భారత స్టాక్ మార్కెట్లో డొమెస్టిక్ ఫండ్స్ జోరు: 14 రంగాల్లో వాటాల పెంపు
భారతీయ స్టాక్ మార్కెట్‌లో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల (DIIs) పట్టు మరింత బిగిస్తోంది. నిఫ్టీ 500 సూచీలో వీరి వాటా రికార్డు స్థాయిలో 21 శాతానికి చేరగా, విదేశీ రంగా కంటే స్వదేశీ ఆర్థిక వ్యవస్థ ఆధారిత రంగాలపైనే ఫండ్ మేనేజర్లు ఎక్కువ నమ్మకం చూపిస్తున్నారు.
భారతీయ స్టాక్ మార్కెట్‌లో మన దేశానికి చెందిన మ్యూచువల్ ఫండ్లు, భీమా కంపెనీలు (DIIs) తమ పెట్టుబడులను భారీగా పెంచుతున్నాయి. జూన్ నాటికి నిఫ్టీ 500 కంపెనీల్లో DIIల వాటా ఆల్ టైమ్ గరిష్ఠమైన 21 శాతానికి చేరుకుంది.
సాధారణంగా స్టాక్ మార్కెట్‌లో రీటైల్ పెట్టుబడిదారులకు DIIల కదలికలు ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. వీరు మొత్తం 24 రంగాలలో 14 రంగాల్లో తమ వాటాలను పెంచుకోగా, 6 రంగాల్లో తగ్గించుకున్నారు. మరో 4 రంగాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. విదేశీ డిమాండ్‌పై ఆధారపడే రంగా కంటే, భారతీయ ఆర్థిక వ్యవస్థతో నేరుగా ముడిపడి ఉన్న రంగాలపైనే ఈ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి.
ఏ రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి? ఏవి తగ్గాయి?
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, గతేడాదితో పోలిస్తే డొమెస్టిక్ ఫండ్లు తమ పోర్ట్‌ఫోలియోను గణనీయంగా మార్చాయి.
పెట్టుబడులు పెరిగిన రంగాలు: హెల్త్‌కేర్, ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎన్‌బీఎఫ్‌సీలు (NBFCs), ప్రభుత్వ రంగా బ్యాంకులు (PSU Banks), టెలికామ్, రిటైల్, యుటిలిటీస్.
పెట్టుబడులు తగ్గించిన రంగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), కన్స్యూమర్, ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, కెమికల్స్, ఇన్సూరెన్స్.
పెద్ద మొత్తంలో నిధులను నిర్వహించే ఫండ్ మేనేజర్లకు నగదు లభ్యత (Liquidity) ఎక్కువగా ఉండే బ్యాంకు, టెలికామ్, ఆటో రంగాల్లో పెట్టుబడులు పెట్టడం సులువవుతుంది. ఐపీఓల ద్వారా కొత్త కంపెనీలు మార్కెట్లోకి వస్తున్నప్పటికీ, ఫండ్ మేనేజర్లు స్థిరమైన ప్రదర్శన ఇచ్చే పాత కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
స్వదేశీ ఆర్థిక వ్యవస్థపైనే పూర్తి నమ్మకం
ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలు తక్కువ వడ్డీ రేట్లు, పెరిగిన వినియోగం వల్ల ప్రయోజనం పొందుతున్నాయి. టెలికామ్ రంగం డిజిటల్ మౌలిక సదుపాయాల పరంగా దీర్ఘకాలిక లాభాలను అందిస్తోంది.
"పెరుగుతున్న వాటాలు దేశీయ ధనం ఎక్కడ జమ అవుతుందో చెబుతున్నాయి. అయితే బెంచ్‌మార్క్‌లతో పోలిస్తే ఫండ్ మేనేజర్లు మార్కెట్ రికవరీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది" అని టెంపుల్టన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ సీనియర్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ హరి శ్యామ్‌సుందర్ తెలిపారు.
5 ప్రధాన రంగాల్లోనే 60 శాతం పెట్టుబడులు
DIIల మొత్తం పెట్టుబడులలో దాదాపు 59.6% వాటా కేవలం ఐదు రంగాలలోనే కేంద్రీకృతమై ఉంది.
- బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI): 29.4%
- ఆటోమొబైల్స్: 7.9%
- కన్స్యూమర్: 7.6%
- క్యాపిటల్ గూడ్స్: 7.4%
- ఆయిల్ అండ్ గ్యాస్: 7.3%
కొద్ది రంగాల్లోనే భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల మార్కెట్ ప్రతికూలంగా మారితే రిస్క్ పెరుగుతుందా అనే సందేహాలు రావచ్చు. "బిఎస్ఈ 500 సూచీలోనే బిఎఫ్ఎస్‌ఐ వాటా దాదాపు 27 శాతంగా ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ఒకే రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం కాదు, మార్కెట్ స్వరూపానికి అద్దం పట్టడమే. దేశీయ రుణాలు, వినియోగం పెరిగినప్పుడు ఆర్థిక రంగం ముందుగా లాభపడుతుంది" అని క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ సరీన్ పేర్కొన్నారు.
అయితే, రుణాల వృద్ధి మందగించినా లేదా వడ్డీ రేట్ల చక్రం మారినా బ్యాంకింగ్ రంగానికి ఇబ్బందులు తప్పవని, అందుకే మిగతా రంగాల్లోనూ వైవిధ్యం (Diversification) పాటించడం ముఖ్యమని ఆయన సూచించారు.
ఏ రంగాలకు దూరంగా ఉంటున్నారు?
భవిష్యత్తు ఆదాయాలపై స్పష్టత లేని లేదా భారీ క్యాపిటల్ అవసరమయ్యే రంగాల విషయంలో DIIలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సామ్కో మ్యూచువల్ ఫండ్ సిఐఓ ఉమేష్‌కుమార్ మెహతా ప్రకారం.. ఎనర్జీ (ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్), మైనింగ్, మెటల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో వృద్ధిపై అనిశ్చితి ఉండటంతో ఫండ్ మేనేజర్లు వీటిలో వాటాలను పరిమితంగానే ఉంచారు. స్పష్టమైన ఆర్థిక బలం, క్రమబద్ధమైన వృద్ధి ఉన్న కంపెనీల వైపే నిధులు మళ్లుతున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. DIIs అంటే ఎవరు?
DIIs (Domestic Institutional Investors) అంటే భారత్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెన్షన్ ఫండ్లు, ఇతర స్థానిక ఆర్థిక సంస్థలు.
2. నిఫ్టీ 500లో DII వాటా 21 శాతానికి చేరడం దేనికి సంకేతం?
భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్లు, సిప్ (SIP)ల ద్వారా పెడుతున్న పెట్టుబడులు నిరంతరం పెరుగుతున్నాయని, స్వదేశీ ఆర్థిక వ్యవస్థపై స్థానిక ఫండ్ మేనేజర్లకు పూర్తి నమ్మకం ఉందని ఇది తెలియజేస్తోంది.
3. డొమెస్టిక్ ఫండ్లు ప్రస్తుతం ఏ రంగంపై ఎక్కువ ఆధారపడుతున్నాయి?
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) రంగంలోనే DIIలు అత్యధికంగా 29.4% పెట్టుబడులను కేటాయించాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


