Mutual funds : మార్కెట్ పడిపోతోందని సిప్ ఆపేస్తున్నారా? మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ 5 తప్పులు చేస్తే భారీ నష్టం!

Mutual Fund SIP : మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులకు సిప్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, చాలా మంది ఇన్వెస్టర్లు కొన్ని సాధారణ తప్పులు చేయడం వల్ల ఆశించిన స్థాయిలో లాభాలు గడించలేకపోతున్నారు. ఆ తప్పులు ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Jun 11, 2026, 15:22:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mutual Fund SIP Common Mistakes : షేర్ మార్కెట్​లో టైమింగ్ కోసం ఎదురుచూడటం కంటే.. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయా? అంటే.. ఖచ్చితంగా వస్తాయని ప్రస్తుత ట్రెండ్స్ రుజువు చేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే.. మ్యూచువల్​ ఫండ్​ సిప్​. భారతదేశంలోని సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ 'సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్' (సిప్) ఒక అద్భుతమైన సంపద సృష్టి సాధనంగా మారింది. ఆర్థిక రంగంపై పెరుగుతున్న అవగాహన, సులభతరమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, దీర్ఘకాలిక లక్ష్యాలపై ఇన్వెస్టర్లకు ఏర్పడిన నమ్మకం వల్ల ఎస్‌ఐపీల ప్రజాదరణ రోజురోజుకూ పుంజుకుంటోంది.

మ్యూచువల్​ ఫండ్​ సిప్​లో ఈ తప్పులు చేయకండి..
మ్యూచువల్​ ఫండ్​ సిప్​లో ఈ తప్పులు చేయకండి..

గత 10 ఏళ్లలో ఎస్‌ఐపీల సంచలన వృద్ధి

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. గత దశాబ్ద కాలంలో సిప్ పెట్టుబడులు ఊహించని స్థాయిలో వృద్ధి చెందాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఎలాంటి భావోద్వేగాలకు పోకుండా, ఒక స్పష్టమైన లక్ష్యంతో మ్యూచువల్ ఫండ్స్ వైపు అడుగులు వేస్తున్నారని ఈ డేటా చెబుతోంది.

2016 ఏప్రిల్ నెలలో దేశంలో నెలవారీ సిప్ పెట్టుబడుల ప్రవాహం రూ. 3,122 కోట్లుగా ఉంటే, మార్చ్ 2026 నాటికి అది కాస్తా భారీగా పెరిగి రూ. 32,087 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాతి నెలలో స్వల్పంగా తగ్గి రూ. 31,115 కోట్లకు చేరుకున్నప్పటికీ, సిప్ వృద్ధి రేటు మాత్రం ఏమాత్రం తగ్గకుండా స్థిరంగా సాగుతోంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, మ్యూచువల్ ఫండ్స్ ఈ రోజుల్లో దేశంలో ఎంత లోతుగా విస్తరించాయో, అలాగే ఈక్విటీ మార్కెట్ల ద్వారా దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవచ్చనే నమ్మకం ప్రజల్లో ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది.

సిప్ విధానంలో ఇన్వెస్టర్లు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని స్థిరంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడతారు. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల వచ్చే రిస్క్‌ను అధిగమించడానికి, అలాగే దీర్ఘకాలంలో కాంపౌండింగ్ పవర్ ద్వారా భారీగా లాభాలను ఆర్జించడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, సిప్ ప్రక్రియ చూడటానికి చాలా సులభంగా అనిపించినప్పటికీ, చాలా మంది ఇన్వెస్టర్లు కొన్ని ప్రాథమిక తప్పులు చేయడం వల్ల తమ రాబడులను దెబ్బతీసుకుంటున్నారు. అలాంటి 5 సాధారణ తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యూచువల్​ ఫండ్ ఇన్వెస్టర్లు అస్సలు చేయకూడని 5 తప్పులు..

1. స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు లేకపోవడం

మీరు మ్యూచువల్ ఫండ్స్ లేదా నేరుగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు.. "నేను ఈ డబ్బును ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను? దీని ద్వారా నేను ఏం సాధించాలనుకుంటున్నాను?" అనే స్పష్టమైన క్లారిటీ మీకు ఉండాలి. భవిష్యత్తులో ఇల్లు కొనడం, పిల్లల ఉన్నత చదువులు, మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్, లేదా విదేశీ ప్రయాణం వంటి నిర్దేశిత లక్ష్యాల కోసం ఎస్‌ఐపీలను ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పెట్టుబడులకు ఒక క్రమశిక్షణ వస్తుంది. సరైన ప్రణాళిక లేకపోతే, తప్పుడు ఫండ్స్‌ను ఎంచుకునే ప్రమాదం ఉంది. అందుకే, ప్రతి సిప్​ని ఒక నిర్దిష్ట కాలపరిమితికి, మీ రిస్క్ తీసుకునే సామర్థ్యానికి అనుసంధానించుకోవాలి.

2. మార్కెట్ పడిపోతున్నప్పుడు సిప్​లు ఆపేయడం

షేర్ మార్కెట్ ఎప్పుడైనా కొద్దిగా పడిపోగానే చాలా మంది ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతారు. తమ డబ్బు ఎక్కడ మునిగిపోతుందో అనే భయంతో మ్యూచువల్​ ఫండ్ సిప్​లను మధ్యలోనే నిలిపివేస్తారు. నిజానికి, ఇది పెట్టుబడి సూత్రాలకే విరుద్ధం. మార్కెట్ పతనాలు అనేవి ఇన్వెస్టర్లకు ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ యూనిట్లు తక్కువ ధరకే లభిస్తాయి. దీనివల్ల దీర్ఘకాలంలో మార్కెట్ మళ్లీ పుంజుకున్నప్పుడు భారీ లాభాలు వస్తాయి. కాబట్టి, కష్టకాలంలో పెట్టుబడులను అస్సలు ఆపకూడదు. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి.

3. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫీకేషన్​ని పట్టించుకోకపోవడం

ఆర్థిక మార్కెట్లలో ఈక్విటీలు, బాండ్లు, బంగారం, వెండి, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ వంటి రకరకాల అసెట్ క్లాసులు అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు మీ డబ్బు మొత్తాన్ని కేవలం ఒకే రకమైన స్మాల్-క్యాప్ లేదా థీమాటిక్ ఫండ్స్‌లో పెట్టడం వల్ల రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది. మీ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఈక్విటీ, డెట్- హైబ్రిడ్ ఫండ్స్ వంటి విభిన్న కేటగిరీలలో పెట్టుబడులను సమతుల్యంగా విస్తరించాలి. పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం ఉంటేనే దీర్ఘకాలంలో స్థిరమైన, మెరుగైన రాబడులు అందుతాయి.

4. ఎక్స్‌పెన్స్ రేషియో, ఫండ్ పర్ఫార్మెన్స్‌ను గమనించకపోవడం

మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ కోసం కంపెనీలు వసూలు చేసే ఎక్స్‌పెన్స్ రేషియో చాలా ఎక్కువగా ఉన్నా, లేదా సదరు ఫండ్ మార్కెట్లో నిరంతరం పేలవమైన ప్రదర్శన ఇస్తున్నా.. మీ చేతికి వచ్చే నికర లాభాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఒక తెలివైన ఇన్వెస్టర్‌గా మీరు వివిధ మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్లను నిరంతరం గమనిస్తూ, పోల్చి చూసుకోవాలి. పెట్టుబడి పెట్టే ముందు సదరు ఫండ్ యొక్క అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం), ఎక్స్‌పెన్స్ రేషియో, ఫండ్ మేనేజర్ ఎక్స్​పీరియెన్స్, గత రికార్డులను బెంచ్‌మార్క్ సూచీలతో పోల్చి చూసి ఉత్తమమైన ఫండ్స్‌ను ఎంచుకోవాలి.

5. ఆదాయం పెరుగుతున్నా సిప్ మొత్తాన్ని పెంచకపోవడం

చాలా మంది చేసే మరో పెద్ద తప్పు.. ఏళ్ల తరబడి ఒకే సిప్ మొత్తాన్ని కొనసాగించడం. జీతం లేదా ఆదాయం పెరిగినప్పుడు దానికి అనుగుణంగా పెట్టుబడులను పెంచకపోతే, ఆ అదనపు డబ్బు లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్ (అనవసర ఖర్చులు) రూపంలో వృధా అయిపోతుంది. అందుకే, ప్రతి సంవత్సరం మీ ఆదాయ వృద్ధికి అనుగుణంగా ఎస్‌ఐపీ మొత్తాన్ని కూడా కొంత శాతం పెంచుకుంటూ వెళ్లే ‘స్టెప్-అప్ సిప్’ వ్యూహాన్ని అమలు చేయాలి. ఇది దీర్ఘకాలంలో మీ సంపదను ఊహించని స్థాయిలో పెంచుతుంది.

చివరిగా చెప్పాలంటే, ఇన్వెస్టర్లు స్వల్పకాలిక మార్కెట్ హెచ్చుతగ్గులను చూసి భయపడకుండా, తమ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో కొనసాగినప్పుడే సిప్​లు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. స్మార్ట్ ఇన్వెస్టింగ్ అనేది మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో ఊహించడం కాదు; మార్కెట్లో ఎంత ఎక్కువ కాలం స్థిరంగా కొనసాగామనేదే ముఖ్యం.

(గమనిక- మీరు రెగ్యులర్ లేదా డైరెక్ట్ రూట్ ద్వారా ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకున్నా, ముందుగా ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ సురక్షితం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More