపుల్​ ఫ్యాక్టర్స్​ (వివిధ కారణాల కలయిక)" కారణమని పేర్కొంది.

సామూహిక రద్దుకు కారణాలుగా "చిన్న సాంకేతిక లోపాలు," శీతాకాలం ప్రారంభం కారణంగా షెడ్యూల్‌లో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ, ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ ఫేజ్ II ఫ్రేమ్‌వర్క్ కింద అప్‌డేట్ చేసిన సిబ్బంది-రోస్టరింగ్ నిబంధనల అమలును ఇండిగో ఉటంకించింది. సమగ్ర మూల కారణ విశ్లేషణ (ఆర్​సీఏ) నిర్వహించడానికి అదనపు సమయం కావాలని ఇండిగో అభ్యర్థించింది. డీజీసీఏ విధానాల్లోనే షోకాజ్ నోటీసులకు ప్రతిస్పందించడానికి పదిహేను రోజుల గడువు ఉంటుందని కూడా ఇండిగో గుర్తు చేసింది.